వరద బాధితులకు చైర్మన్ క్షమాపణలు చెప్పాలి - కాంగ్రెస్ నేతల డిమాండ్

వరద బాధితులకు చైర్మన్ క్షమాపణలు చెప్పాలి - కాంగ్రెస్ నేతల డిమాండ్

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల లో వరద ముంపు బాధితుల పట్ల అగౌరవ వ్యాఖ్యలు చేసిన మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, మాజీ కౌన్సిలర్ పూదరి ప్రభాకర్ మాట్లాడారు. వరద బాధితుల సమస్యలపై చర్చ అక్కరలేదని చైర్మన్ చెప్పడం శోచనీయమన్నారు. వరద బాధితులకు న్యాయం చేయాల్సిన చైర్మన్ చర్చ అవసరం లేదని నిర్లక్ష్యంగా జవాబివ్వడం తగదని అన్నారు. ఎమ్మెల్యే, చైర్మన్ అవగాహన రాహిత్యం వల్ల అభివృద్ధి కి నోచుకోవడం లేదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, మున్సిపల్ జనరల్ ఫండ్ తో అరకొర అభివృద్ధి జరిగింది తప్ప ప్రత్యేక నిధులు నయాపైసా రాలేదని తెలిపారు. చేపట్టిన అభివృద్ధి పనులు ప్రణాళిక లేక అసంతృప్తి గా మారాయని అన్నారు. ప్రధాన చౌరస్తాలలో సర్కిల్ , మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయని విమర్శించారు. మంచిర్యాల లో రెండవ ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోరితే అండర్ బ్రిడ్జి నిర్మించారని ఆరోపించారు. అది కూడా చిన్న వర్షంకే  నీరు నిలిచి రాకపోకలు నిలిచిపోతున్నాయని తెలిపారు.