బోనాలు సమర్పించి.. మొక్కులు చెల్లించి

బోనాలు సమర్పించి.. మొక్కులు చెల్లించి

రామకృష్ణాపూర్,ముద్ర : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మందమర్రి మండల జాతీయ రహదారి సమీపంలో కొలువు దీరిన బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ తల్లి ఆషాడ మాస బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. మైసమ్మ తల్లిని దర్శించుకునేందుకు బొక్కల గుట్ట పరిసర ప్రాంత భక్తులతో పాటు మంచిర్యాల,రామకృష్ణాపూర్,మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ,బొక్కల గుట్ట సర్పంచ్ బొలిశెట్టి సువర్ణ, తొమ్మిదో వార్డు కౌన్సిలర్ పారిపెళ్లి తిరుపతి,కాంగ్రెస్ పార్టీ నాయకులు,చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రాజా రమేష్ బాబు డప్పు సప్పుల నడుమ నెత్తిన బోనాలు పెట్టుకొని అమ్మవారికి సమర్పించి ధూప దీప నైవేద్యాలతో పూజించి మొక్కులు తీర్చుకున్నారు.

ఆలయ కమిటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బెల్లంపల్లి ఏసిపి పంతాటి సదయ్య నేతృత్వంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి సమక్షంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్కెపి, మందమర్రి ఎస్సై అశోక్,చంద్ర కుమార్ పోలీస్ సిబ్బంది సహకారంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బోనాల జాతరలో మంచిర్యాల డిసిపి సుధీర్ రామ్ నాథ్ కెకన్,మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు,బిజెపి జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్,చెన్నూరు నియోజవర్గ బిజెపి ఇంచార్జ్ అంధుగుల శ్రీనివాస్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల జాతర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన పోలీసులకు,పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.