భద్రకాళి చెరువుకు గండి

భద్రకాళి చెరువుకు గండి
  • హుటాహుటిన సమీపంలోని కాలనీవాసులను తరలించిన అధికారులు
  • వరద దారి మళ్లింపు
  • పర్యవేక్షించిన మంత్రి ఎర్రబెల్లి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్, ప్రభుత్వ చీఫ్ విప్, కలెక్టర్లు, సీపీ
  • ఇసుక, సిమెంట్ బస్తాలతో కట్టడి
  • తప్పిన ప్రాణ ఆస్తి, నష్టాలు భారీ ఎత్తున పోలీసుల మోహరింపు

వరంగల్ భద్రకాళి చెరువు కు గడ్డి పడింది. పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అమ్మవారిపేట, ఉర్సు గుట్ట, బట్టుపల్లి చెరువుల మత్తడి భారీ ఎత్తున పోటెత్తడంతో భద్రకాళి చెరువు పురాతన కట్ట గండి పడింది. మూడు రోజులుగా చెరువులు మత్తల్లు పోస్తుండడంతో ఎగువ నీరు భద్రకాళి చెరువుకు చేరుతుండడంతో అధికారులు శుక్రవారం ముందస్తు చర్యగా.. పోతన నగర్ వైపున ఉన్న పురాతన కట్టకు చిన్న రంధ్రం చేశారు. వరద ఉధృతి పెరగడంతో పురతన మట్టి కట్ట కోతకు గురై గండిగా ఏర్పడింది.

హుటాహుటిన ఘటన స్థలికి..

కట్ట కోతకు గురైన విషయం తెలియగానే అధికారులు తక్షణమే ఘటన స్థలికి చేరుకుని నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ముందుగా గండికి ఆనుకుని ఉన్న పోతన నగర్, సరస్వతి నగర్, సరస్వతి టెంపుల్ కాలనీల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ ఎత్తున పోలీసులను ఏర్పాటు చేసి గండి చోటికి ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. గండి ద్వారా వరద నీటిని కాలనీలకు రాకుండా అధికారులు అలంకార్ సెంటర్ వైపుగా దారి మళ్ళించారు. భద్రకాళి రోడ్డులోని డ్రైనేజీ మీదుగా ఎల్బీ కాలేజ్, అలంకార్ సెంటర్ డ్రైనేజీ ద్వారా వరదను మళ్ళించారు.

ఇసుక, సిమెంట్ బస్తాలతో కట్టడి..

గండిని పూర్తి చేసేందుకు పూడ్చి వేసేందుకు గ్రేటర్ కమిషనర్ రిజ్వాన్ బాషా ఇసుక, సిమెంట్ బస్తాలను గండికి అడ్డంగా వేసి నీటిని నియంత్రించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. జెసిబిల ద్వారా బస్తాలను వాటర్ ప్రవాహానికి అడ్డుగా వేసే ప్రయత్నం చేస్తున్నారు. అంచనాలకు మించి వర్షం ఒక్కసారిగా కురవడం వల్లే గండికి కారణమని మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ భాషా తెలిపారు.  

పర్యవేక్షించిన ప్రజాప్రతినిధులు..

గండి విషయం తెలియగానే సమీక్ష సమావేశానికి హనుమకొండ లోనే ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు ప్రావీణ్య, సిక్త పట్నాయక్, సీపీ రంగనాథ్, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషాలు ఘటన స్థలానికి వెంటనే చేరుకున్నారు. ఐబీ, మున్సిపల్, పోలీస్ అధికారులతో తక్షణమే తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు.

తప్పిన ప్రాణ, ఆస్తి నష్టం..

కట్ట కోతకు గురి కావడంతో గండి ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న పోతన నగర్, సరస్వతి నగర్, సరస్వతి టెంపుల్ కాలనీ, కాపువాడల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. భద్రకాళి చెరువు నీటి సామర్థ్యం భారీ ఎత్తున ఉండడంతో ప్రాణ, ఆస్తి నష్టాలు పెద్ద ఎత్తున ఉండనున్నాయనే ఊహాగానాలు చెలరేగాయి. కానీ మున్సిపల్ అధికారులు సత్వరమే స్పందించి నష్ట నివారణ చర్యలతో గండి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు చోటు చేసుకోలేదు. దీంతో కాలనీవాసులు నగర ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

భారీ ఎత్తున మోహరించిన పోలీసులు..

గండిని పరిశీలించేందుకు వచ్చిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, ఆయన అనుచరులను అడ్డుకున్నారు. ఎవరు వెళ్లేందుకు వీళ్లేదని స్పష్టం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన రాకేశ్ రెడ్డి ఎలాగైనా తమను గండి ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. కాసేపు వాగ్వాదం తర్వాత పోలీసులు కేవలం రాకేష్ మాత్రమే అనుమతి ఇవ్వడం.. ఆయన అనుచరులపై చేతివాటం ప్రదర్శిస్తూ పోలీస్ జీవుల్లో బలవంతంగా లాక్కెళ్లారు.

688 ఎకరాలు.. 700 ఎకరాల విస్తీర్ణం..

వరంగల్ పట్టణంలోనే భద్రకాళి చెరువు అతి పెద్దది. చెరువు విస్తీర్ణం మొత్తం 700 ఎకరాలు కాగా.. 688 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుంది. పట్టణంలోని ప్రజలకు దాహార్తి తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది. 112 కిలోమీటర్ల పరివాహక ప్రాంతం నుంచి చెరువుకు వరద నీరు వచ్చి చేరుతుంది. 150 మిలియన్ క్యూబిక్ అడుగుల నీటి నిలువ సామర్థ్యం కలిగి ఉంది. ఇంతటి ప్రఖ్యాతిగాంచిన చెరువులు కబ్జాకోరులు చేరబట్టాయి. చెరువు శిఖం భూములు అధికార పార్టీ నాయకులకు చెందిన అనుచరులు ఇప్పటికే చాలా వరకు ఆక్రమించుకున్నారు. దీనిపై ప్రజల్లో ఇప్పటికే విస్తృతమైన చర్చ జరుగుతోంది.

కాలనీవాసుల ఆందోళన..

గండి ప్రాంత సమీపంలోని పోతన నగర్, సరస్వతి నగర్, జ్ఞాన సరస్వతి టెంపుల్ కాలనీ, కాపు వాడ సంబంధిత ప్రజలు ఆందోళన దిగారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే భయాందోళన పరిస్థితి ఎదుర్కొంటున్నామన్నారు. భద్రకాళి బండ్ నిర్మాణం ద్వారా తమ కాలనీలో మరింత లోతట్టు ప్రాంతాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను అర్థం చేసుకొని పరిష్కరించాలని కోరారు.