సూర్యాపేట కాంగ్రెస్ లో భగ్గుమంటున్న వర్గ పోరు

సూర్యాపేట కాంగ్రెస్ లో భగ్గుమంటున్న  వర్గ పోరు
  • ఢీ అంటే డీ అంటున్న దామోదర్ రెడ్డి రమేష్ రెడ్డి వర్గాలు
  • బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ లో ఇరువర్గాల తోపులాటలు

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:-గత కొన్నేళ్లుగా సూర్యాపేట కాంగ్రెస్లో నివురు గప్పిన నిప్పులా రాజుకుంటున్న వర్గ పోరు  బగ్గు మంటుంది. చాలాకాలంగా రాజుకుంటున్న రాజకీయ వేడి బహిర్గతం అవుతుంది. సూర్యాపేట కాంగ్రెస్ లో మాజీ మంత్రి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గ్రూపులుగా చీలిపోయి అనేక సందర్భాల్లో వివాదాస్పదమవుతుంది. తాజాగా శనివారం రాత్రి సూర్యాపేట జిల్లాలో ప్రవేశించిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర పీపుల్స్ మార్చుకు స్వాగతం పలికే విషయంలో ఇరువర్గాలు తోపులాటలు నెట్టేసుకోవడం కార్యకర్తలు ఒకరిపై ఒకరు చెయ్యి చేసుకోవడం వరకు వెళ్లి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

ప్రజా సమస్యలు తెలుసుకుంటారా బల ప్రదర్శన చేసుకుంటారా

సీఎల్పీ నేత భట్టివిక్రమార్క  ప్రజా సమస్యలు తెలుసుకోవాలని చేపట్టిన పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటారా,ఎవరి బలం ఎంత అనే ధోరణిలో బల ప్రదర్శన చేసుకుంటారా అన్న మీ మాంస, సందిగ్ధ పరిస్థితులు సూర్యాపేట ప్రజల్లో నెలకొన్నాయి. సూర్యాపేట కాంగ్రెస్ లో వర్గ పోరు బల ప్రదర్శనలు ఒకరిపై ఒకరు పెట్టడం చేసుకోవడం  ఒకరిని ఒకరు విమర్శించడం తప్ప పాదయాత్ర లక్ష్యం వర్గ పోరు వలన నెరవేరేలా లేదని పాదయాత్రలో పాల్గొన్న పలువురు వ్యాఖ్యానిస్తున్నారు మేధావులు  ప్రజాసమస్యలు తెలుసుకొని వాటిని కాంగ్రెస్ ఎజెండాలో తమ అభిప్రాయం చెప్పాలని  విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సూర్యాపేటలో వర్గ పోరుతో తల పట్టుకోవాల్సి వస్తుందనే విమర్శలు వినవస్తున్నాయి. ప్రజా సమస్యలను తెలుసుకోకుండా కాంగ్రెస్ వర్గ పోరు సమస్యల తెలుసుకోవాల్సి వస్తుందని పలువురుఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 101 రోజు పాదయాత్ర కేతేపల్లి మండలంలో ముగించుకొని సూర్యాపేట మండలంలోని వెదిరే వారిగూడెం శనివారం రాత్రి చేరుకుంది. ఒక వర్గానికి చెందిన నాయకులు గజమాలవేసి ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత కొనసాగిన పాదయాత్ర కుసుమవారిగూడెంకు చేరుకుంది. మరో వర్గం పాదయాత్రకు స్వాగతం పలకడానికి అక్కడికి చేరుకున్నారు. రాత్రి 9:30 సమయం మధ్యలో రెండు వర్గాల నాయకుల మధ్య కుమ్ములాట జరిగింది. ఒక వర్గం పూలమాల వేయాలని ప్రయత్నం చేస్తుండగా, మరో వర్గం పూలమాల వేయవద్దని  చిందర వందరం చేశారు. రెండు వర్గాల మధ్య జరిగిన వాదనలు విన్న బట్టి విక్రమార్క ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రజా సమస్యలు వినాలా కాంగ్రెస్ నాయకుల సమస్యలు వినాలా అనే ఆవేదన చెందినట్లు సమాచారం. ఆదివారం సూర్యాపేటలో జరిగే పాదయాత్రకు సైతం వర్గ పోరు ఆటంకం ఏర్పడే సందేహం నెలకొంది.

కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో ఒక విధంగా సూర్యాపేటలో అందుకు భిన్నంగా

పార్టీలో అసమ్మతి లేకుండా నాయకులను కార్యకర్తలను కలుపుకొని పోయి ఇతర పార్టీల నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని పార్టీని పటిష్ట స్థితికి తీసుకువచ్చి అధికారం దక్కించుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తుండగా అందుకు భిన్నంగా సూర్యాపేట కాంగ్రెస్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకా వర్గ పోరుతో కూనారిల్లుతుంది అన్న అభిప్రాయాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేక గాలివీస్తూ కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీ స్తున్న తరుణంలో నాయకుల మధ్య విభేదాలు పార్టీలో ఐక్యతను దెబ్బతీసి పార్టీ పట్ల ప్రజల్లో ఒక రకమైన  ఏవగింపు చులకనతనం అసహ్యం వేసే పరిస్థితులు నాయకులు చేజేతులా వర్గపోరుతో తెచ్చుకుంటున్నారని పార్టీ ప్రముఖులే పేర్కొనడం సామాన్యులు సైతం వ్యాఖ్యానించడం గమనించదగ్గ విషయం.ఇప్పుడు ఇప్పుడే సూర్యాపేట లో కాంగ్రెస్ పుంజుకుంటున్న సమయంలో రెండు వర్గాల మధ్య జరిగే పోరు ఎటు దారి తీస్తుందోనని కాంగ్రెస్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు.

వర్గ పోరుకు చరమగీతం పాడాలి
పార్టీ విజయం కోసం కృషి చేయాలి అందుకు అధిష్టానం వెంటనే స్పందించాలి

ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వం సూర్యాపేట కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించి వర్గ పోరుకు పులిస్టాప్ పెట్టాలని పార్టీ తరఫున అభ్యర్థిగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిని నిర్ణయించినా వారి గెలుపుకు ఐక్యతతో అందరూ కృషి చేయాలని సూర్యాపేట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు. అధిష్టానం జోక్యం చేసుకొని ఎవరికో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించి పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు, పార్టీ నిర్ణయించిన అభ్యర్థి విజయం కోసం కాంగ్రెస్ శ్రేణులన్నీ వర్గ రహితంగా శ్రమించాలని కాంగ్రెస్ అభిమానులు, పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.