సమస్యల సత్వర పరిష్కారానికి వార్డు కార్యాలయాలు

సమస్యల సత్వర పరిష్కారానికి వార్డు కార్యాలయాలు
  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ముషీరాబాద్, ముద్ర:ప్రజలకు మెరుగైన సేవలు అందించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వార్డు కార్యాలయాలను లను ఏర్పాటు చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని భోలకపూర్ లో స్ధానిక MLA ముఠా గోపాల్ తో కలిసి వార్డు కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన తమ సమస్యల పరిష్కారం కోసం ఇంతకు ముందు వేరు వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. వార్డు కార్యాలయ వ్యవస్థ ఏర్పటుతో జీహెచ్ఎంసీ పరిధిలోని జీహెచ్ఎంసీ, ఎలెక్ట్రికల్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, హార్టికల్చర్ తదితర శాఖల అధికారులు అంతా ఒక్క చోట ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులు సైతం ప్రజల నుండి వచ్చే సమస్యలపై సకాలంలో స్పందించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్ లలో డివిజన్ కు ఒకటి చొప్పున గతంలో 137 వార్డు కార్యాలయాలను ప్రారంభించడం జరిగిందని, మిగిలిన 13 ఆఫీసులను ఈరోజు ప్రారంభించి ప్రజలకు అందుబాటులో కి తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు. ప్రజల సౌకర్యార్థం, ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఇబ్బందులు, అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతూ వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.రాంనగర్ వార్డు కార్యాలయం ప్రారంభించ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు:రాంనగర్ డివిజన్లోని బావిలింగంపల్లి సంజయ్ నగర్ లో రాంనగర్ డివిజన్ వార్డు కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఉప సభాపతి పద్మారావు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ రవిచారిలతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.