వర్కింగ్ జర్నలిస్టులకు వేజ్ బోర్డు, ప్రత్యేక భద్రతా చట్టం అవసరం!: హర్యానా గవర్నర్ దత్తాత్రేయ

వర్కింగ్ జర్నలిస్టులకు వేజ్ బోర్డు, ప్రత్యేక భద్రతా చట్టం అవసరం!: హర్యానా గవర్నర్ దత్తాత్రేయ

పంచకుల (చండీఘర్, హర్యానా): ఆగష్టు4: వర్కింగ్ జర్నలిస్టుల వేజ్ బోర్డు పునరుద్ధరించాలన్న ఐజేయు డిమాండును కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. వర్కింగ్ జర్నలిస్ట్స్ ల భద్రతకు ప్రత్యేక చట్టం చేయాలన్న డిమాండ్ కూడా న్యాయమైనదేనని దత్తాత్రేయ అభిప్రాయ పడ్డారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. హర్యానా రాష్ట్రం పంచకులలో ఆగస్టు 3, 4 తేదీల్లో జరుగుతున్న ఐజేయూ జాతీయ కౌన్సిల్ సమావేశాలలో రెండోరోజు, ఆదివారం ఉదయం జరిగిన సెషన్ కు బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశానికి ఐజేయు జాతీయ అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు.


బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ మీడియా మన  ప్రజాస్వామ్యానికి మూల స్థంభమని, మీడియా పటిష్టం గా ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని అన్నారు. ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉంటాయి, పార్టీలు వస్తుంటాయి,పోతుంటాయి, కానీ దేశం శాశ్వతమని, దేశం వికాసం చెందాలంటే ప్రజాస్వామ్యం కీలకమని, అందుకు బలమయిన మీడియా అవసరమని దత్తాత్రేయ అన్నారు. ప్రభుత్వాలు చేసే మంచిని, చెడును ప్రజల ముందుకు తెచ్చే బాధ్యత మీడియాదేనని ఆయన స్పష్టం చేశారు. నిబద్ధతతో జర్నలిజం చేసే పాత్రికేయులను చూసి ముఖ్యమంత్రులు సైతం భయపడటం తనకు తెలుసునని, అలాంటి పాత్రికేయులను పిలిచివారు లేవనెత్తిన సమస్యలపై మాట్లాడుకోవడం జరిగేదని దత్తాత్రేయ అన్నారు. తన దృష్టిలో పాలకులకంటే నిజం చెప్పే జర్నలిస్టే  ఉన్నతుడని బండారు దత్తాత్రేయ అన్నారు. 

సత్యం చెప్పడానికి, వాస్తవాలను వెలుగులోనికి తేవడానికి మీడియా కృషి చేయాలన్నారు. గతంలో ఎన్నో కుంభకోణాలను, అక్రమాలను, అవినీతిని వెలుగులోకి తేవడంలో పరిశోధనాత్మక జర్నలిజం ముఖ్య భూమిక పోషించిందని దత్తాత్రేయ గుర్తు చేశారు. అయితే వాస్తవాలను వెలుగులోనికి తెస్తే సహించలేని దుష్ట శక్తులు మీడియాపై దాడులు చేస్తుంటాయని, దత్తాత్రేయ అన్నారు. సత్యాన్ని వెలుగులోకి తేవాలంటే జర్నలిస్టు నిర్భీతితో, సాహసంతో, నిబద్ధతతో విధి నిర్వహణ చేయాల్సి ఉంటుందని దత్తాత్రేయ అన్నారు. నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చే పాత్రికేయులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం చేయాలన్న ఐ.జే.యు. డిమాండు న్యాయబద్దమేనని దత్తాత్రేయ పేర్కొన్నారు. ప్రత్యేక భద్రతా చట్టం డిమాండును కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని ఆయన హామీ ఇచ్చారు. భువనేశ్వర్ లో జరిగిన ఐజేయూ ప్లీనరీకి కేంద్ర కార్మికశాఖ మంత్రి హోదాలో తాను హాజరయ్యానని , వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల గురించి  తనకు  అవగాహన కలిగిందని అన్నారు.


