అసలు వ్యూహమేంది?! | Mudra News

అసలు వ్యూహమేంది?! | Mudra News
  • కోమటిరెడ్డి వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంది?
  • బీఆర్ఎస్ తో దోస్తీకే మొగ్గు చూపుతున్నారా!
  • ఉదయం ఓ మాట.. సాయంత్రం మరో మాట 
  • కాంగ్రెస్ లో కలకలం రేపిన ఎంపీ వ్యాఖ్యలు
  • సీనియర్ ల మదిలో పొత్తులకు ప్రయార్టీ!
  • డిగ్గీ రాజా రిపోర్టులో అసలు నిజమేమిటి?
  • కేవీపీ దౌత్యం ఉందని గతంలోనే ఆరోపణులు
  • పోరాడితే అధికారం తమదేనంటున్న శ్రేణులు


రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. కీలక నేతల ప్రసంగాలు, మాటలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్​ అంటే చిరాకుపడే కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఆ పార్టీ మీద పొగడ్తలు కురిపించారు. ఇదే సమయంలో ఆ పార్టీ సీనియర్​నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్​ కలుస్తాయంటూ జోస్యం చెప్పారు. ఢిల్లీలో బీజేపీ సీనియర్​ నేత నితిన్ గడ్కరీతో భేటీ అయిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్​ను ఎదుర్కొనడం ఇక సాధ్యం కాదని ఇటు కాంగ్రెస్ సీనియర్ లు గట్టిగానే అనుకుంటున్నారని భావించాల్సి వస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 


ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల వ్యవహార శైలి ఎలా ఉన్నప్పటికీ, సర్కారు వ్యతిరేకతను ఒడిసిపట్టుకుంటే తామే టాప్​ అంటూ కాంగ్రెస్​ శ్రేణులు క్షేత్రస్థాయిలో భావిస్తున్నాయి. ఒక వైపు ఇలాంటి పరిస్థితి ఉంటే, అసలు కాంగ్రెస్​ను మళ్లీ నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే బీజేపీ నేతలను కలిసిన తర్వాత వెంకట్​రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఉదయం పొత్తులపై హాట్ కామెంట్స్​చేసిన ఆయన సాయంత్రానికే మాట మార్చారు. రాహుల్ గాంధీ చెప్పిన విషయమే తాను చెప్పానంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దాదాపు రెండేండ్ల నుంచి వివాదస్పదంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈసారి తెలంగాణలో హంగ్ అసెంబ్లీ  వస్తుందని, కాంగ్రెస్​తో కేసీఆర్​ కలువాల్సిందేనని, అందుకే అసెంబ్లీలో  కాంగ్రెస్‌ను పొగుడుతూ బీజేపీని తిడుతున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి రాదని, మరో పార్టీతో కలవాల్సిందేనని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సెక్యులర్ పార్టీలని, తాము బీజేపీతో కలిసేది లేదని స్పష్టం చేశారు. సీనియర్ నేతలు అందరూ కలిస్తే కాంగ్రెస్‌కు 40 నుంచి 50 సీట్లు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక, తాను మార్చి మొదటి వారంలో యాత్ర ప్రారంభిస్తానని, స్టార్ క్యాంపైనర్‌నని రాష్ట్రమంతా తిరుగుతానని చెప్పారు. యాదగిరి గుట్ట నుంచి యాత్ర మొదలు పెడతానని, కాంగ్రెస్ కొత్త ఇన్ చార్జి మానిక్ ఠాక్రే వచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి బాగుందని అన్నారు. 

బీజేపీ నేతలతో భేటీ తర్వాతే 
ఇటీవల పలు సందర్భాలలో వెంకట్​రెడ్డి బీజేపీ జాతీయ నేతలతో భేటీ అవుతున్నారు. రాహుల్​గాంధీ చేసిన భారత్​ జోడో యాత్ర రాష్ట్రానికి వస్తే ఆయన కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ టూర్ కు వెళ్లారు. ఆ తర్వాత అమిత్​షా, గడ్కరీ వంటి నేతలను కలుస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వివాదంగా మారుతున్నాయి. బీజేపీ నేతలతో భేటీ తర్వాత కాంగ్రెస్​ పై ఏదో ఒక ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ పరిస్థితి బాగా లేదని, అధికారంలోకి రాదని, హోంగార్డులతో అవసరం లేదని, ఒక్కడే అధికారంలోకి తీసుకువస్తాడంటూ సెటైర్లు వేస్తూ సొంత నేతలను ఎగతాళి చేసే విధంగా మాట్లాడారు. 

ఇప్పుడు శల్యుడి పాత్ర?
కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడి రథసారధి శల్యుడి పాత్రను ఇప్పుడు వెంకట్​రెడ్డి పోషిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ లో కలకలం సృష్టించాయి. కాంగ్రెస్​ పార్టీకి రాష్ట్రంలో గెలిచే సత్తా లేదనడం వారికి ఆశ్చర్యం కలిగించింది. మునుగోడు ఉప ఎన్నికలో కూడా ఆయన మాట్లాడిన మాటలు పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచాయి. టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి పాదయాత్రకు ఆదరణ పెరుగుతున్నది. క్షేత్రస్థాయిలో పార్టీ మళ్లీ బలం పుంజుకుంటుందనే సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో రేవంత్ కు సీనియర్ల మద్దతు పెరుగుతున్నది. నిత్యం రేవంత్​ను విమర్శించే వీహెచ్, సేవ్​ కాంగ్రెస్​ పేరిట తిరుగుబాటు ఎగురవేసిన టీంకు బాధ్యతలు వహించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వంటి వారు పాదయాత్రలో పాల్గొంటున్నారు. వచ్చేదంతా ఎన్నికల సమయం కావడంతో పార్టీ నేతలు ఒక్కటవుతున్నట్లుగా సంకేతాలిస్తున్నారు. వెంకట్ రెడ్డి తాజా ప్రకటన గందరగోళం సృష్టిస్తున్నది. 

నిర్వీర్య కుట్రలేనా?
బీఆర్ఎస్.. కేసీఆర్ పై కాంగ్రెస్​ ఇప్పుడిప్పుడే ఫైర్​ పెంచింది. ధరణి పోర్టల్, పోడు భూములు, దళితులకు మూడెకరాల వంటి అంశాలపై పోరాటానికి దిగింది. నిరుడు రాష్ట్రానికి వచ్చిన రాహుల్​ కూడా బీఆర్​ఎస్ తో పొత్తు ఉండదని, ఒంటరి పోరుకు సిద్ధమని నేతలలో హుషారు నింపారు. ఇటీవల గాంధీభవన్ కు వెళ్లిన వెంకట్​రెడ్డి తాను అసంతృప్తి వ్యాఖ్యలు చేయనని, రేవంత్ తో మాటా, ముచ్చట పెట్టారు. కానీ, రేవంత్​ పాదయాత్రకు మాత్రం అయిష్టత కనబరుస్తున్నారు. తానూ పాదయాత్ర చేస్తానని, రేవంత్ ఒక్కడితోనే కాంగ్రెస్ అధికారంలోకి రాదంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్​ పార్టీని ఒక విధంగా నిర్వీర్యం చేసే విధంగా ఎంపీ నిరుత్సాహపరుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పరోక్షంగా బీజేపీకి ఉపయోగకరంగా మారుతున్నాయని అంటున్నారు. 

కేవీపీ దౌత్యం ఇదేనా?
రాష్ట్రంలోని కొంతమంది సీనియర్లకు ఏపీ నేత కేవీపీ రామచంద్రారావు మద్దతుగా నిలుస్తున్నారనేది జగమెరిగిన సత్యం. రాష్ట్రం విడిపోయినా ఇంకా ఆయన ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్​ నేతలకు, సీఎం కేసీఆర్​ కు ఆయన మధ్యవర్తిగా ఉన్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కేవీపీ తరుచుగా రాష్ట్ర నేతలతో ఢిల్లీలో భేటీ అవుతున్నారు. అటు కేసీఆర్​ తో కూడా సమావేశమవుతున్నట్లు సమాచారం. ఆయన కుటుంబానికి చెందిన ఓ నిర్మాణ సంస్థకు కేసీఆర్​ ప్రాధాన్యతను ఇస్తున్నారు. దీంతో రాష్ట్రంలో కేసీఆర్​, కాంగ్రెస్​ మధ్య పొత్తుకు కేవీపీ రాయబారం చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. కేవీపీ వర్గంలో వెంకట్​రెడ్డి కూడా ఉన్నాడని, కేవీపీ దౌత్యం తెలిసే ఆయన వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతున్నది. 

అసలు డిగ్గీరాజా రిపోర్టులో ఏముంది?
రాష్ట్ర నేతలను సముదాయించేందుకు వచ్చిన సీడబ్ల్యూసీ నేత దిగ్విజయ్ సింగ్ ఇటీవల కీలక నివేదికను ఏఐసీసీకి అందించారు. ఆయన నివేదిక ప్రకారమే రాష్ట్ర పార్టీలో కీలక మార్పులు జరుగుతున్నాయి. సీనియర్లకు పార్టీ పదవులు ఇస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీని మార్చారు. అయితే, దిగ్విజయ్​ వచ్చినప్పుడు కేవీపీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఓవైపు దిగ్విజయ్ కు కేసీఆర్ కు కూడా సన్నిహిత సంబంధాలున్నాయనే ప్రచారం కూడా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్​ ఒంటరిగా అధికారంలోకి రాదని, కేసీఆర్​ తో చేతులు కలుపాల్సిందేనని డిగ్గీరాజా నివేదిక ఇచ్చినట్లు కాంగ్రెస్​ వర్గాల్లోనే టాక్​ నడుస్తున్నది. ఇప్పుడు కోమటిరెడ్డి వ్యాఖ్యలతో ఈ నివేదికల్లో నిజమెంత అనే అనుమానాలు మొదలయ్యాయి. 

పొత్తులు మాకు అవసరం లేదు : మాణిక్​ రావు ఠాక్రే
శంషాబాద్ లోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌ పార్టీకి లేదని చెప్పారు. ఎంపీ కోమటిరెడ్డి ఏం మాట్లాడారో తాను చూడలేదని, పొత్తులపై రాహుల్‌ వరంగల్‌ సభలో చెప్పిందే ఫైనల్‌ అని స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏం మాట్లాడారో తాను చూడలేదని, ఆయనపై పార్టీ నేతలు ఏం మాట్లాడారనే విషయం కూడా తన దృష్టికి రాలేదన్నారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా చర్యలు, మాటలను పార్టీ అధినాయకత్వం నిశితంగా గమనిస్తుందని,అధిష్టానం పరిధిలోనే నిర్ణయాలు ఉంటాయని అన్నారు.  ప్రస్తుతం తన దృష్టి అంతా పాదయాత్రలో ప్రజలు తనకు వివరించే సమస్యల మీదే ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు.