గేమ్ ఛేంజ్

గేమ్ ఛేంజ్

స్టేట్ అండ్ సెంటర్
రెండింటి మీదా బీఆర్ఎస్ గురి

వచ్చే ఎన్నికలకు కేసీఆర్ ప్లాన్ 
ఇప్పటికే క్షేత్రస్థాయిలో అమలు
ఇక్కడ యువ నేత.. అక్కడ అధినేత
రాష్ట్రం కలియదిరుగుతున్న కేటీఆర్
జాతీయ రాజకీయాల మీద కేసీఆర్ నజర్
ఇంకా అయోమయంలోనే విపక్షాలు
ప్రియమైన శత్రువుగా మారిన ‘కమలం’
కీలక సమయంలో కాంగ్రెస్ పైనా ప్రేమ
వామపక్షాలతో కుదిరిన దోస్తీ
అంతు చిక్కని గులాబీ బాస్ వ్యూహాలు   

వచ్చే ఎన్నికలకు కేసీఆర్​ వ్యూహరచనలు మొదలయ్యాయి. జాతీయ రాజకీయాలలో కీలకంగా మారేందుకు ప్రయత్నాలు చేస్తూనే, సొంత రాష్ట్రంలో మూడోసారి పాగా వేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉంటేనే జాతీయస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉంటుందని కేసీఆర్​అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో విస్తృత పర్యటనలకు కేటీఆర్ ను రంగంలోకి దింపారు. అసలు సమయంలో కేసీౠర్ కూడా రంగంలోకి దిగే చాన్స్​ ఉంది. కొంతకాలం నుంచి బీజేపీని ప్రధాన శత్రువుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నా, విపక్షాలు మాత్రం ‘ఆ ఇద్దరూ ఒక్కటే’ అనే ప్రచారానికి దిగుతున్నాయి. దీని నుంచి బయట పడేందుకు ఇటీవల కాలంలో కాంగ్రెస్ మీద అనుకూల వ్యాఖ్యలు చేశారు. 

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్​అధినేత కేసీఆర్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఎప్పుడూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండే వామపక్షాలను తమవైపు తిప్పుకున్నారు. ఇది కాంగ్రెస్ కు ఒకింత ఇబ్బందికర పరిణామమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీతో ఎవరూ పొత్తు పెట్టుకోకుండా కూడా కేసీఆర్​ ప్లాన్​ చేశారనే టాక్​ కూడా వినిపిస్తున్నది. దీంతో రాష్ట్రంలో వచ్చే ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. వామపక్షాలతో బీఆర్ఎస్, ఎవరైనా కలిసి వస్తే వారితో కాంగ్రెస్, ఒంటరిగా బీజేపీ బరిలోకి దిగనున్నాయి. 

స్పీడ్​ పెంచిన కేటీఆర్​
బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా కేసీఆర్ ఇతర రాష్ట్రాలపై కన్నేశారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలలో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి నేతలను సమీకరిస్తున్నారు. ఏపీలోనూ పార్టీ విస్తరణపై ఫోకస్​ పెట్టారు. కర్ణాటకలో ఏకంగా జేడీఎస్ తో పొత్తుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంపై పట్టు తగ్గించారనే విమర్శలు రాకుండా ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ను రంగంలోకి దింపారు. మొన్నటి వరకు బీఆర్ఎస్​పార్టీ అధ్యక్ష పదవి కోసం కేటీఆర్​ అలిగారని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే ప్రచారానికి బ్రేక్​ వేస్తూ ఇటీవల జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. కేసీఆర్​ తరహాలోనే, స్థానిక నాయకత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూనే విపక్షాలపై గురి పెట్టారు. దీంతో వచ్చే ఎన్నికల సీన్ లోకి కేటీఆర్​ వచ్చినట్లుగా భావిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ తరుపున కార్యక్రమాలు, ఎలాంటి అంశాలనైనా కేటీఆర్​ ప్రకటిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో బీఆర్​ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతికి ఇచ్చినట్లేననే సంకేతాలపై స్పష్టత వస్తున్నది. 

