ఉమ్మడి నల్లగొండకు ఎంఎల్సీ దక్కేనా..!!

ఉమ్మడి నల్లగొండకు ఎంఎల్సీ దక్కేనా..!!
  • కాంగ్రెస్ నేతల్లో ఆశలు రేపుతున్నఎంఎల్ సి....
  • గుట్టుచప్పుడు కాకుండా ఊపందుకుంటున్న ప్రయత్నాలు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-కాంగ్రెస్ పార్టీ తరపున గత అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ దక్కనివారు, టికెట్ వచ్చి పోటీ చేసినా గెలవనివారు, పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నా ఇన్నాళ్లుగా ఏ ముఖ్యమైన పదవి చేపట్టనివారు, ఏ పదవి దక్కనివారు, పార్టీ అభివృద్ధి కోసం
కొన్నేళ్ళుగా పనిచేస్తున్నప్పటికీ ఏనాడు అధికారపదవిని దక్కించుకోలేకపోయినవారు
ఈ సారి ఎలాగైనా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ (ఎంఎల్ సి శాసనమండలి
సభ్యుడు) అయినా కావాలని పట్టుదలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని
నాయకులున్నారు. గత పదేళ్ళుగా అధికారానికి దూరమై తాము ఉన్న పార్టీలోనే
నెట్టుకొస్తూ పార్టీని కాపాడుకుంటూ ఏ పార్టీలోకి వెళ్ళకుండా అంటిపెట్టుకుని
కాంగ్రెస్ పార్టీలో కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులుగా పేరుపడ్డ సీనియర్లు ఎలాగైనా
ఎంఎల్ సి కాకపోతామా అన్న ఆశతో ఉన్నట్టు సమాచారం. అందుకోసం ఎవరికి
వారు తెరవెనుక ప్రయత్నాలు గుట్టుచప్పుడు కాకుండా కానిస్తున్నారని తెలిసింది.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఎంఎల్సీల నియామకం
విషయమై ఒక క్లారిటీతో వచ్చాడని సమాచారం. ప్రస్తుతానికి రాష్ట్రంలో బి ఆర్ఎ
స్ ఎంఎల్ సి  లు ముగ్గురు ఎంఎల్ఎలుగా ఎన్నిక కావడం, గతంలోనే బి ఆర్ఎస్ ఎంఎల్ సి  ఫైల్ ను గవర్నర్ తమిళిసై నిరాకరించడంతో మొత్తం ఆరు ఎంఎల్ సి 
ఖాళీలు ప్రస్తుతం ఉన్నట్టు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆరు
ఎంఎల్సీలలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలు ఎలాగైనా
దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిస్తే
ఒకరికి ఇంకొకరు పోటీగా ఉండే అవకాశం ఉన్నందున ఎవరికి వారు
తెలియకుండా రహస్యంగా పైరవీలు కొనసాగిస్తున్నారు.

 సూర్యాపేట జిల్లాలో ఎవరిని వరించనుందో...?
 
సూర్యాపేట జిల్లాకు ఎంఎల్సి అవకాశం వస్తుందా, రాదా
అన్న అయోమయపరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల సూర్యాపేట అసెంబ్లీ
నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయిన మాజీమంత్రి
రాంరెడి దామోదర్ రెడ్డి, టికెట్ దక్కకపోవడంతో వేసిన నామినేషన్ 
కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి, అనేక సంవత్సరాలుగా పార్టీకి అధికార ప్రతినిధిగా
ఉండి తుంగతుర్తి టికెట్ దక్కని అద్దంకి దయాకర్ లు ప్రధానంగా ఎంఎల్సి
రేసులో ఉన్నట్టు సమాచారం. ఎవరికివారు తమ తమ గాడ్ ఫాదర్లు,
పరిచయాలున్న అధిష్టానపెద్దలతో మంతనాలు జరుపుతూ తమకే ఎంఎల్సి
రావాలంటూ, కావాలంటూ పట్టుబడుతున్నట్టు సమాచారం. ఇంకా మంత్రి
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో మరికొందరు తెరపైకి వచ్చే అవకాశం
ఉంది.

 నల్లగొండ జిల్లాలో ఎవరిని వరించనుందో...!

 నల్లగొండ జిల్లా నుంచి
డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ మిర్యాలగూడ టికెట్ ఆశించినా రాకపోవడం,
మాజీమంత్రి జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డికి కూడా ఎంఎల్ఎ టికెట్
రాకపోవడంతో ఎంఎల్సిని ఆశిస్తున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని
సీనియర్ కాంగ్రెస్ నేతలు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతో నల్లగొండ
,నకిరేకల్ నియోజకవర్గాలలోని కొందరు నేతలు ఎంఎల్ సి లుగా అవకాశం కోసం
ఎదురుచూస్తున్నారు. ఇంకా యాదాద్రిభువనగిరి జిల్లాలో భువనగిరి, ఆలేరు
నియోజకవర్గాలలో అసెంబ్లీ టికెట్ ఆశించి దక్కని నేతలు కూడా ఈసారి ఎంఎల్సి
కోసం జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలిసింది. మొత్తానికి ఉమ్మడి నల్లగొండ
జిల్లాలోని ఎంఎల్సి ఆశావాహులు జిల్లాలోని ఇద్దరు మంత్రులతోనే కాకుండా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి పెద్దలు, తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే,
ఏ ఐసిసి కార్యదర్శి కేసి వేణుగోపాల్, ఇంకా కొందరు ముందుకు అడుగేసి
పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ,
సోనియాగాంధీలతో సైతం ఎంఎల్సి పైరవీలు సాగిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ
వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ  ఒక సముద్రం లాంటిదని, ముఖ్యంగా
ప్రజాస్వామ్యం ఎక్కువని, ఎవరికి వారు తమ తమ ప్రయత్నాలను తీవ్రతరం
చేశారని, ఎవరికైనా ఎప్పుడైనా పదవులు రావచ్చని, అదే అసలైన కాంగ్రెస్
సంస్కృతి అని, ఎందరు ఆశించినా చివరకు అందరం కలిసే ఉంటామని కాంగ్రెస్
నాయకులు పేర్కొంటున్నారు.