ఏప్రిల్‌ 15 నాటికి దర్యాప్తు పూర్తిచేస్తాం: సుప్రీంకు తెలిపిన సీబీఐ

ఏప్రిల్‌ 15 నాటికి దర్యాప్తు పూర్తిచేస్తాం: సుప్రీంకు తెలిపిన సీబీఐ

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు అధికారి మార్పుపై ప్రతిపాదనలను సుప్రీంకోర్టుకు సీబీఐ అందజేసింది. ప్రస్తుత దర్యాప్తు అధికారిగా ఉన్న రామ్‌సింగ్‌ను కొనసాగిస్తూ సీబీఐ ప్రతిపాదనలు అందించింది.  రామ్‌సింగ్‌ను కొనసాగించడంపై న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఆర్‌ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తులో పురోగతి సాధించనపుడు ఆయన్ను కొనసాగించడంలో అర్థం లేదన్నారు. న్యాయమూర్తి అభ్యంతరం నేపథ్యంలో రామ్‌సింగ్‌తో పాటు మరో పేరును సీబీఐ సూచించింది.

ఏప్రిల్ 15వ తేదీ నాటికి వివేకా హత్య కేసు దర్యాప్తును పూర్తి చేస్తామని సుప్రీంకోర్టుకు దర్యాప్తు సంస్థ నివేదించింది.  మరోవైపు కేసు విచారణ ఆలస్యమవుతున్నందున ఏ5 నిందితుడు శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన భార్య తులసమ్మ కోర్టును కోరారు. కొత్త అధికారిని నియమించడం వల్ల దర్యాప్తు పూర్తి కావడానికి కనీసం మూడు నెలలు సమయం పడుతుందని.. ఈలోపు శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని తులసమ్మ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని.. మధ్యాహ్నం 2 గంటలకు దీనిపై ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది.