టిక్కెట్​రాకుంటే!? భయపడుతున్న అధికార ఎమ్మెల్యేలు

టిక్కెట్​రాకుంటే!? భయపడుతున్న అధికార ఎమ్మెల్యేలు
  • ప్రజల ఆదరణ కోల్పోతే బీఫామ్ ఇవ్వబోం
  • ఇప్పటికే హెచ్చరించిన అధినేత కేసీఆర్ 
  • సొంత సర్వేలలోనూ కనిపిస్తున్న వ్యతిరేకత
  • దీంతో కాంగ్రెస్​ వైపు చూస్తున్న కొందరు నేతలు
  • ఢిల్లీ పెద్దలతో రహస్యంగా మంతనాలు 
  • టిక్కెట్​ఇచ్చే అంశంపై క్లారిటీ ఇవ్వని ఏఐసీసీ​
  • ఠాక్రేతో చర్చలు పెట్టిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ
  • గతంలో కాంగ్రెస్​నుంచే వెళ్లినవారు కావడంతో పెండింగ్​


అధికార పార్టీ ఎమ్మెల్యేలకు టికెట్ భయం పట్టుకున్నది. సిట్టింగులకు టికెట్లు ఇవ్వాలని అనుకున్నా అవినీతి ఆరోపణలు, ప్రజలలో వ్యతిరేకత కారణంగా నిర్ణయం మారుతుందని సీఎం కేసీఆర్ పలుమార్లు హెచ్చరించడంతో ఎవరికి వారే అభద్రతాభావంతో వణికిపోతున్నారు. లక్షలు ఖర్చు పెట్టి సొంత సర్వేలు చేయించుకుంటున్నారు. ప్రజలలో వ్యతిరేకత కనిపిస్తుండడంతో అధికార పార్టీ నుంచి కాకుంటే విపక్ష పార్టీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్​ నేతలతో చర్చలు పెడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ తిరిగి లైమ్ లైట్ లోకి​ రావడంతో పలువురు ఎమ్మెల్యేలు హస్తం నేతలతో స్నేహం పెంచుకుంటున్నారు. ఇదే సమయంలో అటు కాంగ్రెస్​ కూడా ఆచీ తూచీ వ్యవహరిస్తున్నది. 

దందాతోనే కష్టం
బీఆర్ఎస్ కు చెందిన 104 మంది ఎమ్మెల్యేలపై ఏదో ఒక ఆరోపణ వస్తూనే ఉన్నది. ఇటీవల ఎక్కువగా వివాదాలలోకి సైతం వస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ఉంటూ రియల్ ఎస్టేట్ దందాలు, సెటిల్ మెంట్లు, ఇసుక మాఫియాతో లింకులు ఎక్కువ వ్యతిరేకతను తీసుకువస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటివారి మీదనే ప్రజలలో ఎక్కువ వ్యతిరేకత ఉన్నట్టుగా స్పష్టమవుతున్నది. వీరికి టికెట్ ఇవ్వబోమంటూ కేసీఆర్​హెచ్చరిస్తున్నారు. ఈ లింకులు, దందాలు ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. వ్యతిరేకత ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేలను వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ సమావేశాలలోనే స్పష్టమవుతున్నది. ఇప్పటికిప్పుడు ఈ దందాలకు బ్రేక్ వేసినా వ్యతిరేకత తగ్గడం కూడా కష్టమే అంటున్నారు.


ముద్ర, తెలంగాణ బ్యూరో:
వరుసగా రెండు సార్లు అధికారంలో ఉండటం, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోవటంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలలో కొంత వ్యతిరేకత పెరిగిందని, రాష్ట్రంలో కాంగ్రెస్  క్రమక్రమంగా పుంజుకుంటోందని బీఆర్ఎస్ లీడర్లు కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరు, వచ్చే ఎన్నికలలో గెలిచే అవకాశాలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా ప్రత్యేక సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నారు. కొత్తగా రెండు ఏజెన్సీలతో సర్వేలు చేయిస్తున్నారు. సిట్టింగులపై ఉన్న వ్యతిరేకతను అధిగమించేందుకు ఏం చేద్దామనే కోణంలోనూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఈ వరుస పరిణామాలన్నీ ఎమ్మెల్యేలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రజా వ్యతిరేకత ఉన్నవారి జాబితాలో తాముంటే టికెట్ కట్ అవుతుందని కొందరు ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు టికెట్​ వస్తుందా లేదో అనే అనుమానాలతో పాటుగా బీఆర్ఎస్​ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటంది? బీఆర్ఎస్ ను​ కాదని కాంగ్రెస్​లోకి వెళ్లి పోటీ చేస్తే ఎలా ఉంటుంది? అనే రెండు కోణాలలోనూ సర్వే చేయించుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా రాజకీయ వ్యూహకర్తలను నియమించుకుంటున్నారు. ఒక్కో బృందంలో 10 నుంచి 20 మంది వరకు ఆయా నేతలకు వ్యూహకర్తలుగా పని చేస్తున్నారు. ఇటీవల నియోజకవర్గాలలో ఈ సర్వేలు పెరిగిపోయాయి. నియోజకవర్గంలో తమ గ్రాఫ్ ఎలా ఉందో తెలుసుకుంటూనే తమ పని తీరు ఎలా ఉంది? సొంత పార్టీలో టికెట్ ఆశిస్తున్న వాళ్లు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్లపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది? అనే వివరాలు సేకరిస్తున్నారు. ఈసారి అధికార పార్టీ నుంచి టికెట్​ రాకున్నా కాంగ్రెస్​ నుంచి పోటీకి దిగేందుకు ప్రయార్టీ ఇస్తున్నారు. ఏదో ఒక యాక్టివిటీతో నిత్యం ప్రజల మధ్యే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాంగ్రెస్ తో​టచ్​లోకి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ
గతంలో కాంగ్రెస్​ నుంచి గెలిచి బీఆర్ఎస్​లో చేరి, ఇప్పుడు తమ నియోజకవర్గాలలో వ్యతిరేకతను మూటగట్టుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్​లో చేరుతామని ఏఐసీసీ నేతలతో పాటుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్​ ఠాక్రేతో చర్చలు పెట్టినట్లు పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. తాము పార్టీలో చేరుతామని, టికెట్ కన్ఫర్మ్​ చేయాలని అడుగుతుండటంతో, వారిని తిరిగి తీసుకునే అంశంపై ఆలోచిస్తున్నారు. ఏపీకి చెందిన ఓ ప్రముఖ నేతతో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్​పెద్దలకు రాయబారం పంపించారు. మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మరో నేత కూడా కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనకు టికెట్​ ఇచ్చేందుకు గులాబీ అధిష్టానం నుంచి ఎలాంటి రిప్లై లేకపోవడంతో కాంగ్రెస్​ కండువా కప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీలో చేరేందుకు గతంలో చర్చలు పెట్టినా, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్​వైపు చూస్తున్నారు. వీరిని చేర్చుకునేందుకు సిద్ధమే అన్నట్లు చెప్తున్న కాంగ్రెస్​ నేతలు మాత్రం.. టికెట్​ ఖరారు అనే అంశంలోనే హామీ ఇవ్వలేకపోతున్నారు.