సభలో లేని ప్రధానిపై ఆరోపణలు చేస్తారా?

సభలో లేని ప్రధానిపై ఆరోపణలు చేస్తారా?
Korutla Street Corner Meeting
  • అభివ్రుద్ది, హామీలపై మాట్లాడకుండా మోదీని తిట్టడానికే అసెంబ్లీని వేదికగా చేసుకుంటారా…
  • ప్రధాని గౌరవాన్ని మంటకలుపుతుంటే స్పీకర్ ఏం చేస్తున్నారు…
  • మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు కేసీఆర్ కుట్ర..
  • కోరుట్ల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సభలో లేని ప్రధానిని అవమానించేలా మాట్లాడతారా.. తెలంగాణలో చేసిన అభివ్రుద్ది, ప్రజలకు ఇచ్చిన హామీలపై మాట్లాడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తిట్టడానికే అసెంబ్లీని వేదికగా చేసుకోవడం సిగ్గు చేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. జనం గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన ‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ మాట్లాడుతూ సభలో లేని వ్యక్తిపై ఆరోపణలు చేయడం సభా సాంప్రదాయం కాదని, అయినప్పటికీ ప్రధాని గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడుతుంటే స్పీకర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై దమ్ముంటే బహిరంగ  చర్చకు రావాలని సవాల్ విసిరారు.

నిరుద్యోగ భ్రుతి, ఫ్రీ యూరియా సహా ఇచ్చిన హామీలపై కేసీఆర్ అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏసీడీ ఛార్జీల విషయంలో కేసీఆర్ ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలపై ఏసీడీ ఛార్జీల భారం మోపిన కేసీఆర్ ఎంఐఎం నేతలకు భయపడి పాతబస్తీలో ఏసీడీ ఛార్జీల ఊసే ఎత్తలేదన్నారు.  తెలంగాణ ప్రజలకు ఒక న్యాయం? పాతబస్తీకి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. పాతబస్తీలో ఏటా వెయ్యి కోట్ల కరెంట్ చౌర్యం జరుగుతోందని,  నిరూపించేందుకు తాను  సిద్దమని ప్రకటించారు. సీఎం కేసీఆర్, ఎంఐఎం నేతలకు చేతనైతే విద్యుత్ శాఖ లెక్కలు తెప్పించుకుని చూడాలని సూచించారు.

సచివాలయాన్ని ధ్వంసం చేసినోళ్లే కూల్చే సంస్క్రుతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్న బండి సంజయ్  నిజాం వారసత్వ మరకలను సమూలంగా తుడిచి వేస్తామని, బరాబర్ సచివాలయ డోమ్ లను కూల్చివేస్తామని పునరుద్ఘాటించారు. అర్హత లేని అధికారులకు రూల్స్ కు విరుద్ధంగా కేసీఆర్ తన తాబేదార్లనే కారణంతో కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రతిపాదనలు పంపారని మండిపడ్డారు. అర్హులైన ఉద్యోగస్తులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని.. ప్రశ్నించకపోతే ఉద్యోగస్తులను బానిసలకంటే హీనంగా చూస్తారని అన్నారు. కేసీఆర్ సర్కార్ అరాచకాలు పెచ్చుమీరాయని, ఆ ప్రభుత్వాన్ని తరిమికొట్టేదాకా విశ్రమించొద్దని పిలుపునిచ్చారు.  బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందించడంతోపాటు నిలువనీడలేని పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని, రైతులకు పంట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.