నిర్మల్ జిల్లాలో భైంసా కేంద్రంగా బెట్టింగ్ దందా ...

నిర్మల్ జిల్లాలో భైంసా కేంద్రంగా బెట్టింగ్ దందా ...
  • ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు?
  • బెట్టింగ్ లో ప్రముఖులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:  మహా నగరాలకే పరిమితమైన బెట్టింగ్ దందా నిర్మల్ లాంటి పట్టణాలకు విస్తరించింది. ప్రధానంగా నిర్మల్ జిల్లా భైంసా కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ మట్కా, పేకాట తదితర అసాంఘిక కార్యకలాపాలను ఈ బెట్టింగ్ బృందం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బెట్టింగ్ నిర్వహిస్తున్న సమాచారంతో ఇద్దరిని పోలీసులు ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు విచారిస్తున్నారు. ప్రాథమికంగా ఈ విచారణలో విస్తుపోయే నిజాలు బహిర్గతమయ్యాయి. కేవలం ఐపిఎల్ మ్యాచ్ లే కాకుండా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకు కూడా ఈ బెట్టింగ్ కొనసాగుతుందని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

ఇదిలా ఉంటే బైంసా పట్టణానికి చెందిన రహమాన్ అనే వ్యక్తి ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ తదితర వ్యవహారాలను నడిపేందుకు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ని కూడా రూపొందించినట్లు సమాచారం. ఈ వెబ్సైట్ ఆధారంగా బెట్టింగ్ పూర్తిగా నడుస్తోందని ప్రాథమిక సమాచారం. బైంసా పట్టణం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉండడంతో నిర్మల్ జిల్లాతో పాటు మహారాష్ట్రకు చెందిన ధర్మాబాద్, నాందేడ్, నిజామాబాద్ కు ఆర్మూర్, కామారెడ్డి తదితర ప్రాంతాలకు కూడా వ్యాపించిందని పోలీసులు భావిస్తున్నారు.

కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా మట్కా కూడా ఈ బృందం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తుల నుంచి పోలీసులు విలువైన  సమాచారం రాబట్టినట్లు తెలిసింది. వారు ఇచ్చిన వివరాల ఆధారంగా బెట్టింగ్ లో పాల్గొన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు వారి బ్యాంక్ లావాదేవీలపై కూడా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ కు పాల్పడుతున్న వారిలో రాజకీయ నేతలు, రియల్ వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తోంది.