యాదాద్రిపైకి ఆటోలకు అనుమతి

యాదాద్రిపైకి ఆటోలకు అనుమతి
  • ఆదివారం కొండపైకి ఆటోలను ప్రారంభించిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
  • పాత కనుమదారి నుంచి రోజుకు 100 ఆటోలను అనుమతిస్తామని వెల్లడి
  • కొండపై చలువ పందిళ్లు, తదితరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడి

యాదాద్రి కొండపైకి ఆటోల రాకపోకలను ప్రభుత్వం అనుమతించింది. 2022 మార్చి 29న కొండపైకి ఆటోల రాకపోకలను అప్పటి ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆదివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కొండపైకి ఆటోలను ప్రారంభించారు. ఎమ్మెల్యే కూడా స్వయంగా ఆటో నడిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హన్మంత్ కే జెండగే, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీసీపీ రాజేశ్ చంద్ర, యాదాద్రి దేవస్థాన ఈవో రామకృష్ణారావు, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, పుర అధ్యక్షురాలు సుధ, ఎంపీపీ చీర శ్రీశైలం పాల్గొన్నారు. 

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత కనుమదారి నుంచి రోజుకు 100 ఆటోలను అనుమతిస్తామని పేర్కొన్నారు. కొండపైన చలువ పందిళ్లు, డార్మిటరీ హాల్ ప్రారంభం, కొబ్బరి కాయలు కొట్టే స్థలం ఏర్పాటు తదితర అంశాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారన్నారు. నెలాఖరులోగా అవన్నీ ప్రారంభిస్తామని అన్నారు.