భక్తజనులకు కొంగు బంగారం

భక్తజనులకు కొంగు బంగారం
  • మహిమగల స్వయంభు క్షేత్రం
  • వెల్కటూరులో కొలువైన వీరభద్ర స్వామి, సంతాన నాగేంద్ర స్వామి

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: నమ్మిన భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతున్నాడు వీరభద్రుడు.  మహిమగల దేవునిగా పేరుగాంచి, భక్తుల కోరికలు నెరవేర్చే సంతాన నాగేంద్ర స్వామి ఇక్కడే కొలువై ఉన్నాడు. వీరభద్ర స్వామిని నిత్యము ప్రజలు ఎంతో భక్తితో ఆరాధిస్తున్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వీరభద్ర స్వామి సంతాన నాగేంద్ర స్వామి దేవాలయం చరిత్ర ను పరిశీలిస్తే సుమారు 500 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఆలయం ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది. పురావస్తు శాఖ అధికారులు, సిద్ధాంత ప్రముఖలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. పూర్వపు నంగునూరు మండలం వెల్కటూర్ గ్రామ శివారులో స్వయంభుగా వెలసిన వీరభద్ర స్వామి ఏకశిలా విగ్రహం,

నాగ పడగలతో ఉన్న సంతాన నాగేంద్ర స్వామి ఏకశిలా విగ్రహము గ్రామ శివారులోని ఆరుబయట ఉడుగు చెట్లు, వేపచెట్టు, పుట్ట మధ్యలో వందల ఏళ్లుగా కొలువై ఉండేది, గ్రామ పెద్దలతో పాటు సిద్ధాంతిలు ఈ ఆలయం గురించి ఆరా తీయగా 500 సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ ఆలయం ఉన్నట్లు తేలింది. అదేవిధంగా గ్రామంలో నాగులకుంట అని ఒక కుంట ఉన్నది. ఆ కుంటలో ఉపాధి హామీ పని కోసం మట్టి తాగినప్పుడు వేసవిలో పొలాల్లో వేసుకోవడానికి ఓండ్రు మట్టి తవ్వినప్పుడు అనేకచోట్ల దేవత విగ్రహాలు ఉండడం కనిపించింది.  ఆలయాలను పట్టించుకునే నాధుడే లేకపోవడంతో క్రమంగా ధూపదీప నైవేద్యాలకు నోచుకోకుండా మట్టిలో కూరుకుపోయాయి.2006  సంవత్సరములో గ్రామస్తులు ఈ వీరభద్ర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి పరచాలని నిర్ణయించుకోగా అప్పుడే ప్రాంతంలో ఏర్పాటుచేసిన వశిష్ట శ్రీ పరంపర ఆధ్యాత్మిక ట్రస్టు గురువులు ఆలయ పునరుద్ధరణకు నడుం బిగించారు.

వీరభద్ర స్వామి మూలవిరాటు చెట్టు కింద ఉండడంతో దానికి గుడి ఏర్పాటు చేయాలని సంకల్పించి శాశ్వత నిర్మాణం చేపట్టి ప్రతిష్టించాలన్న లక్ష్యంతో కొత్తగా గుడి నిర్మాణాన్ని చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో ప్రస్తుతం వీరభద్ర స్వామికి మంచి విశాలమైన గుడి ఏర్పడింది. ఈ గుళ్లో స్వామివారితో పాటు పార్వతీ దేవిని, గణపతిని, శివలింగాన్ని ప్రతిష్టించారు.ఆంజనేయస్వామిని, సుబ్రహ్మణ్యస్వామిని నందీశ్వరుని గుడి ముందు ప్రతిష్టించారు పక్కనే నవగ్రహ విగ్రహాలను ప్రతిష్టించారు మరోవైపు సంతాన నాగదేవత ఏకశిలా విగ్రహాన్ని వేప చెట్టు కింద ఏర్పాటు చేశారు తరువాత రాతితో తయారు చేయించిన ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు అప్పటినుండి ఈ దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు, నిత్య పూజలు , హోమాలు జరుగుతున్నాయి. ఫలితంగా గ్రామస్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజలు చేస్తూ వీరభద్ర స్వామిని కొలుస్తున్నారు. వేసవిలో హనుమత్ జయంతి పురస్కరించుకొని పలువురు ఆంజనేయ స్వామి భక్తులు దీక్షలో ఉన్నవారు ఈ ఆలయం వద్దనే ఉంటూ ఆలయంలో పూజలు చేస్తూ 11 రోజులపాటు ఆన్న ప్రసాద బిక్షను చేస్తున్నారు.

ప్రతి ఏడు వైశాఖ శుద్ధ ఏకాదశికి వీరభద్ర స్వామి దేవాలయంలో వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మే మొదటి వారంలో ఇక్కడ స్వామివారికి వార్షికోత్సవ పూజలు నిర్వహించారు. వీరభద్ర స్వామికి సుంకుపట్టుట, ఖడ్గంలను ఎదుర్కొనుట, అగ్ని గుండాల ప్రజ్వలనము  భద్రకాళి అమ్మవారికి పూజ  అగ్గిగుండాలు దాటుట , అమ్మవారి అభిషేకము, అలంకరణ, అన్నప్రసాద వితరణ నిర్వహించారు. వీరభద్ర స్వామికి శాస్త్ర ప్రకారం పూజలు చేస్తే  భక్తులకు కోరికలు తీరుతాయని ఆలయ పూజారి బాణాల బాల్ లింగం తెలిపారు దేవాలయం ఎంతో మహిమాన్విత క్షేత్రమని కొత్తకొండ వీరభద్ర స్వామి తర్వాత వెలకటూరులోనే వీరభద్ర స్వామి కొలువై ఉన్నారని బాణాల బాల్ లింగం తెలిపారు.