బి ఆర్ ఎస్ ప్రభుత్వం ను గద్దె దింపినం...

బి ఆర్ ఎస్ ప్రభుత్వం ను గద్దె దింపినం...
  • కవిత ను జైలు కు పంపాము...
  • ఆమె బతుకమ్మ జైలులో ఆడుతుంది..
  • జగదీష్ రెడ్డి ని జైలుకు పంపిస్తాం : మునుగోడు ఎమ్మేల్యే రాజగోపాల్ రెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి : బి ఆర్ ఎస్ ప్రభుత్వం ను గద్దె దింపినం, కవిత ను జైలు కు పంపాము. ఆమె బతుకమ్మ జైలులో ఆడుతుందని ఎక్కువ మాట్లాడితే జగదీష్ రెడ్డినీ రోడ్డు పై తిరగ నీయమనీ , జగదీష్ రెడ్డిని జైలుకు పంపిస్తామని మునుగోడు ఎమ్మేల్యే , కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గ ఇంచార్జి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరై ఆయన మాట్లాడుతూ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నీ అత్యధిక మెజారిటీ తో గెలిపించాలనీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించా ల్సిన విధానాల పై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 21 న నామినేషన్ వేస్తారని, కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు అవుతున్నారని స్వచ్చందంగా భువనగిరి లో 50 వేల మంది కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి సేవలను గుర్తించి అధిష్టానం భువనగిరి ఎంపీ టికెట్ కేటాయించిందనీ అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని , గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్ష కోట్లు అప్పు చేసి నిర్మిస్తే కూలిపోయిందని విమర్శించారు. కిరాయి ఇంట్లో ఉండే బీ ఆర్ ఎస్ పార్టీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి 1000 కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ప్రజల కోసం , వ్యాపారాలు వదిలి మేము సేవ కోసం పని చేస్తున్నామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుస్తారా? అని వ్యంగ్యగా అన్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం రాజకీయ నాయకులు పోటీ పడుతున్నారని అన్నారు. రైతుల రుణ మాఫీ ఆగష్టు లో చేస్తారని ఇప్పటికే సి ఎం ప్రకటించారని గుర్తు చేశారు. ఆర్థిక సంక్షోభంతో ఉన్న రాష్ట్రం లో ప్రభుత్వానికి సమయం కావాలని, అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్తాం అని, తమను గెలిపించిన వారికి రుణ పడి ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య, జిల్లా అధ్యక్షులు అండెం సంజీవ రెడ్డి, కుంభం కీర్తీ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, మండల అధ్యక్షులు ,పట్టణ అధ్యక్షులు, జడ్పిటిసిలు, యంపిపిలు, సర్పంచ్లు, యంపిటిసిలు, యూత్ కాంగ్రెస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.