అమెరికాకు వెళ్లిపోయిన వైఎస్ విజయమ్మ?

అమెరికాకు వెళ్లిపోయిన వైఎస్ విజయమ్మ?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మ అమెరికాకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అమెరికాలో ఉంటున్న మనవడు రాజారెడ్డి (షర్మిల కొడుకు) వద్దకు ఆమె వెళ్లినట్టు సమాచారం. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఆమె తిరిగిరారని తెలుస్తోంది. ఏపీ ఎన్నికల్లో కొడుకు జగన్, కూతురు షర్మిల ఢీకొంటున్న సంగతి తెలిసిందే. జగన్ పై షర్మిల తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నారు. షర్మిల తీరుపై జగన్ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొడుకు, కూతురు ఇద్దరి మధ్య ఆమె నలిగిపోతున్నట్టు చెబుతున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ లో... ఎవరి వైపు నిలబడాలో అర్థం కాక ఆమె మానసిక ఒత్తిడికి గురవుతున్నారట. 

జగన్, షర్మిల ఇద్దరిపై విజయమ్మకు ఒక తల్లిగా అంతులేని ప్రేమ ఉంది. జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించిన సమయంలో ఇడుపులపాయలో ప్రార్థనలు చేసి, జగన్ ను ఆశీర్వదించి పంపారు. అదే విధంగా షర్మిల బస్సు యాత్ర ప్రారంభించిన సమయంలో ఇడుపులపాలో ప్రార్థనలు చేసి, కూతురుని దీవించి పంపారు. ఇప్పుడు ఇద్దరిలో ఏ ఒక్కరికో ప్రత్యేకంగా మద్దతును ప్రకటించలేని పరిస్థితుల్లో, ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో ఆమె అమెరికాకు వెళ్లిపోయినట్టు సన్నిహితులు చెబుతున్నారు.