కవిత మీద కేటీఆర్ కు అభద్రతాభావం
- కలెక్టర్ పై వ్యాఖ్యలు కేటీఆర్ సంస్కారానికి నిదర్శనం
- వినోద్ కుమార్ ను ఎమ్మెల్సీ బరిలో నిలుపుతే బిఆర్ఎస్ బలమెంటో తెలుస్తుంది
- కాంగ్రెస్ పై పిచ్చి ప్రేలాపనలు చేస్తే తాటతీస్తాం
- వెలిచాల రాజేందర్ రావు
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :తండ్రి కెసిఆర్ ని బ్లాక్ మెయిల్ చేసి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి పార్టీని అందపాతాళానికి తొక్కిన ఘనత మాజీ మంత్రి కేటీఆర్ దని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. కవితపై కేటీఆర్ కు అభద్రత భావం పెచ్చు మీరిందన్నారు. ఎక్కడ ప్రతిపక్ష హోదా లాక్కుంటుందోనన్న భయం లో కేటీఆర్ ఉన్నాడని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై, కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రేలాపనలు చేస్తే తాటతీస్తాం అంటూ హెచ్చరించారు.
బుధవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తాను డమ్మీ క్యాండిడేట్ అయితే బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ నుంచి మూడో స్థానంలో ఎందుకు నిలిచారని ఎద్దేవా చేశారు. మీకు దమ్ముంటే మళ్ళీ అదే వినోద్ కుమార్ ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేయించాలని డిమాండ్ చేశారు. ఫలితంతో బిఆర్ఎస్ బలం ఏంటో తేలిపోతుందని అన్నారు. సొంత జిల్లా సిరిసిల్ల కలెక్టర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం కేటీఆర్ సంస్కారానికి నిదర్శనం అన్నారు. జైలుకు పోతే సానుభూతి వస్తుందన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను జైల్లో పెడుతుందని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. హరీష్ రావు పై నమ్మకం లేకే అమెరికా పర్యటన రద్దు చేసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందని అన్నారు.