కల్వకుంట్ల పాలనకు  చరమగీతం పాడుతాం

కల్వకుంట్ల పాలనకు  చరమగీతం పాడుతాం
  • తెలంగాణలో అధికార మార్పు తథ్యం
  • ప్రధాని ‘విజయ సంకల్ప సభ’ను సక్సెస్ చేయండి : కిషన్​రెడ్డి
  • ప్రజల చూపు బీజేపీ వైపు: ఈటల
  • 15 లక్షల మందితో బహిరంగ సభ: బండి
  • సన్నాహక సమావేశంలో నేతలు

ముద్ర ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో అధికార మార్పు తథ్యమని, కల్వకుంట్ల కుటుంబ నియంతృత్వ, నిరంకుశత్వ పాలనకు బీజేపీ చరమగీతం పాడుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూలై 8న ప్రధాని మోడీ వరంగల్ కు రానుండడంతో ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో కిషన్ రెడ్డితోపాటు బీజేపీ స్టేట్​చీఫ్​బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల హాజరయ్యారు. బీజేపీ నిర్వహిస్తున్న సభకు ‘విజయ సంకల్ప సభ’గా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. ముందుగా ప్రధాని శంకుస్థాపన చేయనున్న కాజీపేటలోని వ్యాగన్ ఫ్యాక్టరీ ప్రాంతాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడారు. అనంతరం హరిత హోటల్, ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ప్రధాని ముందుగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో మాట్లాడతారని పేర్కొన్నారు. 

కేసీఆర్​ది నియంతృత్వ పాలన..

సీఎం కేసీఆర్​నియంతృత్వ పోకడలతో కుటుంబ పాలన సాగిస్తున్నారన్నారు. హామీలకు తూట్లు పొడుస్తూ ప్రజలను మోసం చేశారన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైతు రుణమాఫీ ఏమైందని, రైతాంగానికి ఉచితంగా ఎరువులు అందిస్తానన్న కేసీఆర్ మాట ఎటుపోయిందని కిషన్​రెడ్డి ప్రశ్నించారు. రైతుబంధు పేరిట కేసీఆర్​అన్నదాతలను మోసం చేస్తున్నారని, కేంద్రం ఎకరానికి 4 బస్తాల యూరియాపై రూ.15 వేల సబ్సిడీ ఇస్తుందన్నారు. సామాన్యులకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ను అధికారంలోకి రాగానే.. ప్రజా ప్రగతి భవన్ గా మారుస్తామని తెలిపారు. కమలం పార్టీని ప్రజల నుంచి దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్,​కాంగ్రెస్​కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతోపాటు హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలతో రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని ప్రజలు గుర్తించారన్నారు. కేంద్రం రామప్ప గుడిని సంరక్షించేందుకు రూ.60 కోట్లు, ఆలయ ప్రాంగణంలో ఉన్న అమ్మవారి కల్యాణ మండప నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేసిందన్నారు.   

ప్రజలు బీజేపీవైపే చూస్తున్నారు : ఈటల

రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, సువర్ణ పాలన అందిస్తున్న బీజేపీ వైపే ప్రజల దృష్టి ఉందని హుజూరాబాద్​ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రామగుండంలో మూతపడిన ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు. వరంగల్లో రైల్వే వ్యాగన్ ద్వారా సుమారు 3000 మంది యువతకు ఉపాధి లభించనుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను శ్రేణులు సక్సెస్​చేయాలని కిషన్ రెడ్డి, ఈటల పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఊరికి ఒక్క బస్సు చొప్పున 8వ తేదీన ఉదయం 9 గంటల లోపే ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. 

బీఆర్ఎస్​కు ప్రత్యామ్నాయంగా ఎదిగాం: బండి

15 లక్షల జన సమీకరణే లక్ష్యంగా బహిరంగ సభ నిర్వహిస్తామని బీజేపీ స్టేట్​చీఫ్​బండి సంజయ్ అన్నారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్వహించిన సభలను మించి జన సమీకరణ చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలో సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ఆపసోపాలు పడుతోందని, అది పాదయాత్ర ముగింపు సభా.. లేక చేరికల సభో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. దుబ్బాక, హుజూరాబాద్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల తర్వాత బీజేపీయే బీఆర్ఎస్​కు ప్రత్యామ్నాయంగా ఎదిగిందన్నారు. స్మార్ట్ సిటీ కింద వరంగల్ కు రూ.196 కోట్లు కేంద్రం కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ వాటాను ఇంతవరకు విడుదల చేయలేదన్నారు. కార్యక్రమంలో గరికపాటి మోహన్ రావు, మాజీమంత్రులు మర్రి శశిధర్ రెడ్డి, జి.విజయరామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, శృతి తదితరులు పాల్గొన్నారు.
 

బీజేపీ ఎన్నికల సారధిగా ఈటల!

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీజేపీ రాష్ట్ర కమిటీలో పలు మార్పులు చేయనున్నది. ఇటీవల రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలు, అలకలు తదితర ఘటనలపై ఇప్పటికే అధిష్ఠానం సమావేశం నిర్వహించి, కూలంకుషంగా చర్చించింది. రాష్ట్ర నేతల్లో విభేదాలపై ఆరా తీసింది. ఈసారి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే కృత నిశ్చయంతో పలు మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. 

సందర్భం ఆసన్నమైంది.. సైనికుడిలా పనిచేస్తా..

ఢిల్లీలో జరిగిన సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడిన అధిష్ఠానం.. మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేకంగా ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ కమిటీ బాధ్యతలను ఈటలకు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో రాజేందర్ కు ఢిల్లీ పెద్దల నుంచి సంకేతాలు అందినట్లు సమాచారం. ఈ మధ్యే ఢిల్లీ వెళ్లిన ఈటల.. ఢిల్లీ పెద్దలతో భేటీ అనంతరం ట్వీట్ చేశారు. ‘ప్రజల ఆశీర్వాదం దొరికే సందర్భం ఆసన్నమైంది. ఒక సైనికుడిలా పనిచేస్తా’ అని ట్వీట్ లో ఈటల పేర్కొన్నారు. తెలుగు, హిందీ భాషల్లో చేసిన ఈ ట్వీట్ ను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ బీజేపీ, తెలంగాణ బీజేపీ ట్వీట్టర్స్ కు ట్యాగ్ చేశారు. ఈ కమిటీ బాధ్యతలు ఈటల చేపడితే టిక్కెట్ల కేటాయింపు, ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించనున్నారు. 

సీఎం అభ్యర్థిపై విసృత చర్చ..?

వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిపై కూడా విసృతంగా చర్చ జరుగుతున్నది. తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి బీసీ అభ్యర్థినే సీఎం క్యాండిడేట్​గా ప్రకటించాలనే అంశంపై కూడా చర్చ కొనసాగుతున్నది. అలాగే బీజేపీ కూడా దేశవ్యాప్తంగా బీసీలు, ఓబీసీలపై పనిచేయాలని ప్రణాళిక చేపట్టింది. దీనికి సంబంధించి బీసీ అభ్యర్థి ఎవరనే అంశంపై విసృతంగా చర్చ జరుగుతున్నది. కాగా తెలంగాణలో ఉన్న బీసీల్లో ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారు. కానీ డాక్టర్​ లక్ష్మణ్​కు దేశవ్యాప్తంగా ఉన్న బీసీలు, ఓబీసీలను జాగృతం చేసేందుకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. దీని కోసం ఆయనకు ఓబీసీ చైర్మన్​గా బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన పేరు బీసీ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు చాలా తక్కువ. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు. కానీ ఆయనపై పలురకాలుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటల రాజేందర్ ఒక్కడే సీఎం అభ్యర్థిత్వానికి సరైన లీడర్​అని అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలిసింది.