ఉగాది తర్వాత జగన్ బస్సు యాత్ర

ఉగాది తర్వాత జగన్ బస్సు యాత్ర

విజయవాడ, ఫిబ్రవరి 8: అధికార పార్టీ నేతలకు ఎప్పుడూ ఓ సమస్య వేధిస్తూ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ద్వితీయ శ్రేణి నేతలతోనూ నేరుగా టచ్ లో ఉంటారు. కానీ అధికారంలోకి వచ్చాక అధికార బాధ్యతలతో పార్టీపై, క్యాడర్ పై దృష్టి పెట్టలేరు. ఫలితంగా వారు దూరమవుతారు. ఇలాంటి సమస్య  వైఎస్ఆర్‌సీపీని వెంటాడుతోంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితిని మార్చి మళ్లీ ద్వితీయ శ్రేణి నేతల్ని పూర్తి స్థాయిలో  యాక్టివ్ చేసేందుకు సీఎం జగన్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల గృహసారధుల్ని నియమించాలని ఆదేశించారు. ఇప్పుడు  జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా ద్వితీయ శ్రేణి నేతలతో మాట్లాడాలని అనుకుంటున్నారు. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోలేదన్న భావన ఆ పార్టీ క్యాడర్ లో ఎక్కువ ఉంది.  వాలంటీర్లను నియమించి.. అన్ని బాధ్యతలు వారికే ఇచ్చారు. దీంతో వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలకు తమ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ఆనందం లేకుండా పోయింది. అదే సమయంలో సీఎం జగన్ .. ద్వితీయ శ్రేణి నాయకత్వానికి చాలా దూరంగా వెళ్లారు. ఇప్పటి వరకూ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ అధిష్టానంతో నిత్యం టచ్‌లో ఉంటారు.

ఆయా నియోజకవర్గాల పరిధిలో సెకండ్‌ కేడర్‌ నాయకులంతా మంత్రులు, ఎమ్మెల్యేలకు అనుచరులుగానే ఉండిపోతున్నారు. వారికి ఏదైనా రాజకీయంగా ఇబ్బంది వస్తే స్థానికంగా ఉన్న శాసనభ్యులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అదిష్టాన పెద్దలను నేరుగా కలిసి వారి సమస్యను చెప్పుకునే పరిస్థితి లేదు.  ఇక నుండి ఆ తరహా ఇబ్బందులను  పరిష్కరించి.. పార్టీపై నమ్మకం పెంచేందుకు సీఎం జగన్ వారితో సమావేశం అవ్వాలనుకుంటున్నారు. నియోజకవర్గాల సమీక్షలు చేస్తున్నప్పుడు ఒక్కో నియోజకవర్గం నుంచి యాభై మంది ద్వితీయ శ్రేణి నేతల్ని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు పిలిపిస్తున్నారు. అయితే అవి తరచుగా జరగడం లేదు. అందుకే సీఎం జగన్ జిల్లా పర్యటనకు వెళ్లే సందర్భంలో స్థానిక శాసససభ్యులతోపాటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యమైన ద్వితీయ స్థాయి నాయకులకు కూడా ఆ సమావేశంలో పాల్గొనేందుకు ఆహ్వానించాలని నిర్ణయించారు.

 నియోజకవర్గ స్థాయిలో వారి సమస్యలను కూడా తెలుసుకుని ఎక్కడిక్కడే పరిష్కరించేలా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు.  ఎమ్మెల్యేలు పార్టీ మారితే  వారంతా ఆ ఎమ్మెల్యేతో వెళ్లిపోతున్నారు. దీన్ని నిలువరించడానికైనా.. .ద్వితీయ శ్రేణి నేతలకు తామున్నామనే భరోసా ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నెల్లూరులో పార్టీ పరిస్థితులతో వైసీపీ హైకమాండ్‌కు పరిస్థితి అర్థమయింది. నెల్లూరులో టీడీపీకి ఒక్క కార్పొరేటర్ కూడా లేరు. అందరూ వైఎస్ఆర్‌సీపీకి చెందిన వారే. కానీ ఇప్పుడు మేయర్ కూడా తాను వైఎస్ఆర్‌సీపీ కాదని.. కోటంరెడ్డి పార్టీ అంటున్నారు. ఇది హైకమాండ్‌ను ఆశ్చర్య పరుస్తోంది. ఆయా నేతలకు కోటంరెడ్డి తప్ప ఇతర పెద్ద నేతలవరూ పరిచయం లేదని.. కనీసం నెల్లూరు జిల్లా మంత్రి కూడా వారిని కలవలేదని తేలింది. దీంతో అలాంటి గ్యాప్ ఉంటే ఎప్పటికైనా నష్టమేనని భావించి ఇక నుంచి   సందర్భం వచ్చినప్పుడల్లా ద్వితీయ శ్రేణి నేతలతో   సమావేశం కావడం, పార్టీలో వారికి మరింత ప్రాధాన్యతను పెంచాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.