షర్మిల వ్యవహారంలో బలపడుతున్న అనుమానాలు !

షర్మిల వ్యవహారంలో బలపడుతున్న అనుమానాలు !
ys sharmila padayatra

తెలంగాణలో ఎన్నికలకు ఇంచుమించుగా ఓ ఏడాది సమయం ఉంది. దేశ వ్యాప్తంగా అప్పుడే ఎన్నికల వేడి రాజుకుం టోంది. ప్రధానంగా తెలుగు రాష్టాల్ల్రో కేసులతో ఇప్పుడు కలకలం రేగుతోంది. వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ  క్రమంలో లిక్కర్‌ కేసులో కవిత పేరుతో ఇప్పుడు టిఆర్‌ఎస్‌ను డ్యామేజీ చేయడం ద్వారా లబ్ధి పొందాలన్న  ఎత్తుగడ కూడా ఉండివుంటుంది. ముఖ్యంగా తెలంగాణలో కేసుల నమోదు..షర్మిల వ్యవహారం అంతా ఓ పద్దతి ప్రకారం సాగుతోంది. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవిత పేరు ప్రస్తావనకు రావడం...ఆమె పాత్ర ఉన్నట్లు ఈడీ పేర్కొనడంతో ఇప్పుడు వేడి మరిత రాజుకుంది. మరోవైపు తెలంగాణలో టిఆర్‌ఎస్‌ను దెబ్బ కొట్టేందుకు జగన్‌ ద్వారా షర్మిలను వదిలారని..బీజేపీ వదిలన బాణం షర్మిల అని టిఆర్‌ఎస్‌ ఆరోపణలు తీవ్రం చేసింది. మరోవైపు ఇందులో జగన్‌ స్వార్థం కూడా ఉంది. విడివడ్డ తరవాత జగన్‌కు తెలంగాణలో ఆస్తులు ఉన్నాయి. వాటిని కాపాడుకోవాలంటే..అధికారంలో తన పాత్ర ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే షర్మిలను తెలంగాణలో రాజకీయంగా పావుగా దించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.  జగన్‌ ఈ విషయంలో సైలెంట్‌గా పనిచేస్తున్నారనడానికి గతకొంతకాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలనే ఉదాహరణగా చూడాలి.రాజకీయాల్లో రకరకాల ఎత్తులు, జిత్తులు ఉంటాయనే విషయం తెలుసు. ఎదురె దురుగా బెదరించి చేసే రాజకీయాలు కొన్నయితే.. మౌనంగా ఉండి చేసే రాజకీయాలు మరికొన్ని ఉంటాయి. గతంలో ప్రధాని పివి నరసింహారావు అనేక విషయాల్లో మౌనంగా ఉంటూనే రాజకయీఆలు నడిపేవారు.

అందుకే ఆయనను దగ్గరగా చూసిన వారు అపర చాణుక్యుడు అనేవారు. అలానే ఇప్పుడు ఏపీ సిఎం   జగన్‌.. సైలెంట్‌గా ఉంటూ.. తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఆయన సొదరి వైటీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా జరగని విధంగా ఒక పార్టీ అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలిని.. కూర్చున్న కారులోనే ఎత్తి పట్టుకుని స్టేషన్‌ తీసుకువెళ్లారు. ఇక షర్మిల మాతృమూర్తి విజయమ్మ ధర్నా చేశారు. ఆమె ఎపి రాజకీయాలను వదిలి కూతరుతో తెలంగాణలో  దిగారు. ఇదంతా గమనిస్తే జగన్‌ వ్యూహాత్మకంగా తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టారని చెప్పుకోవాలి. అయితే ఆయన లోపాయకారిగా వ్యవహారం నడుపుతున్నారు కనుక అందరూ అనుకున్నట్టుగా ఆయన ఎక్కడా స్పందించలేదు. అసలుసిసలు రాజకీయం అంతా అందులోనే కనిపిస్తుంది. తన చెల్లికి తల్లికి ఆయన చేస్తున్న పొలిటికల్‌ హెల్ప్‌ కళ్లకు కడుతోంది.  అలాగే బిజెపి,కాంగ్రెస్‌ నేతలు నేరుగా షర్మిల వ్యవహారంలో స్పందించారు.కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తీవ్రంగానే స్పందించారు. దీంతో షర్మిల బిజెపి వదిలిన బాణం అన్న విమర్శలు టిఆర్‌ఎస్‌ వైపు నుంచి దూసుకుని వచ్చాయి. తాజాగా తెలంగాణలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్య క్షరాలు..సీఎం జగన్‌ సోదరి షర్మిలకు పెద్దగా రాజకీయవర్గాల నుంచి మద్దతు లభించ లేదు. అదే సమయంలో మహిళల నుంచి కూడా ఎలాంటి సెంటిమెంటు ప్రకటనలు కూడా రాలేదు.

