వార్ కంటిన్యూ, ప్రగతిభవన్​ వర్సెస్​ రాజ్ భవన్​

వార్ కంటిన్యూ,  ప్రగతిభవన్​ వర్సెస్​ రాజ్ భవన్​

ప్రగతిభవన్​ వర్సెస్​ రాజ్ భవన్​
సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు పిటిషన్​
10 బిల్లులు పెండింగులో పెట్టారని కంప్లయింట్
పిటిషన్ దాఖలు చేసిన స్టేట్ చీఫ్ సెక్రెటరీ
బిల్లులు ఆమోదించేలా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
గవర్నర్ ను ప్రతివాదిగా చేర్చిన ప్రభుత్వం
పిటిషన్ పై నేడు విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవే
–  పంచాయ‌తీరాజ్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు
– మున్సిప‌ల్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు
– మోటార్ వెహిక‌ల్ టాక్సేష‌న్ స‌వ‌ర‌ణ బిల్లు
– వ్యవసాయ విశ్వవిద్యాలయం స‌వ‌ర‌ణ బిల్లు
– తెలంగాణ విశ్వవిద్యాల‌యాల ఉమ్మడి నియామ‌క బోర్డు బిల్లు
– ములుగులో అట‌వీ కళాశాల‌, ప‌రిశోధ‌నా సంస్థను అట‌వీ వ‌ర్సిటీ అప్‌గ్రేడ్ బిల్లు
– ఆజమాబాద్ పారిశ్రామిక ప్రాంత చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు
– ప‌బ్లిక్ ఎంప్లాయిమెంట్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు
– జీఎస్టీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు
– ప్రైవేట్​ విశ్వవిద్యాల‌యాల చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రగతిభవన్, రాజ్ భవన్​ మధ్య వివాదాలు మరింత ముదురుతున్నాయి. రిపబ్లిక్​ డే ఉత్సవాలు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్​ తమిళి సై సౌందరరాజన్​, సీఎం కేసీఆర్​ మధ్య సయోధ్య కుదిరిందని భావించినా తాజా పరిణామాలతో విభేదాలు తెరపైకి వచ్చాయి. ఈసారి గవర్నర్​పై రాష్ట్ర ప్రభుత్వం తరుపున కొత్త లొల్లి మొదలైంది. రాష్ట్ర గ‌వ‌ర్నర్​త‌మిళిసై వ్యవ‌హారంపై తెలంగాణ స‌ర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  ఏనాడో తీర్మానం చేసి పంపించిన పది బిల్లుల‌ను గ‌వ‌ర్నర్ ఆమోదించ‌క‌పోవ‌డంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌లో ప్రతివాదిగా త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ పేరును చేర్చారు. బిల్లుల‌ను ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిష‌న్ లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్ శుక్రవారం విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. సెప్టెంబ‌ర్ నుంచి 7 బిల్లులు, గ‌త నెల నుంచి 3 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని ప్రభుత్వం పిటిషన్ లో వివరించింది. 

చిన్న గ్యాప్​.. అంతే
గవర్నర్​, కేసీఆర్ మధ్య ముందు నుంచీ వివాదాలు సాగుతూనే ఉన్నాయి. చిన్న గ్యాప్ తరువాత మళ్లీ తెలంగాణ సర్కార్ వర్సెస్ రాజ్ భవన్ వార్ మొదలైంది. ఈసారి ఈ ఫైట్ సుప్రీం కోర్టు దర్బార్ కు చేరింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు ఇలాగే హైకోర్టు వరకు వెళ్లిన ఈ పంచాయితీ ఇప్పుడు ఉన్నత న్యాయస్థానానికి చేరింది. సర్కారు ఈ పిటిషన్​ వేసినా, వివాదం మాత్రం ప్రగతిభవన్, రాజ్ భవన్​ అన్నట్టే సాగుతున్నది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనే ఉత్కంఠను రేపిన వార్.. పెండింగ్ బిల్లుల విషయంలో మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు సుప్రీం వరకు వెళ్లి నువ్వా..నేనా అన్నట్టు మారింది.

బిల్లులు పెండింగ్​ పెట్టారు
ప్రభుత్వం పంపించిన పది బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ పెండింగ్ లో పెట్టారని తెలంగాణ ప్రభుత్వమే సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. చీఫ్ సెక్రటరీ ఈ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేయడం విశేషం. గవర్నర్ వ్యవహారం సరిగా లేదని, ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకపోవడం కరెక్ట్​ కాదంటూ సర్కారు తరుపున పేర్కొన్నారు. ఆరు నెలలుగా బిల్లులను ఆమోదించకుండా తొక్కి పెడుతున్నారని వాదిస్తూనే, గవర్నర్ పరిధి ఏంటీ, ఎందుకు బిల్లులు ఆమోదించడం లేదనే విషయాన్ని సుప్రీం కోర్టులోనే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే పిటిషన్ దాఖలు చేస్తూ బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశముంది. రిట్ పిటిషన్ విచారణతో గవర్నర్ పరిధి ఏంటీ అనే విషయంలో స్పష్టత వస్తుందని, బీజేపీ పాలనలో గవర్నర్ల తీరును దేశవ్యాప్తంగా తీసుకెళ్లినట్టు అవుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఈ ఉద్దేశంతోనే సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. 

