సంచలనం రేపిన రియల్టర్ హత్యలో ఇద్దరు నిందితుల అరెస్ట్

సంచలనం రేపిన రియల్టర్ హత్యలో ఇద్దరు నిందితుల అరెస్ట్
  • చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు
  • భూ తగదాలుంటే అధికారులను ఆశ్రయించాలి
  • డీసీపీ సుధీర్

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో సంచలనం రేకెత్తించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నడిపెళ్లి లక్ష్మీకాంతారావు హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 12న గద్దెరాగడిలో మంచిర్యాల కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మీకాంతారావు ను భూ తగాదాలతో హత్య చేశారు. హత్య కు గల కారణాలు,నిందితుల వివరాలను మంచిర్యాల డీసీపీ సుధీర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.    మామిడి శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్ అనే ఇద్దరు లక్ష్మికాంతారావును హత్య చేశారని తెలిపారు. లక్ష్మీకాంతారావు వద్ద తీగల్ పహాడ్ లోని ఐదు ఎకరాల21 గుంటల భూమిని మామిడి శ్రీనివాస్ కొనుగోలు చేశాడని చెప్పారు. అగ్రీమెంట్ సమయంలో టోకెన్ ఎమౌంట్ గా 30 లక్షల రూపాయలు లక్ష్మీకాంతారావు కు చెల్లించాడన్నారు. అడ్వాన్స్ చెల్లించిన తర్వాత శ్రీనివాస్ ప్లాట్లు చేసి విక్రయించాడని అయితే భూమి శ్రీనివాస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయడానికి లక్ష్మీకాంతారావు వాయిదాలు వేస్తూ రావడంతో శ్రీనివాస్ కక్ష పెంచుకున్నాడని వివరించారు. లక్ష్మీకాంతారావు ను చంపితే తన భూమి పరిష్కారం అవుతుందని భావించిన శ్రీనివాస్ మంచిర్యాల లోని సంజీవయ్య కాలనీలో ఉండే దాసరి శ్రీనివాస్ కు డబ్బులిస్తానని చెప్పి హత్యలో భాగస్వామ్యం చేశాడని తెలిపారు. గద్దెరాగడిలో లక్ష్మీకాంతారావు భూమిలో కొంత మంది గోడ నిర్మించడంతో దానిని కూల్చి వేస్తేనే భూమి రిజిస్ట్రేషన్ చేస్తానని శ్రీనివాస్ కు చెప్పడంతో గోడ కూల్చాడన్నారు. అయినప్పటికీ భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుకు రాకపోవడంతో ఈనెల 12వ తేదీన మాట్లాడుదామని గద్దెరాగడికి రమ్మని శ్రీనివాస్ లక్ష్మికాంతారావుకు ఫోన్ చేయడంతో వెళ్లాడని తెలిపారు. అక్కడకువెళ్లిన లక్ష్మికాంతారావును పథకం ప్రకారం కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి కత్తి, సెల్ ఫోన్ లు, ద్విచక్రవాహనంనుస్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రియల్ ఎస్టేట్ రంగంలో వివాదాలు ఉంటే అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని డీసీపీ సుధీర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, సీఐ.మహేందర్ రెడ్డి , ఎస్సైలు పాల్గొన్నారు.