ఏపీ ఉద్యోగులకు మరో చిక్కు!..

ఏపీ ఉద్యోగులకు మరో చిక్కు!..
ap employees raise issue with facial recognition attendance app

తాజాగా జగన్‌ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఫేషియల్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ (ముఖ ఆధారిత హాజరు) ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర సచివాలయం స్థాయి వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బయోమెట్రిక్‌ ద్వారానే హాజరు వేయడాన్ని తప్పనిసరి చేసింది. జనవరి 2 నుంచి ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది.ఈ నేపథ్యంలో ఉదయం పది గంటలకు ఉద్యోగులంతా తమ విధులకు హాజరుకావాలి. పది నిమిషాలపాటు గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది. అంటే.. ఉదయం 10.10 గంటల వరకు ఉద్యోగులు బయోమెట్రిక్‌ హాజరు వేయొచ్చు. ఆ తర్వాత అంటే 10.10 గంటలు దాటితే మాత్రం ఉద్యోగుల జీతాల్లో కోత పడనుంది. ఆలస్యం అయిన మేర ఉద్యోగుల జీతాలను తగ్గించనుంది.ఇప్పటికే ఉద్యోగ సంఘాలు జగన్‌ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ప్రతి నెలా జీతాలు ఆలస్యంగా చెల్లిస్తున్నాయని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నాయి. డిసెంబర్‌ నెలలో సైతం కొన్ని విభాగాలు ఉద్యోగులకు రెండు వారాలు గడిచాక కానీ జీతాలు పడలేదు.

ఈ నేపథ్యంలో ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం చేతకావడం లేదు కానీ.. కొద్ది నిమిషాల ఆలస్యమైందని జీతాలు కత్తిరించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడ ఉంటుందని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.వైసీపీలోనే కొంతమంది ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు టాక్‌ నడుస్తోంది.ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం కూడా లేదని.. ఇలాంటి సమయంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు చేరువ కావడానికి నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. ఉద్యోగుల ఆగ్రహాన్ని మరింత పెంచేలా వ్యవహరించడం సరికాదని అంటున్నారు. ఇది ఎన్నికల్లో తమకు నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని వైసీపీ నేతలు లోలోన మథనపడుతున్నట్టు గాసిప్స్‌ వినిపిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కొన్ని విభాగాలకే పరిమితమైన ముఖ ఆధారిత హాజరును జనవరి 2 నుంచి రాష్ట్ర సచివాలయం జిల్లా కేంద్ర కార్యాలయాలు హెచ్వోడీ ఆఫీసులకు ప్రభుత్వం విస్తరించింది. అయితే వీకెండ్‌ సెలవులతో ఇంకా యాప్‌ డౌన్‌ లోడ్‌ ప్రక్రియ పూర్తి కాలేదని అంటున్నారు. అలాగే కొన్ని చోట్ల సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారు. స్మార్ట్‌ ఫోన్లు లేనివాళ్ల హాజరు ఎలా వేయాలని నిలదీస్తున్నారు. యాప్‌ డౌన్‌ లోడ్‌ సాంకేతిక సమస్యల పరిష్కారానికి మరికొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తుండగా ఇకపై అన్ని ప్రభుత్వ శాఖల్లోను ముఖ ఆధారిత హాజరు అమలు చేయనున్నారు.  ఉద్యోగులతో పాటు డీడీవోలకు యాప్‌ వినియోగంపై మార్గదర్శకాలు ఇప్పటికే జారీ అయ్యాయి. మరోవైపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల వివరాలు బాధ్యతలు తీసుకునే జీతం వంటి సమాచారాన్ని బోర్డుల రూపంలో ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించిందని చెబుతున్నారు. మొత్తంగా కొత్త ఏడాదిలో సరికొత్త కొత్త రూల్స్‌ ను జగన్‌ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని చెబుతున్నారు.జనవరి 2న తొలి రోజు యాప్‌ లో తమ వివరాలు నమోదు చేసుకోవడానికి పలు ప్రాంతాల ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని వార్తలు వచ్చాయి. హాజరు నమోదు చేసినా సాంకేతిక సమస్యలతో యాప్‌ లో హాజరు పడక ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది. కొంతమందికి యాప్‌ ను వినియోగించుకోవడంపై అవగాహన లేకపోవడంతో వారు కూడా అయోమయంలో పడిపోయారని అంటున్నారు. ఫోన్‌ నంబర్‌ ఈ కేవైసీ కూడా అప్‌ డేట్‌ కావటం లేదని చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.