సిర్పూర్ నుంచి పోటీ చేస్తా - బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ప్రకటన

సిర్పూర్ నుంచి పోటీ చేస్తా - బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ప్రకటన

ముద్ర ,ప్రతినిధి,  మంచిర్యాల : రాబోయే శాసనసభ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.  శుక్రవారం రాత్రి సిర్పూర్ నియోజకవర్గంలోని డబ్బా వ్రామంలో జరిగిన రోడ్ షోలో ప్రవీణ్ కుమార్ పై ప్రకటన చేసి రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తించారు.  ఇక్కడి నుంచి పోటీ చేస్తే గుండా గిరి ఆగుతుందని... పోలీసుల జులుం తగ్గుతుందని ...భయం గుప్పిట నుంచి విముక్తి లభిస్తుందని ....ప్రజలు విశ్వసిస్తే బీఎస్పీ జాతీయ అధినాయకురాలు, బహేన్ మాయావతి అనుమతి తీసుకుని సిర్పూర్ నుంచి పోటీ చేస్తానని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.  రాష్ట్రంలో ఎస్సీ రిజర్వుడు స్థానాలు ఎన్నో ఉండగా జనరల్ స్థానం సిర్పూర్  నుంచి పోటీ చేయాలని భావించడం వెనుక అంతర్యం ఏమిటనే ప్రశ్న   అందరిలో ఉదయిస్తోంది.  

ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న  ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ను  ఢీకొట్టడం అంత సునాయాసం కాకపోయినప్పటికీ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ ను ఎందుకు ఎంచుకున్నారో రాజకీయ వర్గాలకు అంతుచిక్కడం లేదు. సిర్పూర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం వెనక రాజకీయ కోణం దాగి వుందని మరోవైపు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  2014 ఎన్నికల్లో బీఎస్పీ తరపున కోనేరు కోనప్ప సిర్పూర్ నుంచి, నిర్మల్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి విజయం సాధించారు. ఆతర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు అప్పటి టీఆరేస్ లో చేరగా ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి అయ్యారు. బీఎస్పీ నుంచి కొనప్ప విజయం సాధించిన విషయాన్ని గమనంలోకి తీసుకొన్న ప్రవీణ్ కుమార్ వ్యూహాత్మకంగా సిర్పూర్ ను ఎంచుకున్నారని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో రగిలిన సెంటిమెంట్ వచ్చే ఎన్నికల్లో కూడా ప్రభావితం చేస్తుందని  బీఎస్పీ వర్గాలు ఆశిస్తున్నాయి.

నియోజక వర్గంలో ముస్లీమ్ లు, ఆదివాసీలు, దళిత ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడం తనకు కలిసి వస్తుందని ప్రవీణ్ కుమార్ అంచనా వేస్తున్నారు. బీఆరెస్ నుంచి కోనేరు కొనప్ప అభ్యర్థిత్వం దాదాపు ఖరారు కాగా కాంగ్రెస్ నుంచి కోరళ్ల కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి పాల్వాయి హరీష్ రావు బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఆ అభ్యర్థులు పోటీలో ఉంటే తమకు ఓట్ల పరంగా కలిసి వస్తుందని బీఎస్పీ అంచనా వేస్తోంది. అందరు అగ్రవర్ణాలకు చెందిన వారు కావడం , ప్రవీణ్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గంకు చెందిన నేత కావడం ఎన్నికల్లో  బలహీన వర్గం అభ్యర్థి అనే సెంటిమెంట్ రగిలితే తప్పక ఓట్ల ప్రయోజనం చేకూరుతుందని బలంగా వాదిస్తున్నారు. ఇలా అన్ని కోణాల్లో విశ్లేషించిన తరువాతనే ప్రవీణ్ కుమార్ సిర్పూర్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది.  

ఏ పార్టీ ఓటు బ్యాంకు కు చిల్లు ?

సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ బరిలో నిలుస్తే ఏ పార్టీ ఓటు బ్యాంకు కు చిల్లుపడుతుందనే వాదన ఇప్పటినే నుంచే వినిపిస్తోంది. బీఆరెస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీల్లో ఎక్కువ ఓట్లు బీఆరెస్ నుంచి చీలే అవకాశాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో  ముస్లీమ్ లు, ఆదివాసీలు, దళితులు బీఆరెస్ పక్షాన నిలిచారు. ప్రవీణ్ పోటీ చేస్తే ముఖ్యంగా దళితుల ఓట్లు పెద్ద ఎత్తున చీలుతాయని   రాజకీయ విశ్లేషణలు చెబుతున్నారు. అయితే ప్రత్యర్థుల వాదన భిన్నంగా ఉంది. బీఎస్పీ నాయకత్వం బలహీనపడుతున్న క్రమంలో పార్టీని, క్యాడర్ ను కాపాడుకోవాలని ప్రవీణ్ కుమార్ ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించి ఉంటాడని అంటున్నారు. ఎస్సీ రిజర్వు స్థానాలను వదిలి జనరల్ స్థానం సిర్పూర్ ను ఎంచుకోవడం వ్యూహాత్మక తప్పిదమని వాదిస్తున్నారు. ప్రకటించిన విధంగా ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేస్తారా ? లేక ఎన్నికల ముందు మరో స్థానంకు మారతారా ? అనేది వేచి చూడాలి !