హరీష్ రావును అడ్డుకుంటాం: బీజేపీ

హరీష్ రావును అడ్డుకుంటాం: బీజేపీ
We will stop Harish Rao BJP leaders

కాళేశ్వరం ముంపు బాధితులను ఆదుకోవాలని డిమాండ్

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: కాలేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైనందున బుధవారం జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రి హరీష్ రావును అడ్డుకుంటామని బిజెపి జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లాలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్ల మంచిర్యాల జిల్లాలోని రైతులు, సామాన్యులు నష్టపోయారని తెలిపారు. మంచిర్యాల పట్టణం, చెన్నూర్, కోటపల్లి, జైపూర్, భీమారం మండలాలు వరద ముంపునకు గురయ్యాయని ఆయన అన్నారు.

నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన మంత్రి హరీష్ రావు గతంలో వరద బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చి విస్మరించారని ఆయన విమర్శించారు. వరదలు వచ్చి రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ రైతులకు, ఇల్లు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం అందలేదని ఆయన తెలిపారు. దండేపల్లి మండలం లోని  గూడెం ఎత్తిపోతల పథకం పైపులైన్ లు నాసిరకం కావడంతో తరచుపగులుతు పంటల కు నీరండం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. నాణ్యమైన పైపులు వేస్తామని చెప్పిన హరీష్ రావు మాట తప్పడం వలన రైతులకు పంటలకు నీరందక ఎండిపోతున్నాయని తెలిపారు. హరీష్ రావు జిల్లాలో పర్యటిస్తున్నందున గూడెం లిఫ్ట్ పరిధిలోని రైతులకు, కాలేశ్వరం బ్యాక్ వాటర్ ద్వారా ముంపున గురవుతున్న బాధితులకు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.