బీఆర్ఎస్ ​అలర్ట్!

బీఆర్ఎస్ ​అలర్ట్!
  • అంతర్మథనంలో బీజేపీ
  • నేతలు జారిపోకుండా పార్టీల కసరత్తు
  • జిల్లాలవారీగా అసంతృప్త నేతలపై ఫుల్ ఫోకస్
  • వారిని బుజ్జగించే బాధ్యత మంత్రులకు
  • దారికి రాని నేతలతో సంప్రదింపులు 
  • కీలక నేతల పార్టీ మార్పు ప్రచారంపై బీజేపీ అయోమయం
  • ‘ఇంటింటా బీజేపీ’కి దూరంగా ఈటల, రాజగోపాల్​రెడ్డి 
  • వలస నేతల్లో చాలా మంది గైర్హాజరే


టీ కాంగ్రెస్​లో రోజురోజుకూ పెరుగుతున్న చేరికలు బీఆర్ఎస్, బీజేపీని ఇరుకున పెడుతున్నాయి. రెండు పార్టీలోని అసంతృప్త నేతలు పక్క చూపులు చూస్తున్నారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కసారిగా ఆయోమయంలో పడ్డాయి. ఏయే నేతలు ఎప్పుడు జంప్ అవుతారో తెలియక ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటిదాకా సైలెంట్​గా ఉన్న ఈ రెండు పార్టీల నేతలు ఇప్పుడు కండువా మార్చేందుకు రహస్య చర్చలు జరుపుతున్నారు. బీఆర్ఎస్​లో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హస్తం వైపు చూస్తున్నారు. ఇటు బీజేపీలోనూ అదే పరిస్థితి నెలకొన్నది. గురువారం బీజేపీ చేపట్టిన ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమానికి కీలక నేతలు దూరంగా ఉన్నారు. ఈటల రాజేందర్, రాజగోపాల్​రెడ్డి, ఏలేటి మహేశ్వర్​రెడ్డి, విశ్వేశ్వర్​రెడ్డి, రవీందర్​రెడ్డి ప్రోగ్రామ్స్​లో ఎక్కడా కనిపించలేదు. దీంతో వీరు బీజేపీలో ఉంటారా.. లేదా? అని బీజేపీ అంతర్మథనంలో పడింది.

నేతల చూపు.. కాంగ్రెస్​వైపు

తాండూరు నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న పట్నం మహేందర్ రెడ్డికి మళ్లీ టికెట్ దక్కే అవకాశాలు ఎంత మాత్రం కనిపించడం లేదు. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్​లో కొనసాగుతున్నారు. ఆయనకు మరోసారి పోటీ చేసే అవకాశం దక్కడం ఖాయమని బీఆర్ఎస్ లో ప్రచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహేందర్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డితో జరిపిన చర్చలు కూడా సఫలం అయ్యాయని చెబుతున్నారు. అలాగే మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా గులాబీ పార్టీపై అసంతృప్తితోనే ఉన్నారు. అక్కడి నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ లో చేరి మినిస్టర్​గా కొనసాగుతున్నారు. దీంతో మహేశ్వరం నియోజకవర్గం టికెట్ ఆమెకు లేదా ఆమె కుమారుడి లభించడం ఖాయమని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తీగల కూడా పక్కచూపులు చూస్తున్నారు. అలాగే వరంగల్, కరీంనగర్​జిల్లాల నుంచి కూడా ఇలాంటి వారి జాబితా పెద్దగానే కనిపిస్తున్నది. 

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇప్పటిదాకా రాష్ట్రంలో మూడోసారి కూడా తమదే అధికారం అనే ధీమాతో ఉన్న బీఆర్ఎస్ అధిష్టానం ఒక్కసారిగా అలెర్ట్ అయింది. నేతలెవరూ పార్టీని వీడకుండా చర్యలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలవారీగా అసంతృప్తితో ఉన్న నేతలపై ఫోకస్ పెట్టింది. అసంతృప్త నేతలతో చర్చలు జరపాలని, వారంతా పార్టీ వీడకుండా చూడాలంటూ ఆయా జిల్లాల మంత్రులకు గులాబీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అప్పటికీ దారికి రాకుండా ఇతర పార్టీలవైపు చూసే నేతలను నేరుగా తన వద్దకే తీసుకరావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మంత్రులకు సూచించారని పార్టీ వర్గాల్లో టాక్. ఇటీవల వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్​పర్సన్, ఉమ్మడి మహబూబ్​నగర్​కు చెందిన జైడ్పీ చైర్​పర్సన్ ఇలా పలువురు బీఆర్ఎస్​ను వీడేందుకు సిద్ధమై, కాంగ్రెస్​లో చేరేందుకు చర్చలు జరుపుతున్నారని బీఆర్ఎస్​ అధిష్టానానికి తెలిసింది. దీంతో వారితో కేటీఆర్​మాట్లాడుతున్నారు. 

