ఈనెల 7న కురవిలో భారత్ బచావో రైతు రణభేరి సభ

ఈనెల 7న కురవిలో భారత్ బచావో రైతు రణభేరి సభ

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈనెల 7న భారత్ బచావో రైతు రణభేరీ మహాసభను మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కురవి హైస్కూల్ గ్రౌండ్ లో నిర్వహించబోతున్నట్లు ఆహ్వాన కమిటీ కన్వీనర్ భూపాల్ నాయక్ తెలిపారు. ఏడవ తేదీ (గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. రైతులు, కూలీల సంక్షేమాన్ని పట్టించుకోకుండా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ రైతులు కోరుతున్న కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించకుండా కాలయాపన చేస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వలన ప్రతి ఏడూ ఎరువులు, విత్తనాలు, డీజిల్ ధరలు పెరుగుపోతూ రైతులపై భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత పరిధిలోకి వస్తుందన్నారు. అయితే దశాబ్ధకాలం గడిచినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానం తయారు చేయలేదని ఆయన ఆరోపించారు. మొత్తంగా బడ్జెట్ కేటాయింపులు పెరిగిన రైతుల సమస్యలు మాత్రం తీరడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 7న కురవి మండల కేంద్రంలో రైతు రణభేరి సభ నిర్వహిస్తున్నామని భూపాల్ నాయక్ తెలిపారు. ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని రైతాంగానికి ఆయన విజ్ఞప్తి చేశారు.