ప్రతి ఇంటికి కాంగ్రెస్ పథకాలను తీసుకెళ్తాం

ప్రతి ఇంటికి కాంగ్రెస్ పథకాలను తీసుకెళ్తాం
  • పార్టీని అధికారంలోకి తీసుకువద్దాం
  • టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్

ముద్ర ,షాద్ నగర్:-విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ప్రజలకు వివరించి కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువద్దామని   టిపిసిసి ప్రధాన కార్యదర్శి, షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను నియోజకవర్గంలోని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బ్లాక్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు,  కార్యకర్తలతో శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ పేదలకు అండగా నిలిచే పార్టీ, ప్రజాస్వామ్య బద్దంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటేనని అన్నారు.  ఈనెల 25వ తేదీన షాద్ నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో బ్లాక్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు కార్యకర్తలు ఎస్సీ, ఎస్ టి, బీసీ, మైనారిటీ, మహిళా సెల్ ల ఆధ్వర్యంలో ఆరు గ్యారంటీలను ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాలని కోరారు.

ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల స్టిక్కర్ ను, గ్యారెంటీ కార్డును అందజేయాలని సూచించారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను,  అవినీతిని ప్రజలకు తెలియజేయాలని తెలిపారు.  2004 వ సంవత్సరంలో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను  ప్రకటిస్తే అప్పటి ప్రతిపక్షాలు ఆచరణకు  సాధ్యం కాని పథకాలని అవహేళన చేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రజా  సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ప్రకటించిన ఆరు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని రాష్ట్ర ప్రజలకు గట్టి నమ్మకం ఉందని, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలలో కొన్ని పథకాలు అమలు అవుతున్నాయని వీర్లపల్లి శంకర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబర్ అలీ ఖాన్, ఎలగమొని యాదయ్య, బాలరాజ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, చెన్నయ్య, తిరుపతి రెడ్డి,  రఘు, పట్లూరి జగదీశ్వర్  ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్ ఎస్ సి ఐ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.