పోడు భూములపై ముఖ్యమంత్రి కి భట్టి బహిరంగ లేఖ

పోడు భూములపై ముఖ్యమంత్రి కి భట్టి బహిరంగ లేఖ
  • హక్కు పత్రాలు ఇవ్వాల్సిందే
  • పోడు భూముల హక్కు పై శ్వేతపత్రం విడుదల చేయాలి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : రాష్ట్రంలోని పోడు వ్యవసాయం చేస్తున్న రైతుల‌కు హ‌క్కు ప‌త్రాల‌ను ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ పంపిస్తున్నట్లు  సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క వెల్లడించారు.  చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గం పోలంప‌ల్లి గ్రామంలో సోమ‌వారం పాద‌యాత్ర‌లో పాల్గొన్న భట్టి మీడియా సమావేశంలో లేఖ‌ను విడుద‌ల చేశారు.  మార్చి 16 నుంచి  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో  పీపుల్స్ మార్చ్ పాద‌యాత్రలో చాలా మంది పోడు భూములపై మొరపెట్టుకున్నారన్నారు.  

కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన పోడు పట్టాల భూములను బిఆర్ ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ద్వారా హక్కులు కోల్పోయామని వాపోయారని తెలిపారు. పోడు వ్యవసాయం చేయడానికి అటవీ అధికారులు అనుమతించకపోవడం కాకుండా అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. 

 2014, 2018  నాగార్జున సాగ‌ర్‌, మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో పోడు భూముల స‌మ‌స్య‌ల‌ను అస్త్రంగా వాడుకున్నారని ఆయన విమర్శించారు.  2018 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో సైతం పోడు భూముల అంశాన్ని ప్ర‌స్తావించారని ఆయన గుర్తుచేశారు. 2019 మార్చిలో జ‌రిగిన శాస‌న‌స‌భ స‌మావేశాల సాక్షిగా పోడు భూములు చేసుకుంటున్న గిరిజ‌నుల‌కు హ‌క్కు ప‌త్రాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించి ఆచరణలో అమలు చేయలేదని ధ్వజమెత్తారు. 

ఆర్థిక శాఖామంత్రి హ‌రీష్ రావు గ‌త నెల 9న జరిగిన మంత్రివ‌ర్గ స‌మావేశాల్లో ల‌క్ష 55 వేల 393 మందికి మొద‌టి విడ‌త‌లో పోడు భూములకు హ‌క్కు ప‌త్రాలు ఇస్తామ‌ని మాట తప్పారని అన్నారు. పోడు భూములకు పట్టాల కోసం ఎంత మంది ధరఖాస్తు చేసుకున్నారో జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా ప్రభుత్వం జాబితాను విడుదల చేయాలని భట్టి డిమాండ్ చేశారు. పోడుభూముల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయకుంటే కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తుందని ఆయన అన్నారు. ఆదివాసీలు, గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం సత్వరమే ఉపసంహరించుకోవాలని భట్టి విక్రమార్క కోరారు. ఈ సమావేశంలో మాజి ఎమ్మెల్సి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు.