బుక్ రివ్యూ

బుక్ రివ్యూ

కొవిడ్ నేపథ్యంలో పుట్టిన కవిత్వం

ప్రపంచంలో ఏ విపత్తు సంభవించినా పాలకులకంటే ముందుగా స్పందించేది కవి. కవి కావొచ్చు కవయిత్రి కావొచ్చు, ఒక విపత్తుకు సమాజం తల్లడిల్లిపోయినప్పుడు స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ గుణం ఉంటుంది. ఉండాలి కూడా. అలా స్పందించిన కవే  ‘నిజం’ కవులు, రచయితలు కొందరు వారి అసలు పేర్లతోనే రచనలు చేస్తే, కొందరు కలం పేర్లు పెట్టుకుంటారు. "నిజం"  అనేది కూడా కవి కలం పేరే. ఈయన అసలు పేరు గార శ్రీ రామమూర్తి. ఈయన కవిగా కంటే పాత్రికేయుడిగా జర్నలిజంలో చాలామందికి సుపరిచితులు. ఆయన వెలువరించిన కవితా సంపుటే "బూడిద చెట్ల పూలు". కొవిడ్ సృష్టించిన కల్లోలానికి చలించిపోయి తాను కవితలు రాశానని కవి చెప్పుకున్నారు. ఈ కవిత్వాన్ని ‘కాల్పానిక వాస్తవికత’ అని చెప్పొచ్చు. కరోనా అనేది ప్రపంచాన్ని శ్మశానంగా మారిస్తే అంటే బూడిదగా మారిస్తే అందులో పుట్టిన చెట్లకు పూసిన పూలే ఇందులోని కవితలు. అందుకే కవి ఈ పుస్తకానికి ‘బూడిద చెట్ల పూలు’ అని పేరు పెట్టారనిపిస్తుంది. ప్రధానంగా కరోనా కలిగించిన ఆవేదనను కవిత్వంగా మలచినా ఇతర ఆవేదనాభరితమైన కవితలు కూడా ఈ పుస్తకంలో చోటుచేసుకున్నాయి.

ఇందులోని సుమారు పాతిక కవితలు పూర్తిగా వచన రూపంలో ఉన్నాయి. అంటే వచన కవితలు కాదు. పూర్తిగా వచనమే. కానీ అదికూడా కవిత్వమే. సాధారణంగా కవితా సంపుటాల్లో ఇలాంటిది కనబడదు. బహుశా ఇది ప్రయోగం అనుకోవాలేమో. "నిజం" కవితలలో ఒక గాఢత ఉంది. వేదనాభరితమైన అనుభూతి ఉంది. చదవగానే అర్ధమయ్యే కవితల కావు ఇవి. నిశితంగా చదవాలి. తీవ్రంగా ఆలోచించాలి. మన మనసులను వేదనతో నింపుకోవాలి. అప్పుడే ఆ కవితల్లో ఉండే భావం మనలను ఆలోచింపచేస్తుంది. మనసులను కదిలిస్తుంది. కొన్ని కవితలలో భావ చిత్రాలు అబ్బురపరుస్తాయి. కాసేపు అక్కడే మనలను నిలబెడతాయి. ఈ పుస్తకంలో ఉన్న 90 కవితల్లో దేని ప్రత్యేకత దానిదేనని చెప్పుకోవచ్చు. పుస్తకంలోని మొదటి కవితే ఆకర్షిస్తుంది. దాని పేరు "ఏ". శీర్షికకు తగినట్లుగా మొదటి నుంచి చివరివరకు అన్ని లైన్లు ఏ అక్షరంతోనే మొదలవుతాయి.

"ఏ చెరకుగడ తెగి /ఏ గానుగకి పానకమవుతుందో /ఏ కను ధనువు /ఏ అదృశ్య మనశ్శిలలను మేల్కొల్పుతుందో" .... ఇలా సాగుతుంది ఆ కవిత. ఇలాంటి పదచిత్రాలు దాదాపు అన్ని కవితల్లో మనకు కనబడతాయి. కొన్ని కవితలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. మందుగుండు దట్టించి ఉంచిన మర ఫిరంగుల్లా ఉన్నాయి. కొన్ని కవితలు చదువుతుంటే శ్రీశ్రీ మహాప్రస్థానం గుర్తుకు వస్తూ ఉంటుంది. బహుశా శ్రీరామమూర్తి పైన మహాకవి ప్రభావం ఉండొచ్చు. ఏ కవికైనా ఆయన ప్రభావం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. "హక్కుల్నీ రెక్కల్నీ /హతమార్చేవారి /అంతిమ ఓటమి కోసం /నిప్పులల్లార్చే నేత్రాలతో పోరాడుతున్నాయి" అంటారు ఒకచోట. ఈ కవి ఆవేదనను అర్ధం చేసుకోవాలంటే స్వతహాగా కవిత్వ ప్రేమికులై ఉండాలి. కవిత్వాన్ని హృదయంతో చదవగలిగినవారై ఉండాలి. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపట్ల, పాలకులు ఆడుతున్న నాటకాలపట్ల తీవ్రమైన కోపం కలిగి ఉన్నవారై ఉండాలి. అలాంటి వారికోసమే "నిజం" ఇందులో నిజాలు రాశారు. ఒక్కో కవిత చదివాక ఆ నిజాలను ఒప్పుకొని తీరాల్సిందే. 

 -నాగేందర్ మేడేపల్లి
99851 19146