పొత్తుపెట్టుకుంటే కాంగ్రెస్ మాట తప్పింది: సీఎం కేసీఆర్

- బీఆర్ఎస్ ను ఓడగొట్టుకుంటే గోస పడతారు
- తెలంగాణ ప్రజల బాగుకోసం పుట్టింది బీఆర్ఎస్
- కాంగ్రెస్ కు ఓటేస్తే కరెంటు కాట కలుస్తది
- చెప్పుడు మాటలు విని ఓటేయ్యొద్దు
- ఆలోచించి అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కు వెయ్యాలి
- నల్గొండ, నకిరేకల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
ముద్ర ప్రతినిధి, నల్గొండ : కాంగ్రెస్ పార్టీ తాము గెలిస్తే తెలంగాణ ఇస్తమని 2004లో టీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకుంటే ఆ తర్వాత గెలిచి ఇచ్చిన మాట తప్పిందని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టిందన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల బాగుకోసం పుట్టిందని తెలిపారు. 15యేళ్లు ఉద్యమం చేసి తెలంగాణను సాధించిందన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ఇస్తమని చెప్పి ఎన్నికల్లో గెలిచినంక మాట తప్పిందని మండిపడ్డారు.. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని గట్టిగ కొట్లాడినంక ఆఖరికి దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆగమాగం కావొద్దని, ఎవరో చెప్పిన మాటలు పట్టుకుని ఓట్లు వేయొద్దని, ఆచితూచి, బాగా ఆలోచించి ఓట్లు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. అభివృద్ధిని చూసి ఓటేయ్యాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. నల్గొండ మహనీయులు పుట్టిన జిల్లా అని కొనియాడారు. ఉద్యమాలు చేసిన గడ్డ అని, బాగా చైతన్యం ఉండే ప్రాంతమని తన విశ్వాసనియాతను వెల్లడించారు. ‘ఎన్నికలు వస్తుంటయ్.. పోతుంటయ్. ఎన్నికలు రాగానే గడబిడ గావద్దు.
ఎవరో చెప్పింది నమ్మి ఓటేయొద్దు. బాగా ఆలోచించి ఓటేయాలె. అందుకు కావాల్సిన ప్రజాస్వామ్య పరణతి మనలో రావాలె. మీరు ఆషామాషీగా ఓటేస్తే గెలువాల్సిన వాళ్లు కాకుండా ఇతరులు గెలుస్తరు. అప్పుడు వాళ్ల పాలన బాగున్నా లేకున్నా ఐదేండ్లు భరించాలె. కాబట్టి ఓటేసేటప్పుడు అభ్యర్థుల గుణగణాలను చూడాలె. ఆ అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్రను పరిశీలించాలె. ఏ పార్టీ చరిత్ర ఏంది..? తెలుసుకుని ఓటేయాలి’ అని సీఎం చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ పదేండ్ల పాలనలో ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చినం. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టినం. ఇవన్నీ మీకు తెలిసినవే’ అని సీఎం అన్నారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్ల పాలనలో కనీసం మంచి నీళ్లు కూడా ఇయ్యలే’ అని సీఎం విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. ఎవ్వళ్లు ఏం చేసిండ్రు. ఎవరి చేతిలో అధికారం ఉంటే ఏం చేస్తరు.
ఎవ్వళ్లు ప్రజల కోసం పాటు పడుతారు అనేది ఆలోచించి మీరు ఓటేసినట్టే అయితే మీకు లాభం జరుగుతది అని అన్నారు. కాంగ్రెస్ రాజ్యంలో అప్పులు ఉంటే, పన్నులు కట్టకపోతే దర్వాజాలు పీక్కపోయారు కానీ రైతుబంధు ఇవ్వాలని ఎవ్వడన్న ఆలోచన చేశారా..? ఆదుకున్నారా..? రైతుబంధు పుట్టించిందే బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే మరి రైతుబంధు కూడా ఆగమైతది. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే.. నేను ఇవాళ గ్యారెంటీగా చెబుతున్నా. తర్వాత నన్ను తప్పుపట్టుకోవద్దు. కరెంట్ కాట కలుస్తది గ్యారెంటీగా, ఎందుకంటే వారు చెబుతున్నారు. ఓడగొట్టుకుంటే మీదే తప్పు. మూడు గంటలే కరెంట్ ఇస్తామని చెబుతున్నారు. కర్ణాటకలో 20 గంటలని చెప్పి 5 గంటలు ఇస్తున్నారు. మరి ఐదు గంటల కరెంట్ కావాల్నా..? 24 గంటల కరెంట్ కావాల్నా..? మంచి క్వాలిటీ కరెంట్ కావాల్నా..? అని కేసీఆర్ ప్రశ్నించారు. నల్గొండ, నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్ధి లింగయ్యను అధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కోరారు.