ఉరుమని మేఘం  కురియని వర్షం

ఉరుమని మేఘం  కురియని వర్షం
  • వర్షపు చుక్క కోసం ఎదురుచూస్తున్న రైతాంగం
  • విత్తనాలు విత్తడానికి సిద్ధంగా ఉన్న దుక్కులు
  • మండుతున్న ఎండలు  బయటకు రాని ప్రజలు

తుంగతుర్తి ముద్ర:-ఒకపక్క మండే ఎండలు మరోపక్క ఎంత ఎదురు చూచిన కురవని వర్షాలతో ఇటు గ్రామాల్లో ప్రజలు అటు వ్యవసాయం చేసే రైతులు దిక్కు తో చని పరిస్థితిలో ఉన్నారు .వర్షాకాలం ప్రారంభమై సుమారు 25 రోజులు దాటుతున్న వర్షాల జాడలేదు. మృగశిర కార్తె ప్రారంభమైన మరుసటి రోజున కురిసింది ఒకే ఒక్క వర్షం దీంతో రైతులు కడు సంబరపడి ఇక వర్షాకాలం ప్రారంభం అయ్యిందని వ్యవసాయ పనులు మొదలు పెట్టవచ్చని అనుకున్నారు .కానీ ఆ వర్షం తర్వాత పది రోజులు దాటుతున్న ఆకాశం నుండి ఒక నీటి చుక్క నీరు నేలరాల లేదు నేడు రైతుల దుస్థితి గమనిస్తే వడ్డించడానికి శుభ్రంగా కడిగిన విస్తరిలా నేల తల్లి చక్కగా దున్ని గడ్డి పోచ లేకుండా చేసి కురిసిన ఆ ఒక్క వర్షానికే అచ్చులు తోలి మెట్ట పైరైన పత్తి గింజలు విత్తడానికి నేలతల్లినీ రైతులు శుభ్రం చేశారు .

రైతులు ప్రతి రోజు ఉదయం నుండి రాత్రి వరకు ఆకాశం వంక వర్షపు చుక్క కోసం ఎదురుచూపే సరిపోతుంది. పొలానికి వెళ్లిన రైతులు మబ్బు తునక కానరాని నిర్మలమైన ఆకాశాన్ని చూసి నిరాశతో వెనుతిరిగే రైతులే కనిపిస్తున్నారు. గత నాలుగు ఐదు ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు లేవని ప్రారంభంలోనే వర్షాలు కురిసి విత్తనాలు విత్తుకునేందుకు రెండు మూడు వర్షాలు కురిసేవని రైతులంటున్నారు. మెట్ట పంటల పరిస్థితి ఇలా ఉంటే వరి పైరుల కోసం నారుమల్లున్న దున్నుకొని నారు పోదాం అనుకున్నా అసలు వర్షాలు కురవకపోతే పోసిన నార్లు పనికి రావని యోజనతో రైతులు ఉన్నారు .గతంలో కొంతమంది రైతులు రోహిణి కార్తెలో నార్లు పోసేవారు కాగా ఈసారి అలాంటి పరిస్థితులు కానరావడం లేదు. రైతులు వర్షాలు లేక తీవ్ర ఆందోళన చెందుతూ ఉండగా రైతుల వ్యవసాయం పై ఆధారపడే రైతు కూలీలు వర్షం పడితే పత్తి గింజలు నాటే పని దొరుకుతుందని వరి నాట్లు వస్తాయని వర్షాలు లేక తమను ఏ పనికి పిలవడం లేదని రైతు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాల దుకాణాల్లో వరి విత్తనాలు దుకాణాల నిండా కనిపిస్తున్నాయి. కానీ రోజులో ఒకటి రెండు సంచులు అమ్ముడు అవుతున్నాయని దుకానా దారులు అంటున్నారు. వర్షం పై ఆధారపడి జీవించే యావత్ మానవాళి వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవమ్మా అనే మాటను అనునిత్యం అనుకుంటున్నారు .ఎండ తీవ్రత తగ్గాలంటే వర్షాలు కురియాలి ఎండ తీవ్రతతో ప్రజలు ఇండ్ల నుండి బయటకు రావడానికి జంకుతున్నారు .వర్షాలు కురిస్తేనే ప్రజలకు రైతాంగానికి రైతు కూలీలకు అందరికీ మేలు జరుగుతుంది .ఆ వర్షం ఎప్పుడు కురుస్తుందో అందరికీ ఆనందం కలిగేది ఎన్నడో వేచి చూడాల్సిందే.