ప్రజల ఆశీర్వాదంతో చేవెళ్ల గడ్డపై కాషాయం జెండా ఎగరవేస్తా

ప్రజల ఆశీర్వాదంతో చేవెళ్ల గడ్డపై కాషాయం జెండా ఎగరవేస్తా
  •  ప్రజా ఆశీర్వాద యాత్రను ప్రారంభించిన చేవెళ్ల బిజెపి అభ్యర్థి  కొండా విశ్వేశ్వర్ రెడ్డి


ముద్ర,రంగారెడ్డి: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో  చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రజల ఆశీర్వాదంతో  నాలుగు లక్షల  భారీ మెజార్టీతో గెలుస్తానని, చేవెళ్ల గడ్డపై కాషాయం జెండా ఎగరవేస్తానని  చేవెళ్ల భారతీయ జనతా పార్టీ  అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి  అన్నారు. నియోజకవర్గం లోని శంషాబాద్ నర్కుడ అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి గురువారం ప్రజా ఆశీర్వాద యాత్రను  విశ్వేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి, సంగీత రెడ్డి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం విశ్వేశ్వర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం లో 14 రోజులపాటు ప్రజా ఆశీర్వాద యాత్ర  కొనసాగుతుందన్నారు. దేశం మొత్తం నరేంద్ర మోడీ గాలి వీస్తుందని, ఈసారి ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి  నాలుగు లక్షల భారీ మెజార్టీతో  తాను గెలుస్తున్నట్టు  తెలిపారు.

తాను ఎంపీగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వేలకోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. బీజాపూర్ జాతీయ రహదారి కోసం  కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు భూసేకరణ చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ చుట్టుముట్టు  111 జీవో  నిబంధనల ఎత్తివేత కోసం  తాను నిరంతరం పోరాటం చేశానని, ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల్లో ఉంటూ తాను ప్రజాసేవకు అంకితమయ్యానని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి  పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరవయ్యారని, ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను అరువు తెచ్చుకొని పోటీ చేస్తున్నారని విమర్శించారు.

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం  ప్రజల ఆశీర్వాదంతో చేవెళ్లలో కాషాయం జెండా ఎగరవేయడం ఖాయమని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి శాసనసభ్యులు కాటేపల్లి వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.