రాజమండ్రి జైలుకు బాబు

14 రోజుల సీఐడీ జ్యుడీషియల్ కస్టడి
ఆర్ధిక నేరాలకు పాల్పడినట్లు నిర్ధారణ
ముద్ర,తెలంగాణ బ్యూరో : స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులు ఆరోపణలు ఎదుర్కొంటొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదివారం రాత్రి తీర్పు ఇచ్చింది. ఈ నెల 22వ తేది వరకు సీఐడీ జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించింది. కోర్టు అనుమతితో సీఐడీ పోలీసులు చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. ఎలాంటి ప్రాజెక్టు రిపోర్ట్ లేకుండానే సీమెన్స్ ఇచ్చిన డీపీఆర్ ఆధారంగా రూ. 3.281 కోట్ల బడ్జెట్ ను కేబినెట్ ముందు ఉంచిన చంద్రబాబు 90శాతం ఖర్చు సీమెన్స్ భరిస్తుందని కేబినెట్ కు అబద్దాలు చెప్పారన్న సీఐడీ వాదనాలతో ఏకీభవించింది.
ఎలాంటి పర్ ఫామెన్స్ గ్యారెంట్, బ్యాంకు గ్యారంటీలు లేకుండానే ప్రభుత్వం రూ. 371 కోట్లను డిజైన్ టెక్ కు ఇచ్చినట్లు నిర్ధారణకు వచ్చింది. నిధులు విడుదల చేసే సమయంలోనూ డిజైన్ టెక్ సరఫరా చేసే మిషన్ల నాణ్యతను పరీక్షించాలని ఆర్ధికశాఖ కార్యదర్శి సునిత నోట్ ఫైల్ లో రాశారనీ అయినా చంద్రబాబు ఆదేశాలతో పలు షెల్ కంపెనీల ద్వారా డిజైన్ టెక్ కంపెనీ రూ. 279 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిందని గుర్తించింది. దీంతో గత రెండ్రోజులుగా నరాలు తెగే ఉత్కంఠకు తెరపడినట్లయింది.