చిన్నారిని పొట్టన పెట్టుకున్న మధ్యాహ్న భోజనం

చిన్నారిని పొట్టన పెట్టుకున్న మధ్యాహ్న భోజనం
  • కొరిటికల్ పాఠశాలలో ఘటన
  • రాగి జావలో పడి తీవ్ర గాయాలు
  • చికిత్స పొందుతూ మృతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన మధ్యాహ్న భోజన పథకం చిన్నారిని బలిగొంది. నిర్మల్ జిల్లా మామడ మండలం కొరటికల్ ప్రాథమిక పాఠశాలలో శనివారం రాగిజావలో పడి గాయపడ్డ ప్రజ్ఞ (6) నిజామాబాద్ లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా మామిడి మండలం కొరటికల్ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న కొండ్ర ప్రజ్ఞ (6)  వండుతున్న రాగిజావ గిన్నెలో ప్రమాదవశాత్తు పడి తీవ్రంగా గాయపడింది. కాగా గత వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న ప్రజ్ఞ శనివారమే పాఠశాలకు వచ్చింది.

శనివారం పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజ్ఞ తల్లి శిరీష ఉప సర్పంచ్ కావడంతో సమావేశానికి వచ్చింది. తల్లితోపాటు ప్రజ్ఞ కూడా పాఠశాలకు వచ్చింది. ఇదిలా ఉండగా పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటరమణారెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ సెలవులో ఉన్నారు. దీంతో సీనియర్ ఉపాధ్యాయుని రమ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఒక పక్క పాఠశాల పేరెంట్స్ కమిటీ సమావేశం జరుగుతుండడంతో మిగతా ఉపాధ్యాయులు అంతా సమావేశంలో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఇంటర్వల్ కోసం వచ్చిన చిన్నారులు మధ్యాహ్న భోజన పథకం వైపు వెళ్లారు. ఈ క్రమంలో రాగిజావ వండుతున్న గిన్నెలో ప్రజ్ఞ పడిపోయి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఉపాధ్యాయులు ఆమెను హుటాహుటిన నిర్మల్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన సౌకర్యాల కోసం హైదరాబాద్ తరలించాల్సిందిగా డాక్టర్ సూచించడంతో ఆవిడ నిజామాబాద్ కు తరలించారు. అక్కడ ప్రమాదం  లేదని వైద్యులు  చెప్పడంతో  తల్లిదండ్రులు ఊరట చెందారు. అయితే పరిస్థితి విషమించి ప్రజ్ఞ అర్ధరాత్రి మృతి చెందడంతో తల్లిదండ్రులు అశోక్, శిరీష రోదనలు మిన్నంటాయి.

బాధ్యులెవరు

కాగా ఈ ఘటనలో బాధ్యులెవరన్నది తేలాల్సి ఉంది. పాఠశాల నడిచే సమయంలో పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించాలన్న ప్రభుత్వానిదా లేక సమావేశంలో బిజీ గా ఉన్న సిబ్బందిదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకే సారి పలు పనులు అప్పగించటం, పాఠశాల నడుస్తుండగా సమావేశాలను ఏర్పాటు చేయటం కూడా కారణాలుగా చెప్పవచ్చు. ఏది ఏమైనా చదువులో చురుగ్గా ఉండే ప్రజ్ఞ నిండు నూరేళ్ళ జీవితం అర్ధాంతరంగా ముగిసింది.