వర్కింగ్ జర్నలిస్టుల వేజ్ బోర్డు నియమించాలన్న అంశాన్ని యూనియన్ నేతలు తన దృష్టికి తెచ్చారని , వెంటనే యూనియన్ల ప్రతినిధులతో  సమావేశాన్ని ఏర్పాటు చేసానని దత్తాత్రేయ గుర్తు చేశారు. ప్రస్తుతం వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని రద్దు చేయడంతో జర్నలిస్టుల వేజ్ బోర్డు కూడారద్దయ్యిందని, అన్నారు. అయితే  వర్కింగ్ జర్నలిస్టులకు వేతన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకు వేజ్ బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను తన స్థాయిలో కేంద్రం దృష్టికి తీసుకు వెళతానని దత్తాత్రేయ హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో సాంకేతికత పెరుగుదల, కృత్రిమ మేధ ప్రవేశంతో మీడియా రంగంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. అయితే మీడియాకు విలువలు ప్రధానమని , విలువలు లేని మీడియాకు విశ్వసనీయత ఉండదని , విశ్వసనీయత లేని మీడియాకు గౌరవం ఉండదని , పాత్రికేయులు సమాచారాన్ని సమాచారంగా ఇవ్వాలని, న్యూస్ బదులు వ్యూస్ ఇవ్వడం మంచి పద్ధతి కాదని దత్తాత్రేయ  అన్నారు. 

ఐజేయు అధ్యక్షుడు కే శ్రీనివాసరెడ్డి తనకు నాలుగున్నర దశాబ్దాలుగా తెలుసునని, విలువలు కలిగిన జర్నలిస్టుగా, నిబద్ధత కలిగిన యూనియనిస్ట్ గా ఆయనంటే తనకు అపార గౌరవమని దత్తాత్రేయ పేర్కొన్నారు. సమావేశాలకు ఇరవై రాష్ట్రాల నుండి ప్రతినిధులు పాల్గొంటున్నట్లు, అందులో రెండు తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు ఎక్కువగా ఉన్నట్లు తనకు చెప్పారని, అందువల్ల తెలుగులో కూడా మాట్లాడుతానని దత్తాత్రేయ అన్నారు. ఆమేరకు కాస్సేపు తెలుగులో కూడా మాట్లాడారు. అధ్యక్షత వహించిన కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య కార్యకర్తగా ప్రారంభం అయిన బండారు దత్తాత్రేయ రాజకియ ప్రస్తానాన్ని వివరించారు. ఎంపీగా ఉన్నా, కేంద్రమంత్రిగా ఉన్నా, ఎలాంటి భేషజాలు లేకుండా సామాన్య ప్రజలతో కలిసిమెలిసి మెలిగే నేతగా, ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉండే ప్రజా ప్రతినిధిగా, దత్తాత్రేయ ప్రజల మన్ననలు పొందారని, అన్ని రాజకీయ పార్టీలవారూ ఆయన్ని అభిమానిస్తారని వివరించారు.


ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ బండారు దత్తాత్రేయ దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించే "ఆలయ్ బలయ్" కార్యక్రమం పొందుతున్న ప్రాచుర్యాన్ని  వివరించారు. ఉత్తర తెలంగాణా జిల్లాల్లో అటల్ బీహారీ వాజపేయి పాల్గొన్న  సభల నిర్వాహకునిగా దత్తాత్రేయ, వార్తా సేకరణకు తానూ కొన్ని రోజులపాటు చేసిన పర్యటనలను గుర్తు చేశారు. ఐ.జే.యు. స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్.ఎన్. సిన్హా మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టు చట్టాన్ని రద్దు చేయడంతో ఏర్పడిన పరిస్థితులను దత్తాత్రేయ దృష్టికి తెచ్చారు. ఐజేయు సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ, చండీఘర్ హర్యానా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రామ్ సింగ్ బ్రార్, చైర్మన్ బల్వంత్ తక్షీ, చండీ ఘర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నళినీ ఆచార్య, ఐజేయూ జాతీయ కార్యదర్శి బల్బీర్ సింగ్ ఝాండు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ ను ఐజేయు నాయకులు ఘనంగా సత్కరించారు.