ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై జగన్ స్పందించాలి

ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై జగన్ స్పందించాలి

వైసీపీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి గట్టిగా మాట్లాడినప్పుడు.. దానిని వైసీపీ పెద్దలు రాజకీయ కోణంలో చూసి తనపై నిఘా పెట్టారని ఆరోపించారు. తనను అనుమానించిన చోట ఉండకూడదని భావించి వైసీపీకి దూరంగా జరిగాననని చెప్పారు. ఈ విషయాన్ని బహిరంగంగానే తెలియచేశానని తెలిపారు. తాను పార్టీకి దూరంగా  జరిగినప్పుడు సస్పెండ్ చేయడయమనేది సమర్థనీయం కాదన్నారు.   సస్పెండ్ చేసిన విధానం సరైనది కాదని తెలిపారు. 

ఒక సభ్యుడిని సస్పెండ్ చేయాలంటే.. ముందు షోకాజ్ ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత  సస్పెండ్ చేయాలని కోటంరెడ్డి అన్నారు. ఈ మేరకు నిబంధనలు ఉన్నాయని చెప్పారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేసేందుకు వైసీపీ పార్టీకి ప్రత్యేకంగా ఏమైనా నిబంధనలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. అయితే సస్పెన్షన్‌తో తనకు వచ్చే నష్టమేమి లేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై మరింత గట్టిగా  మాట్లాడే అవకాశం తనకు వచ్చిందని చెప్పారు.   వచ్చే ఎన్నికల్లో వైసీపీని రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా డిస్మిస్ చేస్తారని అన్నారు. వేరే పార్టీలో చేరే  అంశంపై స్పందించిన కోటంరెడ్డి.. రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన సమయంలో నిర్ణయం తీసుకుంటానని  చెప్పారు. టీడీపీ నుంచి డబ్బు తీసుకున్నారన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు సరికాదని అన్నారు. వైసీపీకి మద్దతిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలకు వారు ఎంత ఇచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.