ర్యాలీతో కదనరంగంలోకి దూకిన బీఆర్ఎస్ 

ర్యాలీతో కదనరంగంలోకి దూకిన బీఆర్ఎస్ 
  • రసవత్తరంగా మంథని రాజకీయాలు

మహాదేవపూర్, ముద్ర: మంథనిలో టిఆర్ఎస్ పార్టీ టికెట్ పుట్ట మధుకు దక్కటంతో మంథని రాజకీయం రగులుకుంటున్నది. ఇటీవల కొన్ని నెలలుగా పుట్ట మధుకు టికెట్ రాదనే ప్రచారం నియోజకవర్గంలో ఊపందుకోవటంతో కాంగ్రెస్ నాయకులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. కెసిఆర్ పాత కాపులకి టికెట్లు ఇవ్వడంతో రాజకీయంగా కదనోత్సాహంతో ఉన్న పుట్ట మధు నేడు మంథని నియోజకవర్గంలో భారీ ర్యాలీ తలపెట్టాడు. అన్ని మండలాల నుండి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు ఈ ర్యాలీకి తరలి వెళ్లారు. ఇన్ని రోజులు సంశయంలో కొట్టుమిట్టాడిన బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. బి ఆర్ ఎస్ టికెట్టు ఆశించిన చల్లనారాయణరెడ్డి తాను రాజకీయంగా ఎలాంటి అడుగు వేస్తాడోనని పలువురు కొద్ది రోజులలో తన భవిష్యత్తు ప్రణాళికను వెల్లడిస్తానని నారాయణరెడ్డి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. శ్రీధర్ బాబు, చల్లా నారాయణరెడ్డిలు ఇద్దరు కాటారం మండలానికి, ఓకే ఊరివారైనందున చల్ల నారాయణరెడ్డి దారి ఎటువైపు ఉంటుందని ఆసక్తిగా గమనిస్తున్నారు.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా మంథని నియోజకవర్గంలో తిరుగులేని నాయకునిగా వెలుగొందుతున్న శ్రీధర్ బాబు పుట్ట మధును ఢీకొట్టేందుకు సిద్ధం కావలసిన పరిస్థితు లు ఏర్పడినాయి. 2014లో మంథని నియోజకవర్గంలో తిరుగు లేని నాయకుడిగా ఉన్న శ్రీధర్ బాబు పుట్టమధు చేతిలో పరాజయం పాలయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన పుట్ట మధు కాంగ్రెస్ పార్టీ లోని అనేకమంది నాయకులను తన పార్టీలో చేర్చుకున్నాడు.  మంథనిలో  శ్రీధర్ బాబుకు ధీటైన నాయకునిగా పుట్ట మధు పేరు సంపాదించుకున్నారు. గత 40 సంవత్సరాలుగా శ్రీపాదరావు, శ్రీధర్ బాబులు సుధీర్గ కాలం మంథని ఎమ్మెల్యేగా గెలుస్తుండటంతో వీరికి చెక్కుచెదరని అభిమానుల బలం ఉంది. శ్రీధర్ బాబు వద్ద ముఖ్యమైన నాయకులుగా వెలుగొందిన అనేకమంది నేతలు పార్టీ ఫిరాయించి టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అయినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికలలో శ్రీధర్ బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి సునాయాసంగా గెలుపును అందుకున్నారు. కంగుతిన్న టిఆర్ఎస్ నాయకత్వం ఎన్నికలలో డబ్బును పంచకపోవడం వల్లనే ఓడిపోయామాని భావిస్తున్నారు.

ప్రస్తుతం రాబోయే ఎన్నికలలో శ్రీధర్ బాబు వ్యూహాలను తిప్పికొట్టే దిశలో పుట్ట మధు చాకచక్యంగా వ్యవహరిస్తాడని పలువురు భావిస్తున్నారు. సాంప్రదాయ ఓట్ల బలానికి తోడు రాజకీయవ్యూహాలు పన్నడంలో శ్రీధర్ బాబు సిద్ధహస్తులని పేరుంది. నిత్యం శ్రీధర్ బాబు ఎలాంటి ఆర్భాటం లేకుండా పల్లె గ్రామాలలో ప్రచారం సాగిస్తున్నారు. అంగ బలం, అర్థబలం గలిగిన ఇద్దరు నాయకులు ఎన్నికలలో ఢీకొనే పరిస్థితి ఎదురవటంతో ఎక్కడ చూసినా రాజకీయాలే చర్చించుకుంటున్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలలోకి చర్చుకొని పోతుండగా బిజెపి అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి కార్యకర్తలను కూడగట్టుకునే పనిలో పడ్డారు. రాధిక చర్చలలో బిజెపికి స్థానం లేకుండా పోయింది. కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు తమ బలాబలాలను ప్రదర్శించేందుకు సిద్ధమవుతుండడంతో మంథని నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.