చల్లారని మంటలు!

చల్లారని మంటలు!
  • మణిపూర్​ఘటనపై ఉభయ సభల్లో మాటల యుద్ధం
  • చర్చకు విపక్షాల పట్టు.. సిద్ధమన్న కేంద్ర ప్రభుత్వం
  • ఢిల్లీ ఆర్డినెన్స్ పై చర్చ.. ఆప్​ఎంపీ సస్పెండ్​
  • 31 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • ఆగస్టు 11 వరకు సమావేశాలు

న్యూఢిల్లీ: మణిపూర్​ఘటనపై సోమవారం కూడా పార్లమెంట్​దద్దరిల్లింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ నేపథ్యంలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికార పక్షం ప్రకటించగా తాము కోరుకున్న 267 అధికర ప్రకారం చర్చ కొనసాగించాలని విపక్షాలు డిమాండ్​చేశాయి. ఈ నేపథ్యంలో విపక్షాల నినాదాలతో ఇరుసభలు వాయిదా పడినా, తిరిగి ప్రారంభమైన అనంతరం కూడా అదే పరిస్థితులు ఉత్పన్నం కావడంతో ఉభయ సభలను మంగళవారానికి వాయిదా వేశారు. ఆప్​ఎంపీని రాజ్యసభ చైర్మన్​ జగదీప్​ధన్​ఖర్​వర్షాకాల సమావేశాలకు హాజరు కాకుండా సస్పెన్షన్​ విధించారు. సంజయ్​సింగ్​ఢిల్లీ అంశం, ఆర్డినెన్స్​పై చర్చ జరగాలని చైర్మన్​కుర్చీ వద్దకు వెళ్లి డిమాండ్​ చేస్తూ గట్టిగా నినాదాలు చేశారు. పలుమార్లు కూర్చొని మాట్లాడాలని విన్నవించినా సంజయ్​వినకపోవడంతో అతన్ని ఈ సమావేశాల్లో సస్పెండ్​చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీ సస్పెండ్​ తీర్మానాన్ని కేంద్రమంత్రి పీయూష్​గోయల్​ప్రవేశపెట్టగా మూజువాణితో ఆమోదించి అతనిపై వర్షాకాల సమావేశాల్లో పాల్గొనకుండా వేటేశారు. 

  • మహిళలపై హింస ముమ్మాటికీ తప్పే : ప్రధాని మోడీ

మణిపూర్​అంశంపై ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ మణిపూర్​ఘటన నాగరిక సమాజానికి అవమానకరమైన సంఘటన అన్నారు. మహిళలపై హింస ఏ రూపంలో ఉన్నా అది తప్పే అన్నారు. హింస ద్వారా దేశ కీర్తి ప్రతిష్టలు దిగజార్చే చర్యలను సహించబోమన్నారు. ప్రధాని మాట్లాడుతున్న సమయంలో కూడా విపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి. 

  • విపక్షాలవి రెండు నాల్కల ధోరణి : షా

పార్లమెంట్​లో అమిత్​షా మాట్లాడుతూ మణిపూర్​అంశంపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నా, విపక్షాలు ఎందుకు ముందుకు రావడం లేదని, చర్చ విషయంలో విపక్షాలు రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తున్నాయన్నారు. ఈ అంశంపై చర్చ విషయాన్ని అడ్డుకొని విపక్షాలు తప్పు చేస్తున్నాయన్నారు. ఈ అంశం దేశంలోని మహిళలు, ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. ప్రధాని కూడా మణిపూర్​ అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించినా విపక్షాలు సున్నితమైన అంశంలో రాజకీయం చేయడం తగదని అమిత్​షా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోందని అందుకే ఈ అంశంపై తప్పకుండా చర్చ జరుపుతామని విపక్షాలు కూడా ఇందుకు సహకరించాలని మరోమారు కేంద్ర మంత్రి అమిత్​షా విజ్ఞప్తి చేశారు. 

సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. రాజ్యసభ వాయిదా పడిన తర్వాత చైర్మన్‌ను కలిసేందుకు వెళ్లి సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌ను ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారీ అన్నారు. మణిపూర్​అంశంపై చర్చ కొనసాగించాలన్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ మణిపూర్​హింస చెలరేగేదుకు కేంద్ర విధానాలే కారణమని ఆరోపించారు. ఈ అంశంపై చర్చించమంటే కేంద్రం తప్పించుకునేందుకు చూస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఈ వర్షాకాల సమావేశాల్లో 31 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ సెషన్​లో మొత్తం 17 సమావేశాలను కేంద్రం నిర్వహించనుంది. వీటిలో 21 కొత్త బిల్లులు కాగా, 10 బిల్లులు ఇప్పటికే పార్లమెంట్‌లోని ప్రవేశపెట్టారు. వాటిపై చర్చించనున్నారు. ఢిల్లీలో అధికారుల బదిలీ-పోస్టింగ్‌కు సంబంధించిన ఆర్డినెన్స్‌పై అత్యంత చర్చనీయాంశమైంది. ఆగస్టు 11వ తేదీ వరకూ సమావేశాలు జరగనున్నాయి. కాగా బిల్లులపై చర్చ నేపథ్యంలో మణిపూర్​ ఘటనపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో ఇరు సభలు రద్దయ్యాయి. 
 

  • చర్చకు నామా వాయిదా తీర్మానం
  • పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం.. చర్చకు డిమాండ్

ముద్ర, తెలంగాణ బ్యూరో : మణిపూర్ హింసాత్మక ఘటనలపై బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ ఎంపీలు చర్చకు పట్టుబట్టడంతో సోమవారం కూడా లోక్ సభలో కార్యకలాపాలు స్తంభించాయి. సభ  ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగింది. మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ నామా నాగేశ్వరరావు సోమవారం కూడా వాయిదా తీర్మానం ఇచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా సభ కార్యకలాపాలు కొనసాగించడంతో పార్టీ  ఎంపీలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ,  మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేయడంతో లోక్ సభ సభ్యుల నినాదాలతో లోక్ సభా హోరెత్తింది. దాంతో  స్పీకర్ ఓంబిర్లా సభను ముందుగా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 12 గంటలకు సభ ప్రారంభం కాగానే మళ్లీ  ఆందోళన కొనసాగించడంతో  సభను మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా పడింది. రెండు గంటలకు సభ పునఃప్రారంభమైన పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో స్పీకర్ సభను మంగళవారానికి  వాయిదా వేశారు.

  • ప్రధాని మోదీ ప్రకటన చేయాలి..

మణిపూర్ అంశంపై చర్చించి, ప్రధాని మోదీ సభాముఖంగా ప్రకటన చేయాలని నామా నాగేశ్వరరావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఒకవైపు చర్చకు నిరాకరిస్తూనే, మరోవైపు చర్చకు సిద్ధమంటూ కేంద్రం ప్రకటించడంపై ఆయన  మండిపడ్డారు. ఎక్కడ వాస్తవాలు బయట పడతాయోనన్న భయంతోనే కేంద్రం మణిపూర్ హింసాకాండ పై చర్చకు అనుమతించకుండా పారిపోతుందని ధ్వజమెత్తారు. కేంద్రం వైఖరిని దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం ముందుకు వచ్చి, మణిపూర్ హింసాత్మక సంఘటనలపైన, ఆ రాష్ట్రంలో శాంతి నెల కొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన సమగ్రంగా చర్చించాలని నామ నాగేశ్వర రావు కోరారు. హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడుకుతూ రావణకాష్టంలా మండుతుందని అన్నారు. శాంతికరమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకొని,వాస్తవాలు  సభ ముందు ఉంచాలని నామ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.