తెలంగాణ రాజకీయమే
రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకుంటున్న బీజేపీ, యూపీ తరహా ప్లాన్​అమలులో పెడతామని లీకులిస్తున్నది. కేసీఆర్ మాత్రం తెలంగాణలో తెలంగాణ తరహా రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల మునుగోడులో చేసిన ప్లాన్​వర్కౌట్​ అయింది. సొంత సీటును కాపాడుకోవడంలో కాంగ్రెస్​, పార్టీ మారి, తామే గెలుస్తామనే ధీమాతో ఉన్న బీజేపీకి షాక్​ ఇచ్చారు. తెలంగాణ పొలిటికల్​ ప్లాన్​లో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికను వేదికగా చేసుకున్నారు. వామపక్షాల ఓటు బ్యాంకు తమకు కలిసి వస్తే వచ్చే ఎన్నికలలో అటు కాంగ్రెస్​, ఇటు  బీజేపీని ఓడించేందుకు రాజకీయంగా మరింత శక్తి వస్తుందని కేసీఆర్​వేసిన ప్లాన్​సక్సెస్​ అయింది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రంగంలోకి దిగిన కేసీఆర్, వామపక్షాలను తనవైపు తిప్పుకోవడంలో విజయం సాధించారు. వాస్తవానికి కేంద్రంలో, రాష్ట్రంలో గతంలో అధికార పార్టీకి అండగా ఉండేందుకు వామపక్షాలు అంతగా ఆసక్తి చూపించేవి కావు. ఈసారి మాత్రం బీజేపీని దెబ్బకొట్టడమే లక్ష్యం అంటూ కేసీఆర్​ చేతికి చిక్కారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ బలంగా ఉండటం, దీనికితోడు తెలంగాణలో అధికార పార్టీ కూడా కావడంతో వామపక్షాలు బీఆర్ఎస్  వైపు మొగ్గు చూపాయి. ఇది కొంతమేరకు బీఆర్ఎస్​కు కలిసి వచ్చింది. 

మారిన పంథా
రాష్ట్ర రాజకీయాలలో, కేసీఆర్ లో అనూహ్య పరివర్తన తీసుకురావడానికి హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికలు ప్రధాన భూమిక పోషించాయి. ఈ రెండు ఉప ఎన్నికల తర్వాత మిగతా పార్టీల స్పందన ఎలా ఉన్నా అధికార బీఆర్ఎస్ స్వరం మాత్రం పూర్తిగా మారిపోయింది. సంక్షేమ పథకాల ప్రకటనలు గెలుపును ప్రభావితం చేయలేవని తుది నిర్ణయానికి వచ్చిన సీఎం రాజకీయాలలో స్ట్రాటజీ మార్చారు. తన రాజకీయ వ్యూహంలో బీజేపీని ఒక టూల్ కిట్ గా ఫిక్స్ చేసుకున్నారనే ప్రచారం కూడా గతంలోనూ జరిగింది. వాస్తవానికి ఎనిమిదేండ్ల పాలన తర్వాత రాష్ట్రంలో కేసీఆర్​ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పట్ల జనం విసిగెత్తిపోయారు. కేసీఆర్​ క్రెడిబిలిటీ కూడా పాతాళానికి పడిపోయింది. హామీలు ఇవ్వడమే తప్ప ఏం చేయడం లేదనే అభిప్రాయం జనసామాన్యంలో సర్వత్రా వినిపిస్తోంది. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేకత సహజమే. దీనికి తోడుగా బీఆర్ఎస్​ నేతలు, అగ్రనేతల వ్యవహార శైలి కూడా తోడై ఈసారి కేసీఆర్​ టీంకు ఓటమి ఖాయం అన్న టాక్ క్రమంగా ఊపందుకుంటోంది. సర్వేల మీద సర్వేలు చేయించుకుని ప్రజల నాడిని ఎప్పటి కప్పుడు అంచనా వేసుకునే కేసీఆర్ కు కూడా దీనిపై స్పష్టత వచ్చింది. తనకు తాను బ్రహ్మాండమైన వ్యూహకర్తగా భావించే కేసీఆర్ తొలిసారి ప్రొఫెషనల్ స్ట్రాటజిస్టులపై ఆధారపడ్డారు. తన శక్తి సరిపోదని భావించి అద్దె వ్యూహకర్తలను తెచ్చుకున్నారు. మొదట సునీల్ ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ కు రెడ్ కార్పెట్ పరిచారు. ప్రస్తుతం ఒక్కసారిగా స్ట్రాటజీ మార్చారు. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ కొత్త ప్రయోగశాలగా బీజేపి మారిందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. 

విపక్షాలకు అందని వ్యూహాలు
ఎన్నికల సమయంలో కేసీఆర్​ను అంచనా వేయలేని విపక్షాలు ఈసారి కూడా అదే అయోమయంలో ఉన్నాయి. ఇప్పటి నుంచే కేసీఆర్​ స్వయంగా రంగంలోకి దిగితే, ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తుందని, దీంతో విపక్షాలుకూడా అదేస్థాలో స్పీడ్ పెంచుతాయని భావించిన అధినేత ముందుగానే కేటీఆర్​ను రంగంలోకి దింపారు. ప్రగతిభవన్​ వేదికగా జాతీయ రాజకీయాలలో బీజీ ఉన్నట్లుగా చూపిస్తూనే, రాష్ట్ర రాజకీయ తెరపైకి కేటీఆర్​ను ముందుకు తెచ్చారు. కీలక సమయంలో కేసీఆర్​ రంగంలోకి దిగుతారని పార్టీ  వర్గాలు భావిస్తున్నాయి.