రుణ కౌగిట కౌలు రైతు | Mudra News

రుణ కౌగిట కౌలు రైతు | Mudra News
  • ఒక్కొక్కరి సగటు అప్పు రూ. 2.59 లక్షలు
  • ఇందులో ప్రైవేట్​ అప్పు రూ. 199 లక్షలు
  • చేతికి వచ్చిన పంటంతా మిత్తీలకే
  • వడ్డీలేని బ్యాంకు రుణాలు దక్కని వైనం
  • ఆత్మహత్యలకు పాల్పుడుతున్న అన్నదాతలు
  • రాష్ట్రంలో 35.6 శాతం కౌలుదారులే
  • నిజాలు వెల్లడించిన రైతు స్వరాజ్య వేదిక 


ముద్ర, తెలంగాణ బ్యూరో : కౌలు రైతుల జీవితం మరింత దుర్భరంగా మారుతున్నది. యేటేటా వీళ్ల పరిస్థితి దయనీయవుతున్నది. కౌలు ధరలు, పెట్టుబడులు పెరిగిపోతుండడం, ఎటువైపు నుంచీ కనీస మద్దతు లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతోన్న దుస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కౌలు రైతులను గుర్తించేది లేదని ప్రకటించారు. ధరణి అమల్లోకి వచ్చాక పహాణీలలో సైతం కౌలుదారు కాలమ్‌ను రద్దు చేశారు. దాంతో వారికి కనీస గుర్తింపు లేకుండా పోయింది. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నవారిలో 35.6 శాతం కౌలురైతులే ఉన్నారు. రాష్ట్రంలోని కౌలు రైతుల స్థితిగతుల మీద రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో అధ్యయనం చేశారు. 30 జిల్లాలలో 7,744 మంది రైతులను పలకరించారు. ఇందులో 2,753 మంది కౌలు రైతులు. ఈ సర్వేలో వారి పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు తేలింది.  రాష్ట్రంలో 35.6 శాతం రైతులు కౌలు మీద ఆధారపడి సాగు చేస్తున్నట్లు అంచనా వేశారు. 

సర్కారు భరోసా లేదు
కేవలం వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తోన్న కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేకుండా పోయింది. అటు పెట్టుబడి సాయం, ఇటు రుణ మద్దతు, విత్తనాలు, ఎరువుల సబ్సిడీలు, ప్రమాదాలు జరిగిప్పుడు బీమా సదుపాయాలు, పంట నష్టపోతే పరిహారం అందకపోగా, పంట అమ్ముకునేటప్పుడు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కౌలుదారులను గుర్తించి, వారికి ఈ ప్రయోజనాలందేలా చూస్తే తప్ప వారు మనుగడ సాగించలేని పరిస్థితి నెలకొంది. 2010–-11లో అప్పటి ప్రభుత్వం కౌలు రైతులకు రుణ అర్హత గుర్తింపు కార్డులిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 54 వేల మందికి కార్డులు అందజేసి రూ.10 వేల చొప్పున రుణ సదుపాయం కల్పించారు. ఆతర్వాత ప్రభుత్వాల విధిధానాలు మారడంతో ఆ పథకం ఆటకెక్కింది. 

ఆరేళ్లలో రెట్టింపైన కౌలు ధరలు
రాష్ట్రంలో గత ఆరేళ్లలో కౌలు ధరలు రెట్టింపయ్యాయని తేలింది. ఎక్కువ మంది కౌలు రైతులు వర్షాలపై ఆధారపడి సాగు చేస్తున్నారు. 53.19 శాతం వర్షాలు, 21.42 శాతం బోర్లు, 13.71 శాతం బావులు, 8.73 శాతం కెనాల్​, 2.95 శాతం చెరువులపై ఆధారపడి పత్తి, వరి, కంది, మొక్కజొన్న సాగుచేస్తున్నారు. వీరిలో 91.1 శాతం రైతులు కౌలును నగదు రూపంలో చెల్లిస్తున్నారు. తాకట్టు రూపంలో 1 శాతం, పంటల రూపంలో 7.5 శాతం సాగు చేస్తున్నారు. నిరుటి వరకు వరి ఎకరాకు రూ. 1‌‌0 వేల నుంచి రూ. 12 వేల కౌలు ధరలు ఉండగా, ఈ యేడు సగటున రూ. 15,647 చొప్పున పెరిగాయి. పత్తికి కూడా సగటున రూ. 14,834కు పెరిగింది. వీటికితోడుగా ఎరువులు, విత్తనాలు, కూలీ రేట్లు కూడా అధికమయ్యాయి. 

పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులే దిక్కు
కౌలు రైతులకు బ్యాంకు రుణాలు రాకపోవడం, సొంతంగా ఆర్థిక స్థోమత లేకపోవడంతో విత్తనాల కొనుగోలు మెదలుకొని పంట కోతల కూలీల ఖర్చుల వరకు అన్ని రకాల పెట్టుబడులకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. లేదంటే ఎరువుల దుకాణాల వ్యాపారుల వద్దకు వెళ్తున్నారు. దాంతో చేసిన కష్టమంతా వడ్డీలకే సరిపోతోన్న పరిస్థితి నెలకొంది. ప్రైవేట్​ రుణాల ఊబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ఒక్కో కౌలు రైతుపై సగటు మొత్తం అప్పు రూ. 2,59,164 ఉండగా, ఇందులో ప్రైవేట్​ వ్యాపారుల దగ్గర తీసుకుంటున్న అప్పు రూ. 1,99,852గా తేలింది. ఇక బ్యాంకుల నుంచి రూ. 50 వేల వరకు వస్తున్నాయి. ప్రైవేట్​ వ్యాపారుల దగ్గర నుంచి తీసుకుంటున్న అప్పుకు వడ్డీ సగటున 24 నుంచి 6‌‌0 శాతం వరకు ఉంటుందని తేలింది. సర్వే చేసిన కౌలు రైతుల్లో మెజార్టీగా 2062 మంది తాము ప్రైవేట్​ వ్యాపారుల దగ్గర రుణాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక ఎరువుల వ్యాపారుల దగ్గర 581 మంది, బంగారం తాకట్టు పెట్టి 332 మంది, బంధువులు, స్నేహితుల దగ్గర 294 మంది, కమీషన్​ ఎజెంట్లు, డీలర్ల దగ్గర 278 మంది, భూ యజమానుల దగ్గర 182 మంది, ఇతరుల దగ్గర 284 మంది అప్పును సమకూర్చుకుంటున్నారు. వీరంతా పూర్తిగా ప్రైవేట్​ వ్యాపారులపై ఆధారపడి ఉండటంతో.. వడ్డీ భారం గణనీయంగా పెరుగుతున్నది. 

సాయం కరువు
 కౌలు రైతులకు కనీస సాయం కరువైంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లేకపోవడం, బ్యాంకుల్లో రుణం ఇవ్వకపోవడంతో తీరని భారం మోయాల్సి వస్తోంది. పంటలు నష్టపోతే పెట్టుబడులు నష్టపోగా, అధికారికంగా ఎక్కడా గుర్తింపు లేకపోవడంతో పంటనష్ట పరిహారం కూడా దక్కని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు, ఇతర సాగు ప్రోత్సాహకాలు కూడా అందడం లేదు. ప్రమాదవ శాత్తు సాగు సందర్భంగా విద్యుత్‌ షాక్‌తో గానీ, లేక ఇతర ఏదైనా కారణాలతో  చనిపోయినా గుర్తింపు లేకపోవడంతో కనీసం ఇన్సూరెన్స్‌ కూడా లభించని దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నారు. రైతు స్వరాజ్య వేదిక సర్వేలో తేలిన ప్రకారం.. రైతుబంధుతో తమకు ఎలాంటి ఉపయోగం లేదని 97.3 శాతం మంది కౌలు రైతులు సమాధానమిచ్చారు. అయితే, రైతుబంధ పథకం ద్వారా నగదు అందుతుండటంతో కొంత కౌలు ధర తగ్గించారని 0.6 శాతం (17) మంది మాత్రమే చెప్పారు. ఇక, పంటల భీమా పథకంలో కౌలు రైతులు సాగు చేస్తున్న భూములు ఉండటం లేదు. తమ పంటలునష్టపోయినా అసలు లెక్కే వేయలేదని 21 శాతం రైతులు వెల్లడించారు. కాగా, పంటల నష్టంతో చివరి ఐదు నెలల్లో రాష్ట్రంలో 478 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తేలింది.