బీజేపీ ఎదురుదాడి
మరోవైపు ఈ విషయంలో బీజేపీ ఎదురుదాడికి దిగుతున్నది. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుగా ఉందంటూ బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ సెటైర్​ వేశారు. రాజ్యాంగ పరిధిలో బిల్లులు గవర్నర్ ఆమోదిస్తారని, రాజ్యాంగ పరిధికి భిన్నంగా ఉంటే బిల్లులను ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న కేసీఆర్​పై సుప్రీం కోర్టులో ఎన్ని పిటిషన్లు వేయాలని నిలదీస్తున్నారు. అధికారం ఉంది కదా అని చట్ట, న్యాయ, ప్రజా వ్యతిరేక బిల్లులను పంపిస్తే రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్ ఎలా ఆమోదిస్తారని ఎదురు దాడికి సిద్ధమవుతున్నది. 

వివాదాలే
గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ బాద్యతలు చేపట్టిన దగ్గరనుండి ప్రభుత్వంతో  వివాదాలు వెలుగుచూస్తున్నాయి. అనేక అంశాలలో  కావాలనే గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా ఆరోపిస్తుంటే, గవర్నర్ వ్యవస్థను ప్రభుత్వం చులకనగా చూస్తుందని రాజ్​భవన్​ వర్గాల ఆరోపణ. దీంతో సీఎం వర్సెస్ గవర్నర్ గా మారింది. దీంతో గవర్నర్ వ్యవస్థకు కేసీఆర్​కు మధ్య ఊహించని దూరం పెరిగింది. ఇప్పటి వరకు ఏ గవర్నర్ వచ్చినా ప్రభుత్వం, సంక్షేమ పథకాలను అభినందిస్తూనే ఉంటారు. కానీ ఈ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇప్పటి వరకూ అలా సంభోదించిన అంశాలు తక్కువే. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో మాత్రమే కొంతమేరకు మాత్రమే ప్రభుత్వ విధానాలను చదివి వినిపించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పాడి కౌశిక్​ రెడ్డి ఎంపిక మొదలు కొని స్వాతంత్ర్య దినోత్సవ, గణతంత్ర దినోత్సవ నిర్వహణ, అసెంబ్లీ సమావేశాల వరకూ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే గవర్నర్​ ఉంటూ వస్తున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు సంతకం చేయకుండా వదిలేస్తున్నారు. దీనిపై మంత్రులు, ప్రజా ప్రతినిధులు గవర్నర్ పై విరుచుకుపడిన సందర్బాలు కూడా ఉన్నాయి. 

రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేసిన గవర్నర్ విధానాన్ని కూడా ప్రభుత్వ వర్గాలు పూర్తి స్థాయిలో వ్యతిరేకించాయి. రాజ్ భవన్ ఉద్యోగులు ఫోన్లను ట్యాప్ చేసి అప్రజాస్వామిక పద్ధతిలో విషయాలను తెలుసుకునేందుకు ప్రభుత్వంలోని కొంత మంది ప్రయత్నించారని స్వయంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరోపించారు. ఇలా వివాదాలు మరింత ముదిరాయి. ఇటీవల గణతంత్ర వేడుకలను పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు ప్రభుత్వం విముఖత చూపడం, కోర్టు జోక్యం చేసుకోవడంతో మళ్లీ వేడుకలను నిర్వహించడం విదితమే. ఇక అత్యంత కీలకంగా జరిగే బడ్జెట్ సమావేశాల సందర్బంగా గవర్నర్ ప్రారంభోపన్యాసం పట్ల కూడా గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగంపై కోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం అనూహ్యంగా వెనక్కు తగ్గింది. ఆ తర్వాత సీఎం కేసీఆర్​తరపున వెళ్లిన మంత్రులు గవర్నర్​ పిలువడం, అసెంబ్లీకి వచ్చిన గవర్నర్​ తో కేసీఆర్​ కలుపుగోలుగా వ్యవహరించడంతో వివాదాలు సద్దుమణిగాయనే అభిప్రాయానికి వచ్చారు. కానీ, తాజాగా గవర్నర్​ దగ్గర ఉన్న 10 పెండింగ్​ బిల్లులపై సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేయడంతో.. ఈ వివాదాలు ముదురుతున్నాయని స్పష్టమవుతున్నది.