బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోంది

బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోంది
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మునుగోడు శాసన సభ ఉప ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ దారుణంగా పడిపోతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. బుధవారం మంచిర్యాల వచ్చిన సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ స్థాయి రోజురోజుకు తగ్గుతుందని అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ ఓటమి చవి చూడడం తథ్యమని ఆయన అన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలు రగిలించి రాజకీయ ప్రయోజనం పొందాలనే కుటిల యత్నంకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఇచ్చిన హామీలు ఆచరణలో అమలు చేయాలని సూచించారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలను తిప్పికొట్టడానికి త్రిముఖ వ్యూహంతో పోరాటం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల పోడు భూములకు కేసీఆర్ హక్కు పత్రాలు ఇవ్వాలని సంకల్పించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.

మోడీ పర్యటన నేపథ్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన

సింగరేణి పరిశ్రమ ను ప్రయివేట్ పరం చేయాలని ఉబలాటపడుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్యలను నిరసిస్తున్నామని సాంబశివరావు తెలిపారు. ఈనెల ఎనిమిదవ తేదీన మోడీ వరంగల్ వస్తున్న సందర్భంగా ఒకరోజు ముందు ఏడవ తేదీన సింగరేణి పరిరక్షణ పేరుతో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తామని ఆయన చెప్పారు. ఈసమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవెన శంకర్, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ పాల్గొన్నారు.