- సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జనార్ధన్ పిలుపు ….
ఆలేరు. ముద్ర.. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 20న సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో హైదరాబాదులో తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్ధన్ ప్రజలను కోరారు. శనివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను ఆయన పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయిన ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప (ఉచిత బస్సు ప్రయాణం కూడా సరైన బస్సు సౌకర్యం లేకl మహిళలకు తప్పని ఇబ్బందులు పడుతుంటే సరైన సౌకర్యాలు కల్పించాల్సిన పాలకులు గుడ్లప్పగించి చూడడమే కాకుండా ఉన్న బస్సులను తగ్గించారు). రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లాంటి పథకాలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలకు అమలు చేయకుండా పైలెట్ గ్రామాలను ఎంపిక చేసి మండలానికి ఒక గ్రామాలలో అరకురా పథకాలను ప్రకటించడమే తప్ప పూర్తిస్థాయిలో అమలు చేయడంలో పూర్తిగా వైపల్యం చెంది, స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ది పొందడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మెజార్టీ హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయలేక ప్రజలలో బలహీన పడిందని అన్నారు. గత పది సంవత్సరాల బిఆర్ఎస్ (కెసిఆర్) ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్, దళితులకు మూడెకరాల భూమి, ఉద్యోగాలు, కేజీ టు పీజీ ఉచిత విద్య, రేషన్ కార్డులు, లక్ష లోపు రుణమాఫీ ఇతర హామీలను అమలు చేయక పోగా పూర్తిగా ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేయడంతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారని చెప్పారు. కానీ ప్రజలు ఆశించిన పాలన చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వ తరహాలోనే పరిపాలనను తూచా తప్పకుండా అమలు చేస్తుందని ఆరోపించారు.
గత ప్రభుత్వ విధానాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుందని తెలిపారు. వెంటనే గత శాసనసభ ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటిని తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలో ఎండగడుతూ, పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మామిడాల బిక్షపతి, సిపిఐఎంఎల్ సీనియర్ నాయకులు కర్రె పాండరీ, డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు కళ్లెపు అడివయ్య, టంగుటూరు మాజీ సర్పంచ్ కట్ట సమరసింహారెడ్డి, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్, కార్యదర్శి గడ్డం నాగరాజు, ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు చీరబోయిన రాజయ్య, నాయకులు మామిడాల బాల మల్లేష్, బర్మ బాబు, పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు మారుజోడు సిద్దేశ్వర్, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు తమ్మడి అంజయ్య, నాయకులు తలారి వెంకటేష్, బుడిగే లక్ష్మయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు….