ప్రతిష్టాత్మక తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి ఎవరికి దక్కనుంది?

ప్రతిష్టాత్మక తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి ఎవరికి దక్కనుంది?
  • ముందుగా వినిపించిన పాలకుర్తి రాజయ్య సతీమణి పేరు మారనుందా?
  • మార్కెట్ చైర్మన్ పదవి అరవపల్లి మండలానికి చెందిన నాయకులకు దక్కనుందా?
  • ఎమ్మెల్యే ఎవరి పేరు చెబుతారని దానిపై సర్వత్రా ఉత్కంఠత

తుంగతుర్తి ముద్ర :- సూర్యాపేట జిల్లాలో ప్రతిష్టాత్మకమైన వ్యవసాయ మార్కెట్లలో తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ ఒకటి. మార్కెట్ ప్రారంభం నుండి ప్రాధాన్యత గల తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది .నామినేటెడ్ పదవుల పంపకంలో తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవికి తీవ్రమైన పోటీ ఉంటుంది. మార్కెట్ చైర్మన్ కోసం ద్వితీయ శ్రేణి నాయకులు పోటీ పడడం మార్కెట్ ఏర్పాటయినాటి కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ నిర్ణయం మేరకే చైర్మన్ పదవి  జరుగుతుందనేది తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ జెడ్పిటిసి పాలకుర్తి రాజయ్య సతీమణికి చైర్మన్ పదవి ఇస్తారని ప్రకటనలు రావడం జరిగింది .పాలకుర్తి రాజయ్య సైతం వ్యవసాయ మార్కెట్ పదవి తమకు వస్తుందని ఆశాభవంతో ఉన్నారు. జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మార్కెట్ చైర్మన్ పదవి రాజయ్య కుటుంబానికి కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మార్కెట్ చైర్మన్ పదవి మహిళా రిజర్వేషన్ కావడంతో రాజయ్య సతీమణి ఆ పదవి నిర్వహించలేక పోవచ్చని అందువల్ల వేరే వాళ్లకు ఇవ్వవలసి వస్తుందని రాజయ్యకు నేరుగా చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో రాజయ్య తనకు పదవి ఇస్తారని ముందు చెప్పి ఇప్పుడు పదవి ఇవ్వరని అనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలంగా పనిచేస్తున్నానని ఎన్నడూ ఇతర పార్టీల జోలికి పోలేదని అలాంటి తనకు అన్యాయం చేయవద్దని అంటున్నారు.

ఈ విషయంపై తాను జిల్లా మంత్రులను సైతం కలవనున్నట్లు రాజయ్య తన సహచరుల  వద్ద చెబుతున్నారు. కాగా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిని ఎవరికి ఇవ్వాలో నిర్ణయం మాత్రం ఎమ్మెల్యే చేతుల్లోనే ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. మరి శాసనసభ్యుడు మార్కెట్ చైర్మన్ పదవి ఎవరికి ఇస్తారు ?అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఇటీవల పార్టీలో చేరిన అరవపల్లి మండల నాయకుని కుటుంబానికి లేదా అదే మండలానికి చెందిన మరో కాంగ్రెస్ నాయకుని కుటుంబానికి ఇవ్వడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రతిష్టాత్మకమైన తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి ఎవరిని వరించనుందోనని సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఈ ఉత్కంఠతకు తెరపడాలంటే చైర్మన్ పేరు ఎమ్మెల్యే నోటి గుండా రావాల్సిందే మరి. ఎమ్మెల్యే ఎవరి పేరు చెప్తారు వేచి చూడాల్సిందే.