మునుగోడు బరిలో నిలిచేదెవరు? గెలిచేదెవరు?

మునుగోడు బరిలో నిలిచేదెవరు? గెలిచేదెవరు?

ముద్ర ప్రతినిధి, నల్లగొండ:ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1967 లో మునుగోడు నియోజకవర్గం ఏర్పడింది.ఓటర్ల సంఖ్య ప్రస్తుతానికి 2,48,524.మొత్తం 17 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎక్కువసార్లు కాంగ్రెస్,సిపిఐ పార్టీలే గెలుపొందాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత 2014 లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందాడు. గతంలో రాష్ట్రంలో అధికారంలో ఒక పార్టీ ఉంటే, మునుగోడులో మరొక పార్టీ గెలిచేది ఎప్పుడు ప్రతిపక్షపాత్రే పోషించడంతో కొంత అభివృద్ధి వెనుకబడిందని చెప్పుకోవచ్చు. మొదటిసారి 2014లో మునుగోడు లో,రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. నూతన రాష్ట్రం కొత్త ప్రభుత్వం కొంత అభివృద్ధికి పునాదులు పడిన నాలుగేళ్ల తరువాత మళ్లీ ముందస్తుగా ఎన్నికలు వచ్చాయి.2018లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపొందడం జరిగింది.

రాష్ట్రంలో భారీ స్థాయిలో టిఆర్ఎస్ ప్రభంజనం చూపించిన మునుగోడులో మాత్రం గెలవలేకపోయింది. మునుగోడులో కాంగ్రెస్ గెలవడం,రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడంతో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నందుకే మన నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు కేటాయించడం లేదని ఆరోపిస్తూ, మన మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నేను రాజీనామా చేస్తేనే చెందుతుందని చాలేంజ్ చేసి, ఉప ఎన్నిక వచ్చిన హుజురాబాద్ నియోజకవర్గంలో వచ్చినట్టుగా, మన నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబనికి దళిత బంధు వస్తుందని, అభివృద్ధి నిధులు వరదల్లా వస్తాయని గత సంవత్సరం తన శాసనసభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపి పార్టీలో చేరడం జరిగింది. చేరిన అనంతరం కెసిఆర్ కుటుంబ పాలన, నియంత పాలను ఓడించే ప్రత్యామ్నాయమైన పార్టీ బిజెపినేనని అందుకే కేసీఆర్ ని గద్దె దించేందుకే బిజెపిలో చేరానని మునుగోడు బరిలో నిలిచి ఓడిస్తానని శపధం చేసి ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిగా నిలిచిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికని ప్రతిష్మాత్మకంగా తీసుకున్నవి బిజెపి,టిఆర్ఎస్ పార్టీలు. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాలని తెలంగాణ రాష్ట్ర సమితి గా ఉన్న పార్టీని భారత రాష్ట్ర సమితి గా మార్చి జాతీయ రాజకీయాల్లో ప్రవేశించే సందర్భంగా.. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాలని లక్ష్యంతో కసితో పనిచేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచడం జరిగింది.హోరాహోరీ పోరులో నువ్వా, నేనా అంటూ రసవత్తరంగా సాగిన పోరులో చివరకు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై బిఆర్ఎస్ అభ్యర్థి 10,309 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది.

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా సిపిఐ,సిపిఎం పార్టీలు నిలిచాయి. వాస్తవానికి బిజెపి పార్టీకి గత సంవత్సరం వరకు మునుగోడు నియోజకవర్గంలో 20వేలకు మించి ఓట్లు ఉన్న పరిస్థితి లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికతో, వ్యక్తిగతంగా, అభిమానంతో బిజెపి పార్టీకి ఉప ఎన్నికల్లో 86,697 ఓట్లు పడ్డాయంటే రాజగోపాల్ రెడ్డి చరిష్మాతోనే అనేది రాజకీయ విశ్లేషకుల నోటమాట. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నికల బరిలో నిలిచిన పాల్వాయి స్రవంతి రెడ్డికి నియోజకవర్గ ప్రజలు అంతగా ఆదరించలేదనేది స్పష్టంగా స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్లన్నీ ఎటుపడ్డాయి అనేది ఇక్కడ ప్రశ్న? బిజెపికి నియోజకవర్గంలో అన్ని ఓట్లు లేవు ? కాంగ్రెస్ కు ఓట్లు పడలేదు.! కాంగ్రెస్ మునుగోడులో మూడో స్థానానికి పరిమితం కావడం, డిపాజిట్ కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో కొంతకాలం వరకు నిరుత్సాహమే ఉందనేది వాస్తవం. ఉప ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించిన చల్లమల్ల కృష్ణారెడ్డి, టికెట్ రాకపోవడంతో నాటి నుంచి నియోజకవర్గంలో తన ఆధ్వర్యంలో అనేక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అధిష్టానం గుర్తించి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుంటూ పార్టీని,క్యాడర్ ని కాపాడుకుంటూ వస్తున్నాడు చల్లమల్ల కృష్ణారెడ్డి.

అదేవిధంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ క్యాడర్ లో మరింత జోష్ పెరిగి నియోజకవర్గంలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కూడా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని అధిష్టానం వద్ద దరఖాస్తు చేసుకున్నాడు చల్లమల్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి సైతం బరిలో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరొకరు ఉద్యమకారుడు,విద్యార్థి నాయకుడు పున్న కైలాస్ నేత కూడా బీసీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని అదిష్టానాన్ని విజ్ఞప్తి చేస్తున్నాడు.. ఇదిలా ఉంటే కాంగ్రెస్ తో, సిపిఐ,సిపిఎం పార్టీలు పొత్తు‌ కుదుర్చుకునేందుకు అధిష్టానం వద్ద చర్చలు జరుపుతుంది. పొత్తులో భాగంగా మునుగోడు సిపిఐ కి కేటాయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అధిష్టానం ప్రకటించే వరకు సోషల్ మీడియాలో వివిధ దినపత్రికల్లో పొత్తుపై వచ్చే వార్తలను నమ్మొద్దని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. సిపిఐ, సిపిఎం పార్టీలతో పొత్తు కుదిరి మునుగోడు కాంగ్రెస్ పార్టీకే కేటాయిస్తే కొంత గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండడంతోనే బిఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండనేది నేటికీ కామ్రేడ్ లు అంటున్నారు, ఇది వాస్తవమే అనేది రాజకీయ విశ్లేషకులు మాట.

ఒకవేళ కాంగ్రెస్, సిపిఐ,సిపిఎం పొత్తుతో మునుగోడు సిపిఐ కి కేటాయిస్తే చేతులారా సీటును కోల్పోవడం జరుగుతుందనేది మేధావి వర్గాలు, కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్న మాట. సిపిఐ కి కేటాయిస్తే బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని గ్రామాల్లో రచ్చబండల వద్ద ప్రజల చర్చలు ఇలా సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి చల్లమల్ల కృష్ణారెడ్డి, బిజెపి నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బిఆర్ఎస్ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిస్తే త్రిముఖ పోరులో విజయం ఎవరి సొంతమనే విషయాన్ని అంత సులువుగా అంచనా వేయలేం. మునుగోడు నియోజకవర్గ గడ్డ,చాలా చైతన్యవంతమైన గడ్డ.చూడాలి మరి మునుగోడు బరిలో నిలిచి, గెలిచేది ఎవరనేది?