ప్రియాంక గాంధీ విజయంతో కాంగ్రెస్ కు పునర్ వైభవం
- జార్ఖండ్ లో రెండోసారి ఇండియా కూటమి విజయం హర్షనీయం
- వచ్చే ఎన్నికల్లో మోడీ ఓటమి ఖాయమైంది
- వెలిచాల రాజేందర్ రావు
ముద్ర ప్రతినిధి కరీంనగర్ :వాయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అఖండ మెజార్టీతో విజయం సాధించడంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం రాబోతున్నదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ భారీ విజయం వైపుగా దూసుకెళ్తున్నందుకు ఆమెకు రాజేందర్ రావు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
శనివారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ జార్ఖండ్ రాష్ట్రంలో రెండోసారి ఇండియా కూటమి అధికారంలోకి రావడం హర్షనీయమని పేర్కొన్నారు. అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసి ఇండియా కూటమిని గెలిపించారని తెలిపారు. ఇండియా కుటుంబంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్మి ఓట్లు వేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ కరిష్మా వల్లే జార్ఖండ్లో ఇండియా కూటమి విజయం సాధించిందని పేర్కొన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నామని, మహారాష్ట్రలో లాడ్లీ బెహనాతో పాటూ అన్నీ స్కీమ్ లు తూచ్ అనకుండా తూచా తప్పకుండా అమలు చేయాలని ఎన్డీఏ పక్షాలను కోరారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఓటమికి గల కారణాలపై సమీక్షించుకుంటామని పేర్కొ న్నారు. గ్రౌండ్ లెవెల్ లో మరింత కష్టపడి పనిచేసి తిరిగి మహారాష్ట్రలో ప్రజల ఆమోదం పొందుతామని ధీమా వ్యక్తం చేశారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోడీ ఓడిపోవడం ఖాయమని, తిరిగి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని రాజేందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఓటమిపై పార్టీ అధిష్టానం సమీక్షిస్తుందని, అందుకు గల కారణాలను విశ్లేషించి పార్టీ పునర్వైభవానికి ప్రత్యేక కృషి చేస్తుందని చెప్పారు. గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసే అంశాలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందని, ఇందుకోసం నాయకులు, కార్యకర్తలను సంసిద్ధులు చేస్తుందని పేర్కొన్నారు.
తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగిన ప్రియాంక గాంధీ వాయనాడు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి దాదాపు 3 లక్షల పైగా మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని రాజేందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఇది దేశ రాజకీయాలనే కీలక మలుపు తిప్పబోతుందని, కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద ఎత్తున జోష్ నింపబోతున్నదని ఆనంద వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లేనని, రోజురోజుకు ఆదానీ అవినీతి వ్యవహారం, ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తుండడం వల్ల ప్రధాని మోదీ ప్రజల్లో పలుచన అవుతున్నారని ఆరోపించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.ఆదానీ అవినీతి వ్యవహారాల వల్ల అంతర్జాతీయంగా దేశానికే చెడ్డ పేరు వస్తుందని, ఆదానీని ప్రధాని వెనకేసుకు రావడం సరైంది కాదని పేర్కొన్నారు. దీనిపై గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పిస్తుందని, తద్వారా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతామని రాజేందర్ రావు పేర్కొన్నారు.