ఒక్క ఛాన్స్..!

తెలంగాణ అసెంబ్లీకి  జరగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్​నుంచి పోటీ చేసేందుకు ఒక్కో సెగ్మెంట్ నుంచి చాలా మంది ఆశావాహులున్నాయి. పార్టీ అవిర్భావం నుంచి పని చేస్తున్నవారు ఇప్పటికీ ఎదురుచూస్తుండగా, టికెట్ ఆశలతో పార్టీలోచేరిన వారు కూడా ఉన్నారు. అయితే.. పార్టీ అధిష్టానం ప్రస్తుత సిట్టింగ్​లకే మరోసారి అవకాశం ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు గులాబీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తమకు పోటీ చేసే అవకాశం దక్కదని  భావిస్తున్న నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు పార్టీని వీడారు. మరి కొందరు రేపో.. మాపో అన్నట్లుగా కనిపిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలతో రహస్య మంతనాలు కూడా సాగించినట్లుగా తెలుస్తోంది. దీంతో త్వరలోనే బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు కారు దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో ఇలాంటి నేతల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల వ్యవధి మాత్రమే ఉండగా, ఈ పరిస్థితుల్లో పార్టీ సీనియర్లు, ముందు నుంచి జెండా మోస్తున్నవారు పార్టీని వీడితే  ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందని బీఆర్ఎస్​అధిష్ఠానం భయపడుతోంది. దీంతో వెంటనే కార్యాచరణలోకి దిగింది. అసంతృప్త నేతల గురించి జిల్లా మంత్రులు, ప్రభుత్వ నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటోంది. నేతల కదిలికలపై అగ్రనేతలు ఆరా తీస్తున్నారు.  కేవలం టికెట్లు రావన్న కోణంలోనే పార్టీనీ వీడేందుకు సిద్ధమవుతున్నారా? లేక నేతల మధ్య నెలకొన్న విబేధాలతో బయటకు వెళ్లాలని చూస్తున్నారా? అనే కోణంలోనే పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. తమకు టికెట్లు వచ్చే అవకాశం లేదని ఖరాఖండిగా తెలుసుకున్న నేతలే పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. 

కాషాయంలో గుబులు

కాంగ్రెస్​లో చేరికలు.. బీజేపీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాలు, క్రమంగా పడిపోతోన్న బీజేపీ గ్రాఫ్, కీలక నేతల్లో నెలకొన్న అసంతృప్తి, విభేదాలు ఆ  పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని అంతర్మథనంలో పడేశాయి. ఇటీవల దూకుడు పెంచిన కాంగ్రెస్​ప్రధానంగా చేరికలపై ఫోకస్ చేయడం, ఇందులో బీజేపీ నుంచి కీలక నేతలు త్వరలోనే పార్టీ మారుతారనే ఊహాగానాలు.. కాషాయ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ బలోపేతం కన్నా పార్టీ నేతలు చేజారకుండా ఏం చేయాలో తోచక బీజేపీ తర్జనభర్జన పడుతున్నది. రాష్ట్రంలో అధికారం చేజిక్కుంచుకోవడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోన్న కాంగ్రెస్..​రాష్ట్రంలో ఆపరేషన్​ఆకర్శ్​ను ముమ్మరం చేసింది. బీఆర్ఎస్, బీజేపీలో అసంతృప్త నేతలను హస్తం గూటికి ఆహ్వానిస్తోంది. వివిధ కారణాలతో పార్టీ వీడిన కాంగ్రెస్​నేతలను తిరిగి చేర్చుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. కొన్ని రోజులుగా శరవేగంగా మారిన రాజకీయాలు, చోటు చేసుకుంటోన్న పరిణామాలను పరిశీలిస్తే ఆ పార్టీలో చేరికలు భారీగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. 

కాంగ్రెస్​గూటికి ఈటల, రాజగోపాల్​రెడ్డి?

నిరుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మునుగోడులో కేంద్రమంత్రి అమిత్​షా సమక్షంలో బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో ఓడిన కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డిని తిరిగి కాంగ్రెస్ లోకి రప్పించేందుకు టీ కాంగ్రెస్​నేతలు చేసిన ప్రయత్నాలు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సైతం తన తమ్ముడు రాజగోపాల్​రెడ్డి కూడా కాంగ్రెస్​లో చేరతారంటూ ప్రకటించారు. ఈ విషయంలో ఆయన తన తమ్ముడితో చర్చలు జరపడంతోపాటు ఢిల్లీ పెద్దలతో కూడా చేరిక విషయంపై సమాలోచనలు చేశారు. ఇటీవల ప్రియాంక గాంధీతో భేటీ అయిన వెంకట్ రెడ్డి.. పార్టీ వీడిన అందరితో మాట్లాడుతున్నామనీ, వారిని తిరిగి పార్టీలోకి రప్పిస్తామని క్లారిటీ ఇచ్చారు. తన చేరికపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశం లేదని గతంలో స్పష్టం చేసినా.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన మళ్లీ కాంగ్రెస్​తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాజగోపాల్​రెడ్డి కాంగ్రెస్​లో చేరితే ఆయన పోటీ చేసే స్థానం కూడా మారుతుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇటు హుజూరాబాద్ నుంచి గెలిచిన ఈటల రాజేందర్ కూడా బీజేపీలో ఇబ్బందిపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేక అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయచర్చ జరుగుతోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఈటల.. బీజేపీ పెద్దలతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న చర్చ ఉన్నప్పటికీ ఈటల కూడా పార్టీ మారే అవకాశం ఉందన్న లీక్ లు వస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీ ఓటమి, కేసీఆర్ పై పోరాడే విషయంలో ఆశించిన స్థాయిలో కదలికలు లేకపోవడం, తమ అనుచరగణం నుంచి పెరుగుతోన్న ఒత్తిడి నేపథ్యంలో రాజగోపాల్​రెడ్డితో పాటు ఈటల కూడా అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది. ఈటల ప్రస్తుతం బీజేపీ చేరికల కమిటీకి చైర్మన్​గా కొనసాగుతున్నారు. ఎన్నికలు సమీపిస్తూండడం, కాంగ్రెస్​చేరికల శంఖారావం పూరించిన నేపథ్యంలో ఈటల పార్టీ ప్రచారంలో యాక్టివ్​గా లేకపోవడం బీజేపీ శ్రేణులను గందరగోళానికి గురి చేస్తోంది. 

మహాజన్​సంపర్క్​అభియాన్’​కు దూరం..

కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి, పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలన్న బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రంలో ఆ పార్టీ చేపట్టిన ‘మహాజన్​సంపర్క్​అభియాన్’ కార్యక్రమానికి ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉండడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వారితోపాటుగా మహేశ్వర్​రెడ్డి, విశ్వేశ్వర్​రెడ్డి, రవీందర్​రెడ్డి కూడా ఎక్కడా కనిపించలేదు. అన్ని జిల్లాల్లో గురువారం చేపట్టిన కార్యక్రమంలో ఆయా పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నా ఈ నేతలు మాత్రం ఎక్కడా పాల్గొనలేదు. దీంతో పాటు వీరిద్దరు కొతకాలంగా రాజకీయంగా సైలెంట్ గా ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో పాల్గొనలేదన్న అంశంపై ఈటల రాజేందర్ వివరణ ఇచ్చారు. తాను హైదరాబాద్ నుంచి వస్తూ హుస్నాబాద్​లో కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా చెప్పుకొచ్చారు. మరోవైపు ఏలేటి మహేశ్వర్​రెడ్డి సైతం మహాజన్​సంపర్క్​కు దూరంగా ఉండడం విశేషం. నిర్మల్​కు చెందిన బీజేపీ నేతలు రెండు రోజుల కిందట  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఏలేటీ కూడా త్వరలోనే బీజేపీకి గుడ్​బై చెబుతారనే ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది. మరోవైపు తాను కాంగ్రెస్​లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను కొండా విశ్వేశ్వర్​రెడ్డి గురువారం ఖండించారు. బీజేపీలోనే ఉంటానన్న ఆయన ఇదంతా కేసీఆర్​చేస్తున్న అసత్య ప్రచారమని చెప్పారు. అలాగే 2019లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన సత్తుపల్లి కి చెందిన బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి ఉడతనేని అప్పారావు జూన్​21న బీజేపీకి గుడ్​బై చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని బండి సంజయ్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడికి పంపించినట్లు వివరించారు.