మరీ ముఖ్యంగా వైఎస్‌ అనుచరులు, అభిమానుల నుంచి కూడా మద్దతు లభించలేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరవాత కెసిఆర్‌పై ఆగ్రహం ఉన్నా..షర్మిల విషయంలో ప్రజలు కెసిఆర్‌ కు మద్దతుగానే ఉంటారని తాజా రాజకీయ పరిణమాలను బట్టి అర్థం చేఉకోవచ్చు.  కేవలం 8 ఏళ్లోనే గతంలో ఎప్పుడూ లేనంతగా అభివృద్ది జరిగింది. ఇదే క్రమంలో వైఎస్‌ హయాంలో జరిగిన దోపిడీ గురించి ప్రజలు మరచి పోలేదు. కడప బ్యాచ్‌లు భూకుంభకోణాలు, ఆక్రమణలు మరవలేదు. ఇలాంటి సందర్భంలో కెసిఆర్‌ను ఏ మాత్రం వ్యతి రేకించినా వైఎస్‌ జగన్‌ బ్యాచ్‌ మళ్లీ ఇక్కడ తిష్ట వేస్తుందన్న భావన ఉంది. ఇలా వైఎస్‌ అనుచరవర్గం,  సామాజిక వర్గం నుంచి తనకు మద్దతు దక్కుతుందని ఇప్పటి వరకు వారు సైలెంట్‌ గా ఉన్నప్పటికీ ఈ వివాదంతో అయినా బయటకు వచ్చి తనకు సపోర్టు ఇస్తారని షర్మిల ఉహించారు. కానీ చిత్రంగా రెడ్డివర్గం కానీ గతంలో వైఎస్‌ అనుచరులుగా ఉన్నవారు కానీ ఎవరూ స్పందించలేదు. దీంతో షర్మిల వ్యవహారం అనూహ్యంగా టీకప్పులో తుఫాను మాదిరిగా చల్లారిపోయింది. షర్మిల అనుకున్న మైలేజీ అయితే రాలేదని స్పష్టంగా తెలిసిపోయింది. అయితే ఇంతలోనే బీజేపీ నేతలు అనూహ్యంగా ఈ విషయంపై రియాక్ట్‌ కావడం గమనార్హం. బీజేపీ కనుసన్నల్లోనే ఆమె పార్టీ పెట్టారని అసలు తెలంగాణతో సంబంధం లేని వ్యక్తి పార్టీ పెట్టడం వెనుక కేంద్ర బీజేపీ నేతల అండదండలు ఉన్నాయని ప్రచారం ఉంది. దీనిపై అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఎలాంటి రాజకీయ లబ్ది లేకుండా తెలంగాణ ప్రజలను ఉద్దరిస్తానని పార్టీ పేరుతో వస్తే ప్రజలు నమ్ముతారా అన్నది ప్రజలకు తెలియంది కాదు.
 
 పార్టీ పెట్టి కెసిఆర్‌ను తిడుతూ పోతుంటే టిఆర్‌ఎస్‌ శ్రేణులు మిన్నకుంటాయని షర్మిల భావించి ఉండరు. ఆమె కూడా రచ్చ కావాలనే కోరుకుని ఉంటారు. ఆమె ఏకంగా ఈ రోజు నాటికి 3500 కిలోవిూటర్ల పాదయాత్ర చేశారు. ఆమె పాదయాత్ర కు కోట్లలోనే ఖర్చు అవుతుందని టీఆరెస్‌ వారు లెక్కలు తీసి మరీ చెబుతున్నారు. తాజాగా టీయారెస్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి అయితే షర్మిల పాదయాత్రకు రోజుకు ఇరవై లక్షల నుంచి ముప్పయి లక్షల దాకా ఖర్చు అవుతుందని ఘాటైన ఆరోపణలు చేశారు. మరీ ఇంత ఖర్చుకు అయ్యే డబ్బు ఆమెకు ఎక్కడ నుంచి వస్తోందని ఆయన ప్రశ్నించారు. అలాగే పాదయాత్రలో షర్మిలతో పాటు రోజూ నడిచే మహిళలకు మూడు వందల రూపాయలు ఇస్తున్నారు అని కూడా ప్రచారం సాగుతోంది. ఇతంగా ఖర్చు ఎక్కడి నుంచి వస్తుందన్నది కూడా ఆలోచించాల్సిందే. రోజుకు ఇరవై లక్షల వంతున దీన్ని లెక్క వేస్తే కచ్చితంగా ఆ మొత్తం కనీసం ఓ 40 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా.  ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి ఆమె పాదయాత్ర చేస్తున్నారు. షర్మిలకు అంత డబ్బు ఎక్కడిది..ఎక్కడి నుంచి అందుతుందో తెలపాలన్న డిమాండ్‌ వస్తోంది.  మొత్తంగా ఇప్పుడు షర్మిల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. అలాగే తెలంగాణలో కేసిఆర్‌కు వ్యతిరేకంగా జగన్‌, షర్మిల, బిజెపిలు కుట్రలు చేస్తున్నాయని టిఆర్‌ఎస్‌ బలంగా నమ్ముతోంది.