నవరాత్రి వేడుకలకు బాసర ఆలయం ముస్తాబు

నవరాత్రి వేడుకలకు బాసర ఆలయం ముస్తాబు
  • నేటినుంచి రోజుకో అవతారంలో అమ్మవారి దర్శనం 
  • సర్వం సిద్ధం చేసిన అధికారులు 

బాసర, ముద్ర : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయoలో ఈ నెల 15 నుంచి 23 తేది వరకు జరగనున్నాయి. తొమ్మిది రోజులపాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ నుండే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య, పోలీసు, ఆలయ అధికారులు సేవలు అందిస్తారు. ఆలయంలో తొమ్మిది రోజులపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ముస్తాబైన ఆలయం
శరన్నవరాత్రుల సందర్భంగా  అమ్మవారి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో ,  గోపురాలను ప్రత్యేక పూలతో అలంకరించారు.

నేడు ప్రత్యేక పూజలు
సరస్వతి అమ్మవారికి ఆదివారం వేకువ జామున ప్రత్యేక అభిషేకం, అలంకరణ అనంతరం  వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

అమ్మవారి రూపాలు ఇవే 
నవరాత్రి ఉత్సవాల భాగంగా మొదటిరోజు శైలపుత్రి, రెండోరోజు బ్రహ్మచారినీ,మూడో రోజు చంద్రఘంట, నాలుగోరోజు కూష్మాండ దేవి, ఐదో రోజు స్కంద మాత, ఆరో రోజు కాత్యాయని, ఏడో రోజు కాల రాత్రి, ఎనిమిదో రోజు మహా గౌరీ, తొమ్మిదో రోజు సిద్ధి ధాత్రి, రూపాల్లో సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

భారీ బందోబస్తు
ఉత్సవాల్లో భాగంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. ఏ ఎస్పి కాంతిలాల్ పాటిల్, సీఐ వినోద్ రెడ్డి,ఎస్సై గణేష్ తో పాటు వందమందికి పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు.
ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు.