బీసీ సీఎం.. ఈటలే ముఖ్యమంత్రి అభ్యర్థి?

బీసీ సీఎం.. ఈటలే ముఖ్యమంత్రి అభ్యర్థి?
  • తెరపైకి బీజేపీ కొత్త నినాదం
  • ఈ మేరకు ఢిల్లీ పెద్దల నుంచి హామీ
  • ప్రచార సారథి బాధ్యతలు కూడా
  • పార్టీ చీఫ్ పదవి అడిగిన రాజేందర్
  • ఆయనను బుజ్జగించిన అధిష్టానం 
  • సీనియర్ నేతలతోనూ పెద్దల చర్చలు
  • డీకే అరుణ నేతృత్వంలో టిక్కెట్ స్క్రీనింగ్ కమిటీ
  • మాజీ ఎంపీలు, కీలక నేతలకు ఇందులో చాన్స్​
  • అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత వీరిదే
  • రాష్ట్ర బీజేపీలో త్వరలోనే కీలక మార్పులు


అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ అధిష్టానం కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నది. పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలను పరిష్కరించడంతో పాటుగా ఈటల వర్గాన్ని యాక్టివ్ చేయడం, అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలను బుజ్జగించడంలాంటి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నది. తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని పావులు కదుపుతున్న బీజేపీ హైకమాండ్ ఈపారి ఎన్నికలకు ముందు బీసీ నినాదాన్ని బలంగా వినిపించాలని భావిస్తున్నది. దీనిలో భాగంగానే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి బీసీ సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నారని విశ్వసనీయ సమాచారం. 


స్క్రీనింగ్​ కమిటీ
బండి సంజయ్​కు వ్యతిరేకంగా చాలా మంది సీనియర్లు అలిగినట్లు పార్టీ గుర్తించింది. ఇప్పటికే పలువురు నేతలు తమకు ప్రాధాన్యం లేదని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వలస నేతల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందనే ఆవేదన ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీలో కొత్త కమిటీలు వేయాలని భావిస్తున్నారు. ఇప్పటి దాకా టిక్కెట్ల కేటాయింపు అధిష్టానమే చూసుకుంటున్నా. ఈసారి కొత్త ప్రయోగం చేయనున్నారు. పొలిటికల్ ఫైర్ బ్రాండ్​డీకే అరుణ నేతృత్వంలోనే టిక్కెట్ స్క్రీనింగ్​ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది. మాజీ ఎంపీలు జితేందర్​రెడ్డి, కొండా విశ్వేశ్వర్​రెడ్డి సహా పలువురు నేతలను ఇందులో సర్దుబాటు చేసే చాన్స్​ ఉంది. అభ్యర్థులను ఈ కమిటీ నుంచే సిఫారసు చేయనున్నారు. ఈ విషయం కూడా ఈటలతో చర్చించినట్లు తెలుస్తున్నది. 


ముద్ర, తెలంగాణ బ్యూరో:
రాష్ట్రంలో ఎలాగైనా కాషాయం జెండా ఎగురవేయాలని బీజేపీ అనేక వ్యూహాలు రచిస్తున్నది. అందులో భాగంగానే ‘బీసీ సీఎం, ఈటల రాజేందర్ అభ్యర్థి’ అనే విధంగా భారీ స్కెచ్​వేసినట్టు సమాచారం. రాష్ట్రంలో అధికార పార్టీ ఇప్పటికే బీసీ జపం చేస్తున్నది. కాంగ్రెస్​ కూడా బీసీవాదంతో పాటుగా యూత్​ నినాదాన్ని ఎత్తుకున్నది. ఇలాంటి పరిణామాలలో బీజేపీ ‘బీసీ సీఎం’ అంటూ విస్తృత ప్రచారం చేసుకోవాలని రాష్ట్ర నేతలకు సూచిస్తున్నది. ఈ కీలక మార్పులన్నీ రెండు, మూడు రోజులలోనే చేయనున్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చే జాతీయ నేతలంతా ఇక నుంచి మోడీ తొమ్మిదేండ్ల పాలన, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధిని మన రాష్ట్రంలో వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి ప్రభుత్వాన్ని పదేపదే విమర్శించడం కంటే, తమ అభివృద్ధి ప్రణాళికను తెలంగాణ ప్రజల ముందు పెట్టాలని అధిష్టానం సూచిస్తున్నది. కేసీఆర్ సర్కారు వైఫల్యాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదనే ప్రచారాన్ని తీసుకుంటూనే, బీసీ ముఖ్యమంత్రి ఆయుధాన్ని ప్రయోగించనున్నారు. బీసీ వర్గాలతో పాటుగా ఇతర వర్గాలు, ప్రజా సంఘాలను ఈటల రాజేందర్​ ప్రభావితం చేస్తారని, బీసీ సీఎం నినాదం చాలా మేరకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్​కు బీజేపీ నుంచి ఇదే హామీ వచ్చినట్లు తెలుస్తున్నది. రాష్ర్ట జనాభా 4 కోట్ల వరకు ఉండగా, ఇందులో బీసీలే 1.90 కోట్ల వరకు ఉన్నారు. జనాభా శాతంగా పరిశీలిస్తే బీసీలు 54.01 శాతం, ఎస్సీలు 18.48 శాతం, ఎస్టీలు 11.75 శాతం, మైనార్టీలు 10.6 శాతం, ఓసీలు 5 శాతం ఉన్నారు. బీసీ ఓటు బ్యాంకు కీలకంగా మారుతున్నది. దీంతో బీజేపీ ఈసారి బీసీ నినాదాన్ని బలంగా వినిపించాలని భావిస్తున్నది. 

సర్దుబాటు ఎలా?
రాష్ట్ర బీజేపీలో ఇప్పటికే వర్గాలు ఎక్కువయ్యాయి. బండి సంజయ్, కిషన్​రెడ్డి, లక్ష్మణ్​వర్గాలు గతం నుంచే ఉన్నాయి. ఇప్పుడు ఈటల రాజేందర్​వర్గం కూడా తయారైంది. పార్టీలో వలస నేతలకు ప్రయార్టీ ఇవ్వకపోవడంతో కాషాయ కండువా కప్పుకున్న కీలక నేతలు ఈటలను ముందుకు తీసుకువస్తున్నారు. ఇలాంటి రాజకీయ పరిణామాలలో ఇప్పుడు బీజేపీ అధిష్టానం పెద్ద సాహసమే చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈటలను బీసీ సీఎం, ప్రచార సారథి వంటి బాధ్యతలను అప్పగిస్తే, ఇటు సంజయ్​ను కూడా ఒప్పించాల్సి ఉంటుంది. సంజయ్​ కూడా బీసీ వర్గమే కావడంతో మళ్లీ సీటు పంచాయతీ మొదలయ్యే అవకాశాలున్నాయి. డీకే అరుణకు స్క్రీనింగ్​ కమిటీ బాధ్యతలిస్తే కొంతమంది పార్టీ సీనియర్ల నుంచి అసంతృప్తి వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే ఈటలకు పదవిపై అధిష్టానం చాలా అంశాలలో ఆలోచిస్తున్నది. పార్టీ స్టేట్​చీఫ్ పదవి కోసం ఈటల ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈటలకు పార్టీ చీఫ్​ ఇస్తే సంజయ్​ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతున్నది. తాజా పరిణామాలలో స్టేట్ చీఫ్​ను మార్చకుండా.ఈటలకు కీలక పదవితో పాటుగా బీసీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు. సంజయ్​ను ఒప్పించేందుకు ఆల్రెడీ చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్. బీసీ సీఎం అనే అంశాన్ని పార్టీలో రహస్యంగానే చర్చించాలని కూడా చెబుతున్నారు. బీసీ సీఎం అభ్యర్థిగా ఈటల, పార్టీ స్టేట్​ చీఫ్​గా బీసీ వర్గానికి చెందిన సంజయ్​ఉంటే బీసీ వర్గాలను తమవైపు తిప్పుకుంటామని, పార్టీ టికెట్​ స్క్రీనింగ్​ కమిటీ బాధ్యతలను డీకే అరుణకు ఇస్తే రెడ్డి వర్గీయులకు కూడా ప్రయార్టీ ఇచ్చినట్లు ఉంటుందని బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం నుంచి కిషన్​రెడ్డి కేంద్రమంత్రిగా ఉండగా, అటు లక్ష్మణ్​ కూడా ఎంపీగా, ఓబీసీ జాతీయ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. దీంతో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా బీజేపీకి క్రెడిట్​ వస్తుందని భావిస్తున్నారు. 

ఈ మూడు రోజుల్లోనే!
బీజేపీ రాష్ట్ర శాఖలో మార్పులన్నీ ఈ రెండు, మూడు రోజులలో పూర్తవుతాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే దీనిపై అన్ని వర్గాలతో చర్చలు పెట్టినట్లు సమాచారం. ఢిల్లీకి వెళ్లిన ఈటల మార్పులపై పూర్తిస్థాయిలో చర్చించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటం, ప్రధాని, అమిత్​ షా, నడ్డా పర్యటనలకు ముందే ఈ వివాదాన్నింటికీ చెక్​ పెట్టాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తున్నది.