రామ్‌చరణ్‌కు అమెరికన్‌ నటుడి క్షమాపణ

రామ్‌చరణ్‌కు అమెరికన్‌ నటుడి క్షమాపణ

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు అమెరికన్‌ నటుడు, కమెడియన్‌ టిగ్‌ నొటారో  క్షమాపణలు చెప్పారు. చరణ్‌ పేరును ఎలా పలకాలో తెలియడం లేదన్నారు.  కాలిఫోర్నియా వేదికగా తాజాగా జరిగిన హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డుల ప్రదానోత్సవంలో రామ్‌చరణ్‌  సందడి చేశారు. టిగ్‌ నొటారో  వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో అవార్డ్‌ ప్రజెంటర్‌గా చరణ్‌ పాల్గొన్నారు. హాలీవుడ్‌ నటి అంజలి భీమానీతో కలిసి బెస్ట్‌ వాయిస్/మోషన్‌ క్యాప్చర్‌ అవార్డును అందించారు. అయితే, రామ్‌చరణ్‌ను స్టేజ్‌ పైకి పిలిచే క్రమంలో టిగ్‌ నొటారో.. ''ఆర్‌ఆర్‌ఆర్‌'తో విజయాన్ని అందుకున్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ సూపర్‌స్టార్‌ రామ్‌..'' అంటూ చరణ్‌ అనే పదాన్ని ఎలా పలకాలో తెలియడం లేదని అన్నారు. స్టేజ్‌ వెనుక ఉన్న బృందం సాయం చేయడంతో చరణ్‌ అని ఆయన చెప్పారు. ఆ వెంటనే రామ్‌చరణ్‌ వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పారు. అనంతరం హాలీవుడ్‌ భామ అంజలీ మాట్లాడుతూ.. చరణ్‌ పక్కన నిల్చొని.. ఆయనతో కలిసి అవార్డును అందించడం ఎంతో ఆనందంగా ఉందని, ఇదే తనకు అవార్డ్‌ విన్నింగ్‌ మూమెంట్‌ అని అన్నారు.