హైడ్రా లాగా కరీంనగర్ లో కాడ్రా
- ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో ఏర్పాటుకు కృషి చేస్తా
- అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం
- బీఆర్ఎస్ హయంలో యదేచ్ఛగా భూముల కబ్జా
- ప్రభుత్వ, పేదల భూముల పరిరక్షణకు సీఎంతో చర్చిస్తాం
- వెలిచాల రాజేందర్ రావు
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : ప్రభుత్వ భూముల పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాదులో చేపట్టిన హైడ్రా ఆపరేషన్ లాగా కరీంనగర్ లో కూడా కాట్రా ఏర్పాటుకు కృషి చేస్తానని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో కరీంనగర్లో ప్రభుత్వ ప్రైవేటు భూముల పరిరక్షణకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పేర్కొన్నారు. కరీంనగర్ తోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో గత బీఆర్ఎస్ పాలనలో కోట్లాది రూపాయల ప్రభుత్వ, పేదల భూములు యదేచ్ఛగా కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. హైదరాబాద్ లో ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రాలాగా కరీంనగర్లో ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులను కోరుతామని తెలిపారు.
ఆదివారం వెలిచాల రాజేందర్ రావు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.కరీంనగర్, చుట్టుపక్కల గ్రామాల్లో బీఆర్ఎస్ హాయంలో గత పదేళ్ల కాలంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జా అయ్యాయని తెలిపారు. భూ కబ్జాదారులు, అక్రమ కట్టడాల నిర్మాణదారులు, ఇందుకు సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చేలా చేస్తామని పేర్కొన్నారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చేసే వారి ఆట కట్టిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలతో కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి పేదల భూములను కబ్జా చేసిన కొంతమంది కార్పొరేటర్లు, నాయకులను అరెస్టు చేసి జైలుకు పంపించారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సిపి అభిషేక్ మహంతి నిజాయితీగా పని చేస్తూ ప్రజల మన్ననలు పొందుతు న్నారని పేర్కొన్నారు. పేదలకు న్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.
ఎల్ఎండి రిజర్వాయర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున జరిగాయని, రిజర్వాయర్లు అక్రమణాలు పెరిగాయని, గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన గత పాలకులు, నాయకులే దగ్గరుండి ప్రభుత్వ భూముల కబ్జా లో ప్రధాన పోషించడం దారుణమని మండిపడ్డారు. పేదల భూములను సైతం కబ్జా చేసి జలగల్లాగా పట్టిపీడించారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. హైడ్రాలాగా కరీంనగర్లో ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులను కలిసి విన్నవిస్తామని పేర్కొన్నారు. తద్వారా ప్రభుత్వ భూముల పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.
హైడ్రాలాగా కరీంనగర్లో కాడ్రా వ్యవస్థను వివిధ శాఖల అధికారులతో పాటు పోలీసు అధికారులతో కలిసి ఒక అథారిటీని ఏర్పాటు చేసేలా చూస్తామని చెప్పారు. ప్రభుత్వ భూములు కబ్జా చేయాలంటే అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్లో పేదల భూములను లాక్కున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, పేదలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. చెరువులు, కుంటలు, కాలువల కబ్జాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెప్పారు.అక్రమ నిర్మాణాలు భూముల కబ్జాపై ఉక్కు పాదం మోపుతూ ఇకముందు కబ్జాలు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలిపారు. పేదలు ఎలాంటి ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.