బిసి కుల వృత్తులకు లక్ష సాయం అందేనా..?

బిసి కుల వృత్తులకు లక్ష సాయం అందేనా..?
  • క్యాతన పల్లిలో రెండు కులలకే  ప్రాధాన్యత 
  • చెక్కుల గురించి మాకు తెల్వదు : పుర కౌన్సిలర్లు

రామకృష్ణాపూర్,ముద్ర : ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులవృతదారులను ఆదుకునేందుకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం అందరికీ తెలిసిందే. బీసీ కులవృత్తులకు చెందిన వారు మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ముగియడంతో అర్హుల జాబితాను సంబంధించిన అధికారులు వేగవంతంగా పూర్తి చేశారు. మొదటి విడత ఎంపిక పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు ఇటీవల చెక్కులను పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజవర్గానికి సంబంధించి మూడు వందల మంది బీసీ కుల వృత్తుల లబ్ధిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కులను జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

  • రెండు కులాలకే ప్రాధాన్యత..

పట్టణంలోని బీసీ కులవృత్తులకు చెందిన 414 మంది రాష్ట్ర ప్రభుత్వం అందించే లక్ష ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోగా 301 దరఖాస్తులు ఎంపిక చేసి 113 దరఖాస్తులను నాట్ ఎలిజిబుల్ చేశారు.క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో మొదటి విడతలో భాగంగా ఎంపిక చేసిన 50 మంది లబ్ధిదారుల ప్రక్రియలో కొంత అవకతవకలు జరిగాయని, రెండు కులాలకు చెందిన వారికే ప్రాధాన్యతను ఇచ్చారనే మాటలు వినిపిస్తున్నాయి. పట్టణానికి చెందిన ఓ పెద్ద లీడర్కు మున్సిపల్ అధికారుల మధ్య దగ్గరి సంబంధాలతో అవకతవకలు జరిగాయని,చెక్కులు అందించే క్రమంలో లీడర్లకు సంబంధించిన  దగ్గరి వ్యక్తులకే చెక్కులను అందించారనే ఆరోపణలు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నుంచి వినిపిస్తున్నాయి. ఇచ్చే చేక్కులపై లబ్ధిదారుల పేర్లు లేకపోవడంతో పలు అనుమానాలు బీసీ కులవృత్తులలో వ్యక్తం అవుతున్నాయి. చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో వచ్చేవరకు వేచి చూడాల్సిన పరిస్థితులు లబ్ధిదారులకు ఎదురవుతున్నాయి.

  • చెక్కుల గురించి మాకు తెల్వదు : పుర కౌన్సిలర్లు 

రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులవృత్తులకు అందించే లక్ష ఆర్థిక సాయం కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపికపై మున్సిపాలిటీ నుంచి తమకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనే మాటలు మున్సిపాలిటీకి చెందిన 22 మంది కౌన్సిలర్ల నుంచి వినిపిస్తున్నాయి. తమ వార్డులకు చెందిన లబ్ధిదారులకు అందించే చెక్కుల పంపిణీ విషయాన్ని సైతం తెలుపకపోవడం బాధాకరమంటున్నారు.  మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్ల వాట్సప్ గ్రూప్ లో లబ్ధిదారుల ఎంపిక,చెక్కుల పంపిణీ విషయాలపై ముక్కు సూటిగా చర్చించారు. గ్రూపులో కౌన్సిలర్లు చర్చించిన విషయం ఎమ్మెల్యే వరకు చేరడంతో చర్చ చేసిన కౌన్సిలర్ల పై ఎమ్మెల్యే కోపంతో ఉన్నట్లుగా తెలుస్తుంది.

  • మున్సిపాలిటీ నుంచే సర్వే చేశారు..
  • బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వినోద్

రాష్ట్ర ప్రభుత్వం అందించే బీసీ కులవృత్తుల లక్ష ఆర్థిక సాయం కొరకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల ఎంపిక ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ పూర్తి చేశారన్నారు. మున్సిపాలిటీ నుంచి వచ్చిన లిస్ట్ ఫైనల్ చేసి పై అధికారులకు అందించమని తెలిపారు. మొదటి విడతలో భాగంగా 50 మందికి చెక్కులను అందించినట్లు చెప్పారు. ఇంకా ఎన్ని విడతల్లో అందిస్తారనేది తెలియాల్సి ఉందన